“ఓ వరుణ దేవుడా!
నీకు దండాలు. నీళ్లకు నీవే దిక్కు.
మొసలి వాహనుడా!
చేతిలో పాశం పట్టుకుని, ఒళ్లంతా తెలుపు, నీలం, నలుపు మేఘాలను వస్త్రాలుగా ధరించిన దేవుడా!
మెరుపు తీగలు అలంకారంగా కలిగినవాడా!
ఉరుముల శబ్దాలతో బయలుదేరేవాడా!
భూమి మీద ఉన్న నదీ నదాలు చెరువులు కుంటలు జలాశయాలు…అన్నిటినీ నీ నీటితో నింపు.
గాలికి తేలిపోయే మేఘాలనన్నిటిని ఒడిసిపట్టుకో.
నీ కడుపులో దాచుకున్న నీటిని వర్షించు.
ఆవిరిగా ఆ నీటిని నువ్వే మళ్లీ మళ్లీ తాగు.
తాగిన నీటిని మళ్లీ మళ్లీ వర్షించు.
నువ్వు, నీ అధిపతి ఇంద్రుడు చల్లగా ఉందురుగాక!”
వరుణదేవుడి స్తోత్రానికి దాదాపుగా అర్థం ఇది. మేఘం- నీరు- ఆవిరి; మేఘం స్వరూప స్వభావాలు; మేఘాలు ఏర్పడే ప్రక్రియ- అన్నిటినీ ఈ వరుణ మంత్రం ఒక వీడియోలా చూపుతోంది.
ప్రజా ప్రభుత్వాల్లో అనేక శాఖలు, వాటి నియామకాలకు అనేక దశలు, ఆ ఉద్యోగాల స్వరూప, స్వభావాలకు తగినట్లు జీతభత్యాలు ఉంటాయి. జిల్లాల్లో కలెక్టర్లు, ఆ పైన కార్యదర్శులు, వీరందరినీ చూడ్డానికి ప్రధాన కార్యదర్శి ఉంటారు.
సకల భువన భాండాలను పరిపాలించడానికి కూడా విశ్వాత్మకుడికి ఇలాంటి నిర్వహణా విధానమే ఉంది. పరమాత్మ కూడా ఒక్కొక్క కార్యదర్శికి ఒక్కొక్క పని అప్పగించాడు. యు పి ఎస్ సి ప్రిలిమ్స్, మెయిన్స్, మౌఖిక ఇంటర్వ్యూల కంటే అష్టదిక్పాలకులకు విష్ణువు పెట్టిన పరీక్షలు కఠినతరమయినవి. స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ లా అగ్నిదేవుడు రోజూ దేవతలకు అన్నం పొట్లాలు మోసుకెళ్లి ఇవ్వాలి. ఒకే సూర్యుడిలో ఒకే కాలంలో వెయ్యి కిరణాలు విస్ఫోటనం కావాలి. ఒక ప్రాంతానికి వేడిని ఇవ్వాలి. అదే సమయంలో మరొక ప్రాంతానికి వేడిని పరిహరించి వెలుగును మాత్రమే ఇవ్వాలి. ఇంతకంటే లోతుగా వెళ్లడానికి ఇది వేద శాస్త్ర పాఠం కాదు.
