Sunday, September 29, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమూన్ వాక్ ఇక కేక్ వాక్

మూన్ వాక్ ఇక కేక్ వాక్

Layouts:
ఏమి రామయ్యా!
దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?

ఏమీ లేదు భీమయ్యా! చంద్రుడి మీద వ్యవసాయం ఎలా చేయాలా? అని ఇన్నాళ్లూ ఆలోచించేవాడిని. ఇప్పుడు అక్కడికెళ్లాక ఇంటి కప్పుకు ఏ రేకులు వాడాలా! అని పెద్ద మీమాంస వచ్చి పడింది!

ఇందులో ఆలోచించుకోవడానికేముంది రామయ్యా? చక్కని ఆస్బస్టాస్ సిమెంటు రేకులు కూడా రెడీగా ఉన్నాయి కదా? అక్కడ పగలూ రాత్రీ చల్లగా ఉంటుంది. నువ్ కొన్న ఆస్బస్టాస్ రేకులు ఒక లోడ్ స్పేసినేని ట్రావెల్స్ వారి కార్గోలో వేస్తే…నువ్ అక్కడ ల్యాండ్ కావడానికంటే ముందే డెలివర్ చేస్తారు.

లేదు భీమయ్యా. భరత్ నగర్ బ్రిడ్జ్ పక్కన సెకండ్ హ్యాండ్లో కొన్న రేకులు చంద్రుడి మీద షెడ్డు వేసుకోవడానికి సరిపోతాయని ఇన్నాళ్లూ అనుకున్నా. అయితే తాజాగా చంద్రయాన్-3 అక్కడ కాలు పెట్టగానే చదువు సంధ్యల్లేని నాక్కూడా రాకెట్ సైన్స్ కు మించి ఎన్నెన్నో విషయాలు తెలిశాయి. దాంతో కొత్తగా ఎన్నెన్నో డౌట్లు వస్తున్నాయి.

అవేమిటో చెప్పు రామయ్యా. వారం రోజులుగా చంద్రమండలం బూడిద గడ్డల మీద నిలుచుని ఇస్రో శాస్త్రవేత్తల కంటే గొప్పగా విడమరచి చెప్పిన టీ వీ జర్నలిస్టుల వార్తలన్నీ చూశాను. నీ డౌట్లు క్లారిఫై చేస్తా.

అదే భీమయ్యా! మనకు భూమ్మీద 28 రోజులయితే చంద్రమండలం మీద ఒక రాత్రి, ఒక పగలట కదా? పైగా చంద్రుడి మీద సూర్యుడయినా వణికి చచ్చేంత చలి ఉంటుందనుకుని… ఎముకలు కొరికే చలిని తట్టుకోవడానికి మాత్రమే ఏర్పాట్లు చేసుకున్నాను. తీరా చూస్తే…ఇప్పుడు అక్కడ పగలు విపరీతమయిన ఎండలట కదా? ఎలా తట్టుకునేది? ఏ సీలవీ ఉండాలేమో!

రామయ్యా! 24 గంటలూ స్మార్ట్ ఫోన్లో వార్తలు బాగా ఫాలో అవుతున్నావే. ఇస్రో చైర్మన్ సోమనాథ్ లెవెల్లో టెక్నికల్ ఐష్యూస్ లోకి దిగిపోయావు!

లేదు రామయ్యా! అమెరికాలో ఉన్న మా మనవరాలు నా పేరిట చంద్రుడి మీద నలు చదరంగా ఉన్న నాలుగెకరాలు నార్త్ ఈస్ట్ ఫేసింగ్ రోడ్ కార్నర్ బిట్ కొని…రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు వాట్సాప్లో పంపింది. మనవడు, మనవరాలు పుట్టినప్పుడు పనులు చేసి పెట్టడానికి నేను, మా ఆవిడ చాలాసార్లు అమెరికాకు వెళ్లి వచ్చాము కానీ…ఇప్పుడు ఈ వయసులో ఈ చంద్రపొలం చూసుకోవడానికి అంత దూరం పోయి రాగలనంటావా? అదే నా బాధ.

నువ్వే నయం రామయ్యా! ఏమయినా నువ్ అదృష్టవంతుడివి. మా పిల్లలు, వారి పిల్లలు కూడా ఉన్నారు. ఎందుకూ కొరగారు. నీకోసం ఏకంగా చంద్రమండలంలో నాలుగెకరాల ల్యాండ్ కూడా కొన్నారు. మా పిల్లలందరూ మొన్న ఇక్కడికొచ్చి నా సహస్ర చంద్ర దర్శనోత్సవం చేసి… శంకర్ పల్లిలో నేను యాభై ఏళ్ల కిందట కొన్న నాలుగెకరాలు, ఉంటున్న ఇల్లూ అమ్మి…అందరూ సమానంగా పంచుకుని…అందరూ మాతో సెల్ఫీలు తీసుకుని…మమ్మల్ను బాధ్యతగా వృద్ధాశ్రమంలో చేర్చి వెళ్లారు.

పోనిలే భీమయ్యా! బాధ పడకు. మాతోపాటు మీరు కూడా చంద్రపొలానికే వద్దురుగానీ…మాకూ తోడుంటుంది. మీకూ పొద్దు పోతుంది.

రామయ్యా! నువ్ మనిషి కాదు!

ఊకో! ఊకో! భీమయ్యా!
ఎమోషనల్ గాకు!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్