Monday, January 27, 2025

మన భాష-1

తెలుగు మన భాష. అది మన భాష కాబట్టి మనకు తెలిసే ఉంటుంది. బాగా తెలుసు కాబట్టి ఇంకా తెలుసుకోవలసిన పనిలేదు. మన భాషను గురించి పూర్తిగా విశదంగా తెలుసుకోవాలంటే సమగ్ర నిఘంటువు లేదు. సువిస్తృత వ్యాకరణ గ్రంథం లేదు. వాటిని సిద్ధం చేసుకోవాలన్న ఆకాంక్ష అప్పుడప్పుడూ పుడుతుంది. కాని మన ఆరంభ శూరత్వంవల్ల ఆ భావం, శ్రద్ధా ఎంతో కాలం నిలవవు. మనవి విశాలహృదయాలు. కాబట్టి మనవి కాని వాటిమీద మనకు భక్తి తాత్పర్యాలు హెచ్చు. మనదే అయిన భాషమీద అతిపరిచయకారణంగా నిరాదరణ, అవజ్ఞ. తెలుగుజాతి భిన్నప్రాంతాల్లో, దేశాల్లో విభక్తమై ఉందికాబట్టి మనకు ఏకసూత్రత కుదరదు.

అన్యభాషల వాళ్ళు మనల్ని అవమానిస్తున్నారనుకొన్నప్పుడు, మనమీద పెత్తనం చేస్తున్నారను కొన్నప్పుడు తెలుగుతేజం చూపాలనిపించి విశాలాంధ్ర కాకపోయినా ఆంధ్రప్రదేశాన్ని సాధించాం. అంతటితో మన రాజకీయావసరాలు తీరాయి. ఈ కాలంలో మనిషి రాజకీయ పశువని ఇంగ్లీషువాడు చెప్పి, బోధపరిచి పోయాడు. మనకామాట నచ్చింది కాబట్టి రాజకీయాలకు మాత్రం తెలుగును పరిమితంచేసి అప్పుడప్పుడు మనం తెలుగువాళ్ళమని చెప్పుకుంటూ తెలుగుభాషను, అది ప్రతిఫలించే, ప్రతిబింబించే తెలుగు సంస్కృతిని ఆదరించటానికి ఏదో కొన్ని పదవులు, కొందరికి ఉపాధి సౌకర్యాలూ కల్పించి చేతులు దులుపుకుంటాం లేదా కడుక్కొని తుడుచుకుంటాం. ఇదే తెలుగుదనం. ఇది మనజాతి సాధారణ లక్షణం.

మన సంఖ్యాబలం తెగ పెరిగిపోతున్నది. ముక్కోటి ఆంధ్రులు ఎనిమిదికోట్ల మందైనారు. ప్రభుత్వంవారి లెక్కల ప్రకారం మనలో సగం మందికి పైగా అక్షరాస్యులున్నారు. మనదేమో స్వర్ణాంధ్రదేశం కాబోతూ అభివృద్ధి పథంలో పరుగులు తీస్తున్నది. మన సంగతి ఖండాంతరాల్లో మోగిపోతున్నది. అయినా అన్ని తెలుగు పత్రికలకూ కలిసి పది లక్షల మంది చందాదారులు లేరు. ఇది దినపత్రికల విషయం. తెలుగుభాషకంటూ ప్రత్యేక పత్రికలు లేవు. సాహిత్యాన్ని ప్రచారం చేసే పత్రికలు స్థాపిస్తుంటాం- సాధ్యమైనంత త్వరలో అవి మూతపడేందుకు తోడ్పడతాం. ఇలాంటి దేశంలో, కాలంలో, జాతిలో కొంతమంది అమాయకులు మన భాషను గురించి, సాహిత్యాన్ని గురించి తమకు తెలిసిన విషయాలనూ కనీసం యువతీ యువకులైనా తెలుసుకోవటం మంచిదనిపించిన విశేషాలనూ, పత్రికా ముఖంగానో, పుస్తక రూపంలోనో ప్రచురిస్తున్నారు- ఆత్మతృప్తికోసం, భాషాభిమానం చంపుకోలేక. అటువంటి మరో ప్రయత్నమే ‘మన భాష’ అనే శీర్షికతో వార్తాపత్రిక ‘వార్త’లో ధారావాహికంగా డాక్టర్ డి.చంద్రశేఖరరెడ్డి రాసిన వ్యాసపరంపర. బహుకాలం అధ్యాపన వృత్తిలో ఉండడమేగాక పరిశోధన ప్రవృత్తిగా కూడా ఉన్న వాడు కాబట్టి మన భాషను గురించి మనవాళ్లకు సాధ్యమైనంత సూటిగా తెలియ జెప్పాలని ఆరాటపడ్డాడు- పడుతున్నాడు.

