ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటు పోయినంతమత్రాన పెద్దగా వచ్చే మార్పేమీ ఉండదని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలపై సమీక్షించుకొని ముందుకెళ్తామని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమికి బాధ్యత తీసుకుంటానని ఇలాటివి మళ్ళీ జరగకుండా మరింత కష్టపడి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అవకాశం లేదని తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిచే పరిస్థితే లేదని, ఇప్పుడున్న దానికంటే దిగజారతారని  జోస్యం చెప్పారు. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ముఖ్యమంత్రి పరిధిలోని అంశమన్నారు.

పరిపాలనా వికేంద్రీకరణ ప్రధాన అజెండాగా వచ్చే ఎన్నికలకు వెళ్తామని బొత్స వెల్లడించారు.  తమ పార్టీ విధానానికి కట్టుబడే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని, తన వ్యక్తిగత అభిప్రాయం అయితే రేపటి నుంచే విశాఖ రాజధానిగా ఉండాలని అనుకుంటానని స్పష్టం చేశారు.  కొన్ని దుష్ట శక్తులు పరిపాలనా వికేంద్రీకరణకు అడ్డు తగులుతున్నాయని ఆరోపించారు. ఒక షామియానా వేసుకొని కూర్చోవడం ఉద్యమం కాదని బొత్స ఎద్దేవా చేశారు. లాండ్ పూలింగ్ తో జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారమేనని పునరుద్ఘాటించారు. బాబు స్వార్ధం కోసమే ఇది జరిగిందన్నారు.

సోమవారం, ఏప్రిల్ 3 నుంచి 18వరకూ జరగనున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని బొత్స చెప్పారు. కేవలం ప్రభుత్వ టీచర్లు మాత్రమే ఇన్విజిలేటర్లుగా ఉంటారని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు తీసుకు వచ్చేందుకు ఎవరికీ అనుమతి లేదని తేల్చి చెప్పారు.  రాష్ట్ర వ్యాప్తంగా 6.69 లక్షల మంది విద్యార్ధులు టెన్త్ పరీక్షలకు హాజరవుతున్నారని, 3,349 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని  చెప్పారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ  సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకూ పరీక్ష ఉంటుందన్నారు. 9 గంటల నుంచీ పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించేందుకు అనుమతిస్తామన్నారు.

సోమవారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒంటిపూట బడులు మొదలవుతాయని చెప్పారు. జూన్ నాటికి ప్రభుత్వ స్కూళ్ళలో డిజిటల్ విద్యా విధానం అమలు చేస్తామని బొత్స చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *