Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఎందరో గురువులు

ఎందరో గురువులు

మనస్చేన లగ్నం గురోరంఘ్రి పద్మే తథః కిమ్? అంటూ మన మనసును ఎక్కడ కేంద్రీకరించాలి అంటే గురువు పాదపద్మాలమీద అని గుర్వష్టకంలో శంకర భగవత్పాదులు చెప్పారు. గురువులేని విద్య గుడ్డి విద్య అన్న సామెత ఉండనే ఉంది.

ఇప్పుడంటే చైతన్యరహిత నిర్బంధ నిరంకుశ నీరవ నారాయణ అండమాన్ ప్రవాస నిశీధి జైలు ర్యాంకుల విద్య అందుబాటులోకి వచ్చి… దీపం మోజులో దీపపుపురుగులు అందులోనే పడిపోతున్నట్లు రాలిపోతున్నారుకానీ, మా చిన్నప్పుడు మేము అనుభవించిన ప్రభుత్వ ఉచిత నిర్నిబంధ ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యలో స్వేచ్ఛకు, ఆనందానికి ఆకాశమే హద్దు.

దాదాపు యాభై ఏళ్లకిందట అనంతపురం జిల్లా లేపాక్షిలో మాఇంటి ఎదురుగా ప్రాథమిక పాఠశాలలో నా ఒకటో తరగతి టీచర్ ఈశ్వరమ్మ. పలకా, బలపం, ఒకే ఒక పుస్తకం. ఒక్కొక్క తరగతిలో వందమందికి తక్కువ కాకుండా పిల్లలు. ఒకటో తరగతిలో అందరికీ పప్పుబెల్లాలు, మరమరాలు పంచుతూ క్లాసులోకి ప్రవేశించాను. సహనసముద్రమయిన ఈశ్వరమ్మ టీచర్ పలకమీద అక్షరాలు, అంకెలు దిద్దించారు. కాకి ఒకటి నీళ్లకు కావు కావు మనుచును . . . గేయం క్లాసంతా ఒకే శ్రుతిలో పాడుతూ అందుకు తగినట్లు అందరు అభినయిస్తుంటే వీధి వీధి అంతా మారుమోగిపోయేది. గోడల్లేని ఒక లేపాక్షి గుడి బయటి ప్రాకార మంటపమే మాకు ఒకటో తరగతి గది. కానీ ఎండా వానా గాలి అన్నిటినుండి ఈశ్వరమ్మ టీచెరే అందరినీ రక్షించేవారు.

రెండులో సుశీలమ్మ టీచర్. చాలా స్ట్రిక్టు. కానీ మనసు వెన్న. బాగా చదివే పిల్లలంటే ముద్దు. పద్యాలూ పాటలూ ఎక్కాలు ఒకటేమిటి? ఆమె చెప్పనిది లేదు . పైగా ఈ ఇద్దరు టీచర్లు మా అమ్మకు ఆత్మీయులు. వారి చల్లని నీడలో అక్షరాలు దిద్దుకోవడం నా అదృష్టం.

ఎర్రటి ఎండలో చెమటలు కారుతున్నా – మా బడి ప్రార్థన – “తల్లీ నిన్ను తలంచి పుస్తకమున్ చేతన్ పూనితిన్” పాడుతూ… పూనకంతో ఊగిపోయేవాళ్లం.

నిరుపేద విద్యార్థులకు అప్పట్లో ఐక్యరాజ్యసమితి సహాయంతో గోధుమనూక ఉప్మా మధ్యాహ్న భోజనంగా పెట్టేవారు. ఆ సమయంలో ఎదురుగానే కాబట్టి మేము ఇంటికెళ్లి తిని వచ్చేవాళ్ళం.

