ఒకప్పుడు కన్నడ రచయితలు తమ సమావేశాలలో ఇంగ్లీషు మాటలు రాకుండా మాట్లాడాలని నియమం పెట్టుకున్నారట. ఏ వక్త అయినా తన ప్రసంగంలో ఎన్ని ఇంగ్లీషు మాటలు వాడితే అన్ని పావలాలు జరిమానా చెల్లించుకోవాలని కట్టడి చేశారు. ఇది ఎన్నాళ్ళు సాగిందో కాని ఈనాడు ఇది సాధ్యమయ్యే పనేనా?
తెలుగు రచయితలు కూడా ఒకప్పుడు ఇటువంటి ప్రయత్నాలు చేసి ఉండవచ్చు. ఒక సంస్కృతం మాటో ఒక ఇంగ్లీషు మాటో ఉర్దూ మాటో మరో భాషా పదమో దొర్లకుండా ప్రసంగించడం అసాధ్యమయిపోయిందీరోజు. తెలుగే మాట్లాడుతున్నాం, కాని అవసరమయినప్పుడు వాడుకలో నలిగిన అన్యభాషాపదం వాడితే తప్పేమీలేదు. అవసరం లేనప్పుడు కూడా వాటిని వాడడం వల్ల మన భాష అభివృద్ధి కుంటుపడుతుందనడంలో సందేహం లేదు.
ఇద్దరు తెలుగు వాళ్ళు కలుసుకుంటే ఇంగ్లీషులో మాట్లాడుకుంటారని హాస్యోక్తి. ఇదివరకు హైదరాబాదు నగరంలో ఇద్దరు తెలుగు వాళ్ళు ఉర్దూలో మాట్లాడుకోవడం, ఉర్దూలోనే తిట్టు కోవడం వింత విషయమేమీ కాదు. ఇటీవలి కాలంలో కొంత మార్పు వచ్చినా ఉర్దూలో మాట్లాడుకునే తెలుగువాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. దీనికి ఇంగ్లీషు జోడయిందిప్పుడు. ప్రయివేటు వైద్య శాలలు, ప్రయోగశాలలు, హోటళ్ళు, విద్యాసంస్థలు, ఇతర వ్యాపార సంస్థలు బాగా పెరిగి పోయింతర్వాత ఇంగ్లీషు మరీ పేట్రేగిపోయింది. మనం లోపల అడుగుపెట్టగానే ఒక రిసెప్షనిస్టు తయారు. మీకేంకావాలని ఇంగ్లీషులో చాలా మర్యాదగా అడుగుతారు, మన వేషం ఇంగ్లీషు వచ్చిన ముఖంలా కనిపిస్తే. మనం తెలుగులో మాట్లాడినా ఇంగ్లీషులోనే జవాబు చెప్తారు. తెలుగులోనే మాట్లాడవలసిన అవసరం వస్తే ఇంగ్లీషులో చూపించినంత మర్యాద కనిపించదు. వచ్చిన పెద్ద మనిషి రిసెప్షనిస్టు ముందు న్యూనతా భావం పొందక తప్పదు. ఇకలోపలికి వెళ్ళి కలవ వలసిన వ్యక్తి ముందు ఏం మాట్లాడతాడు. రిసెప్షనిస్టు బాధ్యత కూడా అదేనేమో.
ఈమధ్య ఒక డయాగ్నస్టిక్ సెంటరుకు పోవలసి వచ్చింది. వరండాలో కూర్చుని మావంతు కోసం ఎదురు చూస్తున్నాం. ఒకామె గదిలోనుండి బయటకు వచ్చి ఏంచేయాలో పాలుపోక తడబడుతూ అటూఇటూ చూసింది. నాపక్కనే కూర్చున్న మా ఆవిడ దగ్గరకు వచ్చి సందేహిస్తూ ‘యూరిన్ పాస్ చేసి రమ్మన్నారండి, అంటే ఏం చెయ్యాలండి’ అని అడిగింది. ఆమె చెప్పింది. వెళ్ళిపోయింది లోపలకు. ఆమెకు ఈమాట చెప్పిన వ్యక్తి పురుషుడు. తెలుగులో చెప్పడానికి సందేహించాడేమో. స్త్రీ అయినా తెలుగులో చెప్పి ఉండకపోవచ్చనుకోండి. చెప్పింతర్వాత పేషంటు ముఖంవైపు చూస్తే ఆమెకు అర్థమయిందీ లేనిదీ తెలిసేది. కానీ అంత తీరికెక్కడ? ఆమె మళ్ళీ అడగడానికి అవకాశమివ్వకుండా మరో పేషంటు. కొన్ని విషయాలు అర్థంకాక పొరపాట్లు కూడా జరగవచ్చు.
