మహిళల పట్ల బిజెపి నేత బండి సంజయ్ ఉపయోగిస్తున్న భాష అభ్యంతరకరమని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఇలా చులకనగా మాట్లాడుతున్నవారికి తెలంగాణా ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బెంగాల్ లో మమతా బెనర్జీని మోడీ అవమానపరిస్తే ఏం జరిగిందో గుర్తుంచుకోవాలన్నారు. బతుకమ్మపై బండి సంజయ్ వ్యాఖ్యలతో తాను బాధపడ్డానని, వైఎస్ హయంలో బతుకమ్మ ఆడడానికి భయపద్దవాళ్ళు ఇప్పుడు బతుకమ్మ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. మీడియాతో కవిత చిట్ చాట్ చేశారు. జాతీయ స్టాయిలో బిజెపికి ప్రత్యామ్నాయం బిఆర్ఎస్ మాత్రమేనని అందుకే బిజెపి నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. జాతీయ స్థాయిలో బిజెపికి ప్రత్యామ్నాయం అవసరమని, బిజెపి వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించారు. తాము యజ్ఞాలు, యాగాలు చేసి ఓట్లు అడగడంలేదన్నారు. సంస్కృతి గురించి మాట్లాడితే నక్సలైట్ అని ముద్ర వేసే స్థాయికి బిజెపి చేరుకుందన్నారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వీక్ భాష కంటే వీక్ రూపాయి మీద దృష్టి పెడితే మంచిదన్నారు. హిందీ వస్తేనే రాజకీయాలు చేయాలా అంటూ ప్రశించారు. సిబిఐ వాళ్ళు వస్తారు, వెళతారు అన్నారు. భారత్ జాగృతి ఎప్పుడో రిజిస్టర్ అయ్యిందని, తరలోనే దీని కార్యకలాపాలు ఉధృతం చేస్తామన్నారు. తనకు దేశవ్యాప్తంగా పరిచయాలు ఉన్నాయని, ఇది జాగృతి విస్తరణకు దోహదపడుతుందన్నారు. దేశ యువతను మేల్కొలపడమే భారత్ జాగృతి లక్ష్యమన్నారు. బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరని ప్రశ్నించగా సస్పెన్స్ కొనసాగనీయండి అని పేర్కొన్నారు. షర్మిల అంటే షర్మిల పాల్ అనే పరిస్థితి వచ్చిందన్నారు.