మనకు సాంప్రదాయకంగా అందుబాటులో ఉన్న వ్యాకరణ గ్రంథాలు సూత్ర పద్ధతిలో రాసినవి. ఆధునిక భాషాశాస్త్రజ్ఞులు రాసినవి బీజగణితంలో రేఖా గణితాదులు కలిపి రాసినవి. వాటిని చదివి మన భాషను గురించి దాని లక్షణాలను గురించి తెలుసుకోవాలంటే తరగతి గదుల్లో కూర్చొని గురుముఖతః అధ్యయనం చెయ్యక తప్పదు. అందుకు కావలసిన విశ్రాంతి, అర్హత, వయోధర్మం వగైరాలు అందరికీ ఉండవు. మన నిఘంటువులు ఒక పట్టాన దొరకవు. దొరికే వాటిని కొనటానికి చాలామందికి (ఆర్థిక) శక్తి చాలదు. సాధ్యమైనంత ఎక్కువ మందికి అందుబాటులో ఉంచగలిగినవి వార్తాపత్రికల్లో ధారావాహికంగా వెలువరించగలవే. ఈ వాస్తవం తెలిసిన డాక్టర్ చంద్రశేఖరరెడ్డి ఆ విధంగా వెలువరించిన వ్యాసపరంపరకు ఈ విధంగా గ్రంథ రూపమిచ్చి భాషాభిమానమున్న కొద్దిమంది తెలుగువాళ్ళకైనా సేవచేసిన పుణ్యం పొందాలని తాపత్రయపడుతున్నాడు. ఈ ప్రయత్నాన్ని అభినందించాలి. మన భాషను గురించి మనవాడు మనకు వివరించటం, మనం చదివి లాభపడటం రెండూ హర్షించవలసిన విషయాలే.

తెలుగు రాయటంలో, ఉచ్చరించటంలో సాధారణంగా కనిపిస్తున్న లోపాలను పేర్కొని వాటిని సరిదిద్దటంతో రచన ఆరంభమవుతుంది. ఒత్తు లెక్కడున్నవో తేలక బాధపడే వాళ్ళు మనలో చాలామంది ఉన్నారు. సంధులెలా చేస్తే సరిగా ఉంటుందో తెలుసుకోవటం మంచిది. మన భాషమీద అన్యభాషల ప్రభావం ఏ మేరకు మార్పులు తెచ్చిందో తెలియటం మెరుగు. ఒకే పదం విశేష్యంగా క్రియగా విశేషణంగా ఉన్న సందర్భాలనేకం. అవేమిటో తెలియటం అవసరం. మాటలకున్న అర్థాల్లో ఎన్నో విధాల మార్పులు వస్తుంటాయి. స్థూలంగానైనా వాటిని గమనించక తప్పదు.

పర్యాయపదాలనిపించేవి కొన్ని అయితే నానార్థాల్లో వినిపించేవి మరికొన్ని. వాటిని గుర్తించటం అవసరం. ఇవన్నీ ఒక ఎత్తయితే సంస్కృతం నుంచి తెలుగులోకి పెద్ద మార్పుల్లేకుండా వచ్చి చేరిన మాటల గురించి చేసిన విశ్లేషణ మరోఎత్తు. ఏ ఉపసర్గ చేరినప్పుడు ఏ ధాతురూపానికి ఏ అర్థవిశేషం వస్తుందో రచయిత చాలా వివులంగా వివరించాడు. సంస్కృత తద్ధిత ప్రత్యయాలనూ, రూపాలనూ విశదీకరించాడు. ఈ వివరాలకోసం నిఘంటు వ్యాకరణాలను గాలించవలసివస్తుంది. పాఠకులకు ఆశ్రమ తప్పిండటానికి చంద్రశేఖరరెడ్డిగారు తాము పరిశ్రమించారు. రచనా ధోరణి చూస్తుంటే కృత్ప్రత్యయాదులనూ, ఇతర వ్యాకరణాంశాలనూ విశదీకరిస్తూ మరో గ్రంథం వెలువరించబోతున్నట్లుంది అలాగే జరుగుగాక!

గ్రంథంలోని అన్ని అంశాలనూ ప్రస్తావించటం పరిచయోద్దేశం కాదు. స్థాలీపులాకంగా రచనలోని విలక్షణతనూ, ప్రయోజనాన్నీ ప్రస్తావించింది రచయిత పాండితీ పరిశ్రమలను పాఠకుల దృష్టికి తేవటానికే. ఇంత మంచి రచనను పరిచయం చేసే అవకాశం నాకు కల్పించినందుకు రచయితకు నేను రుణపడ్డాను. మనభాష విశ్వరూపాన్ని ప్రదర్శించేందుకు మరో గ్రంథం త్వరలో వెలువడుతుందని ఆశిస్తూ, వెలువరించమని అర్థిస్తూ అర్ధిస్త, భాషాపరిజ్ఞాన సాధనలో ఈ రచన చాలా ఉపయోకరమని పాఠకులకు తెలియబరుస్తున్నాను. భాషాభిమానులు ఈ గ్రంథాన్ని సమాదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.

-బూదరాజు రాధాకృష్ణ

(బూదరాజు రాధాకృష్ణ(1932-2006) ప్రఖ్యాత భాషాశాస్త్రవేత్త. తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో పట్టున్న బూదరాజు తెలుగు భాషాభిమానులకు, పాత్రికేయులకు కరదీపికలుగా ఉపయోగపడే అనేక పుస్తకాలు రాశారు. తెలుగు ప్రామాణిక మీడియా భాషకు ఒక రూపాన్ని ఇవ్వడానికి ఆయన చేసిన కృషి, పరిశోధన గొప్పవి. డి. చంద్రశేఖర రెడ్డి రాసిన “మనభాష” పుస్తకానికి బూదరాజుగారి పరిచయ వాక్యాలివి)

రేపు:-
మనభాష-2
“వచనానికి నిర్వచనం చంద్రశేఖర రెడ్డి”

RELATED ARTICLES

Most Popular

న్యూస్