మనభాషలో ఒక మాట వాడితే బూతు. ఆదేమాటకు సంస్కృత పదమో, ఇంగ్లీషు మాటో, ఉర్దూ మాటో వాడితే పరవాలేదు. వస్తువదే, భావమదే. మన భాషలో అది ఎందుకు బూతు, మరోభాషలో ఎందుకు కాదు? మనకు ఇటువంటి నమ్మకాలు బాగా నాటుకుపోయి ఉన్నాయి. పూర్వకవులు ‘సహసానఖంపచస్తన దత్త పరిరంభ…” అంటూ సమాస భూయిష్టంగా రతివర్ణన చేస్తే సామాన్యులకు అర్థంకాదుగదా, పండితులకు మాత్రమే అర్థమవుతుంది పరవాలేదు, అది పండితులకు బూతుకాదేమో. ఇంగ్లీషు వాళ్ళు రాధికా సాంత్వనంలాంటి పుస్తకాలను నిషేధించినప్పుడు వాటిని పండితులకోసం ప్రచురణలుగా అచ్చువేసుకోనిచ్చారు. పరిణత బుద్ధులయిన పండితులు వాటిని చదివి చెడిపోరుగదా. పండితులు కానివాళ్ళు వాటిని చదివి అర్థం చేసుకోలేరుకదా. మరి నిషేధం ఎందుకు? ఎవరి తృప్తి వారిది.
సంస్కృతం విషయంలో చెప్పవలసిందేమీ లేదు. ఏ కొత్త మాట కల్పించుకోవాలన్నా మనం సంస్కృతం మీదే ఆధారపడుతున్నాం. ఇప్పుడు ఇంగ్లీషూ అంతే అనివార్యమయిపోయింది.
ప్రభుత్వ వ్యవహారాలూ, కార్యకలాపాలలోనూ, శాస్త్ర రచనల్లోనూ, వార్తాప్రసార ప్రచార సాధనాల్లోనూ ఇంగ్లీషు రోజురోజుకూ విస్తరిస్తోంది. కంప్యూటర్లూ, ఆధునిక సాంకేతిక పరికరాలూ విస్తరించే కొద్దీ ఇది మరీ ఎక్కువవుతుంది. ఇంగ్లీషు భాష విస్తరించడానికి నేటి అంతర్జాతీయ అవసరాలు ఒక ముఖ్యమైన కారణం. సాహిత్యం, సంస్కృతి, కళలు, అసలు జీవితమే అంతర్జాతీయమయి పోతూ ఉన్నప్పుడు భాషలు ఈ ప్రభావాల నుండి ఎలా బయటపడతాయి.
అందువల్ల మన పత్రికల భాషలో కూడా ఇంగ్లీషు మాటలు ఎక్కువయ్యాయి. వివిధ రంగాలకు సంబంధించిన విషయాలతో నిండి ఉండే పత్రికలలో ఇంగ్లీషు మాటల అవసరం తప్పదు మరి. ఈనాడు పత్రికలలో వాడే ఇంగ్లీషు మాటలను అర్థం చేసుకోవడానికి ప్రత్యేకంగా నిఘంటువులు అవసరమవుతున్నాయంటేనే ఇంగ్లీషు మాటల వాడుక ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఏవో కొన్ని పదాలే అయితే వాటికోసం ప్రత్యేకంగా నిఘంటువు అవసరంలేదు.వేల సంఖ్యలో పదాలు వచ్చి చేరినప్పుడే నిఘంటువు అవసరం ఏర్పడుతుంది. ఒక సామాన్య పాఠకుడు తేలికగా అర్థం చేసుకోవడానికి తగినట్లుగా ఉండవలసిన దినపత్రికలో వాడే మాటలకు నిఘంటువును చూసుకొని అర్థాలు తెలుసుకోవలసిన అవసరం ఏర్పడడం కూడా వింతే. ఆ పదాలు వాడే వారికీ నిఘంటువు కావాలి, చదివే వారికీ నిఘంటువు కావాలి.
పత్రికలోని ప్రతి అక్షరమూ సామాన్య పాఠకుడి కోసమే అనడం సమంజసంకాదేమో. పత్రికలోని అనేక అంశాలు ఆయా రంగాలకు సంబంధించిన విశిష్ట పాఠకులకు ఉద్దేశించినవి కాబట్టి ఈ పరిస్థితి ఏర్పడిందేమో.
-డి. చంద్రశేఖర రెడ్డి
98661 95673
రేపు:-
మన భాష-17
“పదజాలం”