ఇంద్రుడు దేవుడే అయినా ప్రధాన కార్యదర్శిలాంటి వాడు. ప్రధాన కార్యదర్శికి ముఖ్యమంత్రి ప్రభువు. ఇంద్రుడికి విష్ణువు ప్రభువు. భాగవతంలో ఇంద్రుడికెందుకు హవిస్సులు? మనకు అన్నీ ఇచ్చే కొండకే ఇద్దాం…అని కృష్ణుడు అన్నప్పుడే ఇంద్రుడు హర్ట్ అయి ఒక వారం రోజులు రాత్రి పగలు ఎడతెరిపి లేని వర్షాలు కురిపించాడు. చిటికెనవేలు గోటిమీద అలవోకగా పూలగుత్తిని నిలిపి అడ్డుకున్నట్లు కృష్ణుడు గోవర్ధన గిరి పర్వతాన్ని గొడుగుగా పట్టుకుని…ఇంద్రుడికి బుద్ధి చెప్పాడు. తప్పు తెలుసుకుని ఇంద్రుడు కృష్ణుడికి పాలతో గోవింద పట్టాభిషేకం చేశాడు. ఆ క్షణం నుండే కృష్ణుడు గోవిందుడు, గిరిధారి అయ్యాడు. అప్పుడు ఇంద్రుడు ఎన్ని రకాల మేఘాలను కృష్ణుడి మీదికి వదిలాడో లెక్కే లేదు. ఈ ఘట్టాన్ని మన పోతన పరవశించి ప్రత్యక్షరాన్ని మంత్రమయం చేశాడు.
వర్షాలు పడకపోతే వరుణజపం, వరుణ హోమం చేస్తారు. విరాటపర్వం చదువుతారు. కప్పలకు పెళ్లిళ్లు చేసి ఊరేగిస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం అనాదిగా ఉంది.
గాలిలో దీపం వెలిగించి దేవుడా నీదే భారం అంటే దేవుడు కూడా ఏమీ చేయలేడు కాబట్టి…మానవ ప్రయత్నం చేయకతప్పదు. వర్షాలు ఎక్కువైన చోట మేఘాలను అడ్డుకుని…వర్షాలు తక్కువైన చోట మేఘాలను పట్టి నీళ్లు కురిపించుకోవడానికి అమెరికా, కెనడా, చైనా, రష్యా, ఆస్ట్రేలియా దేశాలు ఎప్పటినుండో ప్రయోగాలు చేశాయి. ఆశాజనకంగా ఫలితాలను రాబట్టుకున్నాయి. భారత దేశంలో అతివృష్టి, అనావృష్టితో అన్ని ప్రాంతాలు ఇబ్బంది పడుతున్నాయి.
మేఘమథనం(క్లౌడ్ సీడింగ్) ద్వారా కృత్రిమంగా వర్షాలు కురిపించడం మనకు తెలిసిందే. విమానాల్లో పైకి వెళ్లి మేఘాలమీద సిల్వర్ అయొడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్ లాంటి రసాయనాలను చల్లడం ద్వారా అందులో నీటిని పిండుకోవడం మనం చూసిందే. కొంతవరకు దీనితో ప్రయోజనం ఉన్నా…ఖర్చు తడిసి మోపెడవుతుండడంతో ప్రభుత్వాలకు తలకు మించిన భారమై వద్దనుకున్నాయి.
మన మేఘమథనంలో వర్షాలు కురిపించడం వరకే పని. కురిసే మేఘాలను ఆపే సాంకేతికత లేదు. ఇప్పుడు భారత వాతావరణ శాఖ అతివృష్టి ఉన్నచోట్ల మేఘాలను నియంత్రించే పనిని, వడగండ్లు, పిడుగులను నియంత్రించే పనిని కూడా కలిపి “మిషన్ మౌసమ్” పేరిట పూనా కేంద్రంగా భారత ఉష్ణమండల వాతావరణ అధ్యయన సంస్థ(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ- ఐ ఐ టీ ఎం)పెద్ద క్లౌడ్ ఛాంబర్ ను ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ అనేక శాఖల సమన్వయంతో అనేక ప్రయోగాల తరువాత ఐదేళ్లల్లో ఈ ఛాంబర్ ఆవిష్కరణలు పూర్తిగా అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం అనుకుంటోంది.
మంచిదే.
అప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడే వర్షం.
ఇక చాలు! ఆగు! అంటే…ఎంతటి-
సంవర్త; ఆవర్త, పుష్కలావర్త; ద్రోణ, కాల, నీల, మహాకాల మేఘాలైనా కురవకుండా ఆగిపోవాల్సిందే!
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు