Women’s Day: మార్చి 8 వస్తోందంటే చాలు , పేపర్లు, టీవీల్లో మహిళా దినోత్సవం గురించి హోరెత్తుతుంది. అలాఅని వారికోసం ప్రత్యేక పథకాలు ఏమీ ఉండవు. నామ మాత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కొన్ని దేశాల్లో మాత్రం బాగా జరుపుకుంటారు. భుక్తి, శాంతి కావాలని రష్యన్ మహిళలు పోరాడుతూ 1917 లో మొదటిసారిగా మహిళా దినోత్సవం జరుపుకున్నారు. ఆ తర్వాత వారికి అనేకరంగాల్లో సమాన హక్కులు కల్పించారు. ఈ స్ఫూర్తి మెల్లగా ఐరోపా దేశాలకు పాకి మార్చి 8 ని మహిళా దినోత్సవంగా గుర్తించడం మొదలైందని చెప్తారు. ఈ క్రమంలో అన్నిదేశాలూ అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవడం సంతోషమే. కానీ…
- ఇప్పటికీ చాలా రంగాల్లో మహిళల కు సమాన వేతనం అందడం లేదు
- మహిళల శ్రమశక్తిని దోచుకునే విధంగానే అన్ని విధానాలూ ఉంటున్నాయి
- లింగ వివక్షకు వ్యతిరేకంగా, సమానత్వ సాధనకు తోడ్పడేలా పురుషులను తయారుచేసే విధంగా విద్య,
- ఉద్యోగరంగాలు ఇప్పటికీ విధానాలు రూపొందించలేదు
- ఆడవారిపై అత్యాచారాలు ఏ మాత్రం తగ్గలేదు
- రాజకీయాల్లో మహిళల పాత్ర స్వల్పమే
- ఇప్పటికీ విద్యకు నోచుకోని మహిళలు ఎందరో
- వరకట్నం, లైంగిక వేధింపులకు మహిళలు బలికాని రోజు లేదు
- మహిళా దినోత్సవం అనగానే డిస్కౌంట్లు ఇస్తే చాలనుకునే వ్యాపారస్తులు
- క్లబ్బుల్లో, పబ్బుల్లో తగ్గింపురేట్లతో తాగమనే ప్రకటనలు
- ప్రభుత్వం చేసే మొక్కుబడి ఉత్సవాలు
1975ని అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ప్రకటిస్తే ఇన్నేళ్ళలో ఎప్పుడన్నా మహిళాదినోత్సవం రోజు వారికి మేలుచేసే పథకం ఒక్కటన్నా ప్రభుత్వాలు ప్రకటించాయా? భారత దేశంలో పనిచేసే మహిళల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది. ఢిల్లీ లాంటి నగరాల్లో వేధింపుల కారణంగా పై చదువులు మానేస్తున్నవారు ఎందరో. అనేక నగరాల్లో మహిళలు పనిచేసేచోట, ప్రయాణాల్లో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. అసలు చాలామందికి విద్య, ఉద్యోగం, వివాహం వంటి అంశాల్లో స్వయం నిర్ణయాధికారం లేదు.
వరకట్న నిషేధ చట్టం వచ్చి ఏళ్లయినా ఇప్పటికీ వరకట్న మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయితే పూర్తిగా అభివృద్ధి లేదనీ చెప్పలేం. ఇదివరకటికన్నా మహిళలు తమకు కావలసింది ధైర్యంగా అడుగుతున్నారు. స్వేచ్ఛ సమానత్వం కోసం కొందరు కుటుంబాలనూ వదులుకుంటున్నారు. క్రీడలు, విద్య, రాజకీయాలు, వ్యాపార రంగాల్లో ప్రగతి కనిపిస్తోంది. కానీ ఇది గోరంతే. వారికి నిర్దేశించిన చట్టాలు, పథకాలు సరిగా అమలైతేనే నిజమైన మహిళా దినోత్సవం. అలాగే నిర్భయ, దిశ వంటి సంఘటనలు జరగని రోజే భారతావనిలో మహిళల భద్రతకు పెద్ద పీట వేసినట్లు. ఆ రోజు రావాలని కోరుకుందాం. ఈ ఏడాది థీమ్ ‘ బ్రేక్ ది బయాస్’. అంటే అన్ని రంగాల్లో వివక్షను అధిగమించాలని.
ఏదేమైనా సమాన పనికి సమాన వేతనం కావాలనే డిమాండ్ తో మొదలైన ఉద్యమం ఒక ఉత్సవంగా మిగిలిపోవడమే విషాదం. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు!
-కె. శోభ
ఇవి కూడా చదవండి: చెట్టుకింద చదువులే మేలు