Saturday, June 29, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంచెట్టు కింద చదువే మంచిది

చెట్టు కింద చదువే మంచిది

“చెట్టునై పుట్టి ఉంటే-
ఏడాదికొక్క వసంతమయినా దక్కేది;
మనిషినై పుట్టి-
అన్ని వసంతాలూ కోల్పోయాను”
-గుంటూరు శేషేంద్ర శర్మ

భారత వైద్య పరిశోధన మండలి- ఐ సి ఎం ఆర్ ఒక సూచన చేసింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మానసపుత్రిక అయిన శాంతినికేతన్ పద్ధతిలో ప్రకృతి ఒడిలో ఆరుబయట చెట్ల కింద తరగతులు నిర్వహించుకోవడం ఉత్తమమయిన మార్గమన్నది ఆ సూచనలో ప్రధానమయిన విషయం.

చెట్ల కింద తరగతులను ఐ సి ఎం ఆర్ సిఫారసు చేయడానికి కారణాలు అందరికీ తెలిసినవే. ఏ సీ గదులు, నాలుగ్గోడల మధ్య గాలి సోకని తరగతి గదుల్లో రోగాలకు అవకాశాలెక్కువ. స్వచ్ఛమయిన గాలి ఆరోగ్యకరం. కొంత ఎండ పొడ తగిలితే అత్యంత అవసరమయిన డి విటమిన్ కూడా దొరుకుతుంది. పక్కన పచ్చదనం కూడా ఉంటే కనువిందు. మనసుకు హాయి. కింద నేల మీద కాళ్లు ముడుచుకుని పద్మాసనం వేసుకుని కూర్చుంటే గొప్ప ప్రాణాయామం. ఇలా చెట్ల కింద చదువులతో ఉపయోగాలే ఉపయోగాలు.

భూమి గుండ్రం. అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. కానీ తిరక్కుండా స్థిరంగా నిలబడ్డ భూమ్మీద మనమే తిరుగుతున్నట్లు అనుకుంటూ ఉంటాం. ఎన్నో మాయల్లో బతికే మనకు భూమి మాయ అసలు అర్థం కాదు. అంతం లేని ఈ భూమి మనకు ఒక కాలి బాట లాంటిది అంటాడు పానశాలలో దువ్వూరి రామి రెడ్డి. ఆ బాటకు పొద్దున- సాయంత్రం రెండు ద్వారాలట. చక్రవర్తి అయినా అతడి బంటయినా పొద్దున ద్వారంలోనుండి నడిచి సాయంత్రం ద్వారం గుండా వెళ్లిపోవాల్సినవాళ్లమే కానీ…శాశ్వతంగా ఉండే హక్కే లేదు పొమ్మన్నాడు.

చెట్ల కిందా, కొమ్మల్లో, రాతి గుహల్లో మొదలయిన మానవ ప్రయాణం మళ్లీ అక్కడికే వెళుతోంది. వెళ్లక తప్పదు కూడా. ఇదివరకు ఊరంతా తిరిగి కాళ్లు-చేతులు కడుక్కుని ఇంట్లోకి వచ్చేవారు. ఆమధ్య కరోనా దెబ్బకు అందులో అందరికీ ఆరోగ్య రహస్యం బయటపడింది. చెట్ల కింద చదువుల్లో ఆరోగ్య రహస్యం కూడా అలాంటిదే. ఐ సి ఎం ఆర్ సూచనను పాటించడానికి దేశంలో ఎన్ని స్కూళ్లలో చెట్లు మిగిలి ఉన్నాయో మరి!

నగరాల్లో మహా వృక్షాలంటే బాటిల్లో పెరిగే మనీ ప్లాంట్ తీగలే. బాల్కనీ కుండీలో తనను తాను కుచింపజేసుకున్న బోన్సాయ్ లే. కనీసం గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు మిగిలి ఉన్న స్కూళ్లు ఈ సూచనను పాటిస్తే మంచిది. కదిలే కొమ్మలు, రాలే ఆకులు, వాలే పక్షులు, పూచే పువ్వులు, ఎగిరే తుమ్మెదల మధ్య కూర్చుంటే పోయిన ప్రాణం కూడా తిరిగి వస్తుంది. ప్రాణానికి ప్రకృతి కొత్త ప్రాణ శక్తిని నూరి పోస్తుంది. పచ్చని ఆకులను తాకుతూ కొమ్మలను చీల్చుకుంటూ వెలుగు కిరణాలు మన ఒంటిపై పడాలంటే రాసి పెట్టి ఉండాలి. కొమ్మ కొమ్మకో సన్నాయి పాట వినడానికి చెవులకు అదృష్టం ఉండాలి. ఎండుటాకుల గలగలలు, పచ్చి ఆకుల గుసగుసలు వినడానికి మనసుకు చెవులుండాలి. చెవులకు రుచి ఉండాలి.

గ్రామీణ ప్రాంతాల్లో ఆన్ లైన్ క్లాసులకు సిగ్నల్ దొరక్క చెట్లెక్కే చదువులకయినా కొమ్మే ఆధారం. పిల్లల చదువులు చట్టుబండలయిన వేళ…మళ్లీ చదువు ఒక పండుగ కావాలన్నా ఆ చెట్టు బండలే ఆధారం. మనిషి బతుకుకు చెట్టే ఆధారం.

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెట్ల కింద చదువుల్లో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఒడిసి పట్టుకున్న వార్త ఒకటి కరోనా వేళ బాగా ప్రచారం పొందింది. కరోనా పోగానే ఆ వార్త తెరమరుగయ్యింది. అక్కడ పాఠశాల ఆవరణలో ఉన్న పెద్ద చెట్ల చుట్టూ సిమెంటు అరుగులు ఏర్పాటు చేశారు. విదార్థులు ఆరుబయట చెట్ల కింద ఈ అరుగుల మీద పుస్తకాలు, పత్రికలను చదువుకుంటారు. “చదువులమ్మ గద్దె” అని చక్కటి నుడికారపు తెలంగాణ తెలుగులో ఈ అరుగులకు నామకరణం చేశారు. మంచి ప్రయత్నం. చెట్లు మిగిలిన పాఠశాలలు ఈ ఆలోచనను అతి తక్కువ ఖర్చుతో అమలు చేసుకోవచ్చు.

నిజమే-
మనుషులమై పుట్టి అన్ని వసంతాలను కోల్పోయినా…
చెట్టును నాటినా
చెట్టుకు మొక్కినా
చెట్టు ఎక్కినా
చెట్టు కింద కూర్చున్నా
చెట్టు కింద నిలుచున్నా
చెట్టు కింద పడుకున్నా…
ప్రతిక్షణం వసంతమే.
చెట్టంత సంతోషమే.

(వేసవి సెలవుల తరువాత బడి గుడి తలుపులు తెరుచుకున్న సందర్భంగా)

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్