Saturday, January 25, 2025

మన భాష- 11

ఒక సంస్కృత పదంలో ఏ వర్ణం మహాప్రాణమో సందేహం కలగడం వల్ల ఒకదానికి బదులు మరోదానికి ఒత్తు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి పొరపాటు మహాప్రాణాల విషయంలో రెండోరకం. ఇది రెండక్షరాల మాటల్లో కూడా జరగవచ్చు. ఉదాహరణకు బాధ అనే మాటను తీసుకోవచ్చు. ఈ మాటలో ‘ధ’ మహాప్రాణం. కాని కొందరి ఉచ్చారణలో మొదటి అక్షరం మహా ప్రాణమై ‘భాద’ ఏర్పడుతుంది. ఇది ‘బాధ’నుండి ఏర్పడ్డ మాటలన్నింటిలోనూ జరగవచ్చు. బాధితుడు, బాధితురాలు, క్రియగా బాధించు. ఇది బాధా శబ్దం. బాధృ ధాతువు. విలోడనం అంటే కలియబెట్టడం అని అర్థం. దీనివల్ల కలియబెట్టబడతారు కాబట్టి బాధ. బాధ, పీడ, వ్యధ, దుఃఖం, ఆమనస్యం, ప్రసూతిజం అన్న ఆరూ మనఃపీడకూ; కష్టం, కృచ్ఛం, ఆభీలం అన్నవి శరీర పీడకూ పేర్లంటారు. ఈ తొమ్మిదింటినీ దుఃఖానికే పేర్లుగా వాడతారు. బాధ్యం, బాధ్యత వంటి మాటలు కూడా ఇటువంటివే.

బాధలాగే మహాప్రాణాన్ని తారుమారుచేసే మరోమాట భేదం. భిదిర్ ధాతువు. కలిసి ఉన్నవాటిని వేరుచేయడం భేదం. సామ, దాన, భేద, దండోపాయాలన్న నాలుగు ఉపాయాలలో భేదం ఒకటి. దీనికి ఉపసర్గలు చేరి విభేదం, ప్రభేదం వంటి మాటలు ఏర్పడతాయి. భేదించు అనే క్రియాపదం ఏర్పడుతుంది. భేద్యం, అభేద్యం, దుర్భేద్యం, భేదకం వంటి చాలా మాటలను ఉత్పన్నం చేసుకోవచ్చు.

మరొకమాట బోధన, బుధ ధాతువు, తెలియడం. దీనినుండే బుద్ధి. బోధకులు అంటే మేలుకొలిపేవాళ్ళు. బోధన అంటే మేలుకొల్పడం, చదువుచెప్పడం, ఉపదేశం చేయడం అన్న అర్థంలో వాడుతున్నాం. బోధకులు అంటే మతప్రచారకులు అనే అర్థం కూడా ప్రచారంలో ఉంది. బుధ ధాతువు నుండి వచ్చిన ఎన్నో మాటల్లో సంబోధన, ప్రబోధం, విబుధులు, బుధులు, ఉద్బోధం, బోధి, బుద్ధుడు, సంబుద్ధి మొదలయినవి ముఖ్యమైనవి. బోధించు, సంబోధించు, ప్రబోధించు, ఉద్బోధించు అని క్రియారూపాలు కూడా వాడుకలో ఉన్నాయి.

బంధం అన్నమాటకు కూడా పొరపాటుగా భందం అని రాయవచ్చు. బంధ ధాతువు. బంధం అంటే కట్టు. బంధనం అంటే కట్టివేయడం అనీ, కట్టే సాధనం అనీ అర్థం. దిగ్బంధం, దిగ్బంధనం నాలుగువైపుల నుండీ కట్టి వేయడం. ప్రబంధం అంటే ప్రకృష్టమైన బంధం. మను చరిత్ర, వసుచరిత్ర లాంటివి. నిర్బంధం అంటే గట్టిగా బంధించడం, బలాత్కారం. సంబంధం, అనుబంధం మొదలయిన మాటలెన్నో ఈ బంధం నుండి ఏర్పడతాయి. బంధితుడు, బంధితురాలు, నిర్బంధితుడు, నిర్బంధితురాలు, సంబంధితుడు లాంటి పదాలను ఏర్పరచుకోవచ్చు. బంధించు, నిర్బంధించు, అనుబంధించు మొదలయిన విధంగా క్రియాపదాలుగా వీటిని వాడవచ్చు. బంధువు, బాంధవుడు అన్న మాటలు సగోత్రత్వాన్ని తెలుపుతాయి. బాంధవ్యం దీని నుండి వచ్చింది.

ఛేదనలో ఛిదిర్ ధాతువు. ఛిదిర్ అంటే రెండుగా చేయడం, చీల్చడం, నరకడం. దీనినుండే విచ్ఛేదన. ఛేదించు అనే క్రియ కూడా ఏర్పడుతుంది.

దగ్ధంలో మొదటి ద కారాన్ని మహాప్రాణంగా రాయకూడదు. ఈ మాటలో దహ ధాతువు. అందువల్ల మొదటి ‘ద’ అల్పప్రాణమే. ఈ ధాతువుకు భస్మీకరణం, బూడిదగా చేయడం అని అర్థం. దగ్ధం అంటే కాల్చబడినది.

