Sunday, November 24, 2024
HomeTrending NewsBotsa: మాకు పబ్లిసిటీ అవసరం లేదు: బొత్స

Botsa: మాకు పబ్లిసిటీ అవసరం లేదు: బొత్స

మణిపూర్  విద్యార్థులను  ప్రభుత్వం పట్టించుకోలేదనే వార్తల్లో నిజం లేదని, వీటిని  ఎవరూ నమ్మనవసరంలేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. “అందరిలాగా, మేం పబ్లిసిటీని కోరుకోం. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు అప్రమత్తంగా బాధ్యతగా పనిచేయాల్సిన ప్రభుత్వం అధికారయంత్రాంగం తమ పని తాము చేసుకుంటూ ముందుకెళ్తుంది. కానీ, మేం ఇలా చేస్తున్నాం.. అలా చేస్తున్నాం.. అని ప్రచారాన్ని కోరుకునే ప్రభుత్వం మాదికాదు. మణిపూర్‌లో ఉన్న విద్యార్థులతో కొందరితో స్వయంగా నేనే మాట్లాడాను. వారు అక్కడ ఎదుర్కొంటున్న పరిస్థితిని తెలుసుకున్నాను. హెల్ప్‌లైన్‌ నెంబర్‌ను వారికి చెప్పి.. అక్కడ వారికి ఏం కావాలో అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే 150 మందికి సరిపడా ప్రత్యేక విమానం కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇంకా విద్యార్థుల సంఖ్య పెరగడాన్ని బట్టి అదనంగా ప్రత్యేక విమానాల్ని ఏర్పాటు చేస్తాం. ఈ వ్యవహారాలన్నీ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి దాస్‌ గారి నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌లు పర్యవేక్షిస్తున్నారు” అంటూ బొత్స వివరించారు.

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు ప్రాంతాల్లో ఇప్పటికే కోతకోసిన ధాన్యం కళ్లాల్లో తడవడం, తేమశాతం పెరగడం వంటి నేపథ్యంలో రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నందున.. ఆయా జిల్లాల్లో అధికారయంత్రాంగంతో పాటు స్థానిక మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారని బోత్స చెప్పారు.  రైతులు నష్టాన్ని ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఎవరో ఒకరు వారిదగ్గరికి వెళ్లి రాజకీయాలు చేయడం తగదని, వారిని ఏ విధంగా ఆదుకోవాలనే దిశగా వారికి ధైర్యం చెబుతూ పనిచేసుకుంటూ పోవాలి గానీ రాజకీయాలు చేయడం నాయకత్వ లక్షణం కాదని చంద్రబాబును ఉద్దేశించి బొత్స వ్యాఖ్యానించారు.

“ఈరోజు మణిపూర్‌లో విద్యార్థులు భయాందోళనకు గురైనా.. అధికవర్షాలతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల రైతులు ఆర్థికంగా నష్టపోయిన క్రమంలో వారికి ప్రభుత్వం తరఫున ధైర్యం చెప్పి అన్నిరకాలుగా ఆదుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మిగతా పార్టీ నేతల్లాగా మేం మాటలతో కాదు. చేతలతో చేసి చూపించి బాధితులకు భరోసానిచ్చే నాయకులుగానే ఉంటాం” అని పేర్కొన్నారు.

ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కన్నా అదనంగా అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బొత్స హెచ్చరించారు. దీనికోసం ప్రభుత్వం తరఫున ఒక విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశామని, అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు గానీ, వారి తల్లిదండ్రులు గానీ ఆ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే తప్పకుండా యాక్షన్‌ ఉంటుందని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్