Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనిత్యానందం కోసం...

నిత్యానందం కోసం…

Positive Attitude: కొత్త సంవత్సరం వచ్చింది. కొంచెం హుషారుగా, ఆనందంగా ఉందా లేక అదే కరోనా, క్వారంటైన్, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఉసూరుమంటున్నారా? ప్రతిసారిలాగే న్యూ ఇయర్ రిసొల్యూషన్స్ పెట్టుకుని వచ్చే ఏడు చూద్దాంలే అనుకుంటున్నారా ? అయితే కొన్ని మంచి పద్ధతుల ద్వారా జీవితాన్ని నిత్య సంతోషంగా మార్చుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇందుకు వారు సులువైన కొన్ని చిట్కాలు చెప్తున్నారు. మనకు తెలిసినవే అయినా పెద్దగా దృష్టి పెట్టని ఈ అంశాలు ఓ మాటు పట్టించుకోండి.

బంధాల బలోపేతం
అందరితో అన్నివేళలా మంచి సంబంధాలు ఉండవు. చాలాసార్లు ఇష్టం లేనివారిని తలచుకుని తిట్టుకుంటూ ఉంటాం. దీనివల్ల జరిగే కీడే ఎక్కువ. మనకు ఎవరితోనన్నా మనస్పర్థలు ఉంటే తొలగించుకోవాలి. అలాగే ఉన్న బంధాల్ని ఇంకా మెరుగుపరచుకోవాలి. చాలా రోజుల క్రితం కలిసిన మిత్రులు లేదా బంధువులను పలుకరించి చూడండి. మీలో మార్పు మీకే తెలుస్తుంది

క్షమించేయండి…
సంతోషానికి దగ్గరిదారి క్షమ. కోపం వచ్చినపుడు గొడవ పడటం సహజమే. దాన్ని మనసులో పెట్టుకుంటే మన సంతోషమే హరించుకుపోతుంది. మనమే ముందు సారీ చెప్పినా, క్షమించినా అది సంతోషాన్నే ఇస్తుంది. అందుకే క్షమాగుణం ఉన్నవాళ్లకు కోపం త్వరగా రాదు. నిరాశకు గురికారు. మానసిక స్థిరత్వం ఉంటుంది. కుటుంబానికి, స్నేహితులకు వీరే ఆధారంగా ఉంటారు.

అందరి క్షేమం
అందరూ బాగుండాలి అందులో మనముండాలి అనుకుంటే అనందం మనవెంటే ఉంటుంది. ఎదుటివారి కష్టాన్ని గమనించి సాయం అందించే సహృదయత చక్కటి జీవితానికి పునాది. అలాగని అనవసరంగా అందరి విషయాల్లో తల దూర్చకుండా కోరుకున్నవారికి అవసరమైన సాయం చెయ్యాలి.

దయ చూపాలి
దయ చూపడానికి ప్రకటించడానికి తేడా ఉంది. అయ్యో పాపం అనుకోడానికి, అక్కున చేర్చుకోడానికి ఉండే భేదం లాంటిదన్నమాట. చాలామంది దయ చూపుతున్నామంటూ తోచినవి దానం చేస్తారు. అలా కాకుండా అవతలివారు కోరుకున్నవి ఇస్తే రెండువైపులా కలిగే సంతోషమే వేరు.

కృతజ్ఞత
మనకు అందుతున్న సహాయానికి ఎప్పుడూ కృతజ్ఞులమై ఉండాలి. సదా తలచుకోవాలి. భగవంతుడి లానే సాయం చేసిన వారిని గుర్తుపెట్టుకోవాలి. ఆ సాయం గుర్తు వచ్చినప్పుడల్లా సంతోషం కలుగుతుంది.

సంసిద్ధం
దేనికైనా సిద్ధంగా ఉండడం, తెలుసుకోడానికి, నేర్చుకోడానికి అనువైన మనస్తత్వం కలిగి ఉండటం సంతోష కారకమే. కొత్త ఆలోచనలు, వ్యక్తులు, భిన్నాభిప్రాయాలు పంచుకుంటూ, తెలియనివి అంగీకరించేవారు జీవితంలో చక్కటి వృద్ధి సాధిస్తారు.

ఈ క్షణంలో బతకాలి
ఆ రోజులే బాగున్నాయని నిట్టూర్చేవారు చాలామంది ఉంటారు. ఇదేమంత ఆనందించదగిన విషయం కాదు. గతాన్నో భవిష్యత్తునో తలుచుకోవడం కన్నా వర్తమానంలో జీవించడమే సంతోషానికి దోహద పడుతుంది.

ఇవండీ ఖర్చు లేకుండా సంతోషాన్నిచ్చే చిట్కాలు. మరి ఆచరించి ఆనందిద్దామా!

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్