బీభత్సం అన్నమాటను భీభత్సం అని భీబత్సం అనీ రాస్తుంటారు. బీభత్సం శృంగారవీర కరుణ అద్భుతహాస్య భయానక బీభత్స రౌద్ర శాంత అనే తొమ్మిది రసాలలో ఒకటి. బీభత్స అంటే నింద. నిందకలిగినది బీభత్సం. మనస్సును కష్టపెట్టేది. జుగుప్స ఈ రసానికి స్థాయీభావం. జుగుప్స అంటే రోత, బీభత్స దృశ్యం అంటే రోత కలిగించే దృశ్యం. అర్జునునికి బీభత్సుడు అని పేరు. ఇది వికృతి అయి వివ్వచ్చుడు అయింది.

దృఢం అంటే బలమైనది. దీనిలో ధాతువు దృహ. దృహ అంటే వృద్ధి. బాగా బలమైనది అనే అర్థంలో సుదృఢం అని వాడవచ్చు.

సందిగ్ధం అంటే అస్పష్టం, అనుమానం. దీని వ్యతిరేకార్థక పదం అసందిగ్ధం. స్పష్టం, నిశ్చయాత్మకం అని అర్థం.

స్తంభం అంటే మ్రాన్పాటు. చేష్ట లేకుండా ఉండడం. కంబం అని కూడా అర్థం. కంబం అన్నమాట స్తంభానికి వికృతి. స్తంభం అంటే స్థిరంగా ఉండేది. చెట్టు వేళ్ళకూ కొమ్మలకూ మధ్య భాగాన్ని కూడా స్తంభం అంటారు. దీన్ని ప్రకాండం అని కూడా అంటారు. పూర్తిగా నిలిచిపోవడాన్ని స్తంభించిపోయాయని వర్ణిస్తున్నాం. స్తంభన అన్నమాట కూడా ఉంది.

స్తబ్ధం అన్నా కదలికలేకుండా ఉండడమే. స్తబ్ధరోముడు అంటే నిక్కపొడుచుకున్న వెంట్రుకలు కలవాడని అర్థం.

స్వచ్ఛందం అనేమాటను తనకు తానుగా అన్న అర్థంలో ఉపయోగిస్తున్నాం. ఇతరుల ప్రోద్బలం లేకుండా, బలవంతం లేకుండా అన్న అర్థంలో వాడుతున్నాం. ఇటీవలి కాలంలో స్వచ్ఛంద సేవాసంస్థల సంఖ్య విస్తృతంగా పెరిగింది. స్వచ్ఛందం అంటే స్వతంత్రం, ఎటువంటి అడ్డుబాటూ లేకపోవడం, స్వకీయమయిన అభిప్రాయం కలిగి ఉండడం. అస్వచ్ఛందుడు అన్న మాట కూడ ఉంది. అస్వతంత్రుడని అర్థం. తెలుగులో ఈ మాటకు అంతగా ప్రయోగంలేదు.

మహాప్రాణాలున్న మాటలను రాయడంలో జరిగే మూడో రకమయిన పొరపాటు మహా ప్రాణం బదులు అల్పప్రాణం రాయడం. ఇటువంటి సందర్భాలలో వాటిని వికృతులని సరిపెట్టు కోవచ్చు కాని, పదం మొత్తం మారనప్పుడు అది సాధ్యంకాదు. ఉదాహరణకు ఛిన్నాభిన్నం అన్నమాటను తీసుకోవచ్చు. చిన్నాబిన్నం అంటే తద్భవం అని సర్దుకోవచ్చు. కాని, చిన్నాభిన్నం అనిగాని, ఛిన్నాబిన్నం అనికాని రాస్తే సమర్థించుకోవడం కష్టం. ఈ పదబంధంలోని రెండు మాటలూ మహాప్రాణంతో ఉన్నవే. ఇటువంటి మాటే సాధక బాధకాలు. రెండు మాటల్లోనూ మహాప్రాణం ఉంది. సాధకమూ, బాధకమూ అన్నమాట. అభ్యర్థిలో రెండు మహాప్రాణాలున్నాయి. అభి, అర్థి కలిసి అభ్యర్థి. విద్యార్థిలోని విద్యలో మహాప్రాణం లేదు కాబట్టి విద్యార్థి అని మాత్రమే అవుతుంది. మధ్యాహ్నం, అధ్వాన్నం ఈ రెండింటిలోనూ ఒత్తక్షరాలే ఉన్నాయి. లబ్ధి, లబ్ధం, లోభి, లుబ్ధుడు మొదలయిన మాటల్లోనూ మహాప్రాణాలే ఉన్నాయి.

ఈ పొరపాట్లు మన పేర్లలోకి కూడా ఎక్కాయి. జనార్ధన శబ్దంలో మహాప్రాణం లేదు. అట్లాగే మల్లికార్జునలోనూ మహాప్రాణం లేదు. జనార్ధన, మల్లిఖార్జున అని రాయడం చాలామందికి అలవాటయిపోయింది.

(ఇందులో వాడిన ఫోటోలు Learn with Abdul shaik,  V nootnam, Mee Education యూట్యూబ్ వారివి. వారికి కృతఙ్ఞతలు)

-డి. చంద్రశేఖర రెడ్డి
98661 95673

రేపు:-
మన భాష- 12
“అక్షరాలు తారుమారయితే”

RELATED ARTICLES

Most Popular

న్యూస్