నాలుగో తరగతిలో తొలిసారి మా నాన్న ఇచ్చిన ఇంకు పెన్ను వాడినప్పుడు రాష్ట్రపతి హోదాలో తొలిసంతకం చేస్తున్నట్లు అలౌకికమైన అనుభూతి. కొన్నేళ్లపాటు ఏ యూనిఫామ్ షర్టు జేబుకయినా ఈ ఇంకు మరకలే. చివరకు స్కూలు స్కూలంతా ఇంకు మరకల్లేని వారు ఉండేవారే కాదు. ఒక పిల్లర్ తో అందులో ఇంకు పోసుకోవడం, అరిగిన విరిగిన నిబ్బులు మార్చుకోవడం – ఇదంతా ఆరోజుల్లో పెద్ద రాకెట్ సైన్సు విద్య.

ఆరో తరగతికి లేపాక్షి ఓరియంటల్ హై స్కూలు. రాతి స్తంభాలు…గడ్డి పరిచిన పైకప్పుతో ఉన్న పెద్ద కొట్టమే తరగతి గది. సంస్కృతం టీచర్ కె వీ ఆర్ మూర్తి సార్ చెప్పిన – అకారాంత పుమ్ లింగః రామ శబ్దః – రామః రామౌ రామాః శబ్ద మంజరి; మునునా నిర్మిత నీతౌ దేశే…సంస్కృత గేయాలు ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి.

లేపాక్షి వివేకానంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్ లోకభూషణం సార్ రాగయుక్తంగా చెప్పిన – అనవిని వ్రేటువడ్డ ఉరగాణ్గయంబలె నేయివోయ భగ్గున… పద్యం అలాగే వినిపిస్తోంది. హోం వర్కు చేసుకురాకపోతే అయయనకొట్టే దెబ్బలకు ఒళ్ళు వాచిపోతుందని రెండు మూడు నిక్కర్లు ఒకదానిమీద ఒకటి వేసుకునేవారు ఆలస్యంగా ఈ విషయాన్ని పసిగట్టిన ఆయన రెండుమూడు నిక్కర్లు వేసుకున్నవారందరినీ ఆ నేరం రుజువుచేసి… ఆ నేరానికి అదనంగా కొట్టారు. తరువాత అయన రిటైర్ అయ్యేవరకు నిక్కరు లేకుండా అయినా వచ్చారుకానీ… రెండు నిక్కర్లు మాత్రం ఎవరూ వేసుకోలేదు.

తోక ఒక్కటి తక్కువయిన మా కోతి మూకలను వేసుకుని ఎనిమిదో తరగతిలో మా సైన్సు టీచర్ నిర్మలా మేడం మమ్మల్ను సైన్సు ఎగ్జిబిషన్ లకు తీసుకెళ్లడం మామూలు విషయం కాదు. ఆమె సైన్సు చెప్పిన పధ్ధతి అద్భుతం. పేరుకు తగినట్లు మనిషి ఎప్పుడూ నిర్మలం. అరకొర వసతుల ల్యాబులో మాకు ఆమె నేర్పిన సైన్సుకంటే – బతుకంతా సైన్సేనని ఒక్కమాటలో ప్రపంచ సైన్సును మా మెదళ్ళకు ఎక్కించారు. సైకిల్ సైన్సు, సువేగా (అప్పట్లో పెట్రోల్ తో నడిచే ఒక ద్విచక్రవాహనం )సైన్సు. బస్సు, రైలు, బావి మోటారు, లైటు, స్విచ్, మందు పొడిచే సిరంజి . . ఇలా సైన్సుకానిదేది ఈ ఇలాతలంలో? అన్న ఆమె ప్రశ్న ఇంకా వెంటాడుతూనే ఉంది. ప్రతిదానికి కార్యకారణ సంబంధం కనుక్కోవడమే సైన్సు – అని తాత్వికంగా చెప్పిన నిర్మలా మేడం బోధనా పద్ధతిని చెప్పడానికి మాటలు చాలవు.

ఎనిమిది నుండి పది వరకు సోషల్ నంజుండమూర్తి సార్ చెప్పారు. గొప్ప రైతు, గ్రామీణ జీవన సౌందర్య పిపాసి. పెద్ద వర్షం పడుతుంటే పాఠం చెప్పడం ఆపేసి అలా కిటికీలో వర్షాన్ని చూస్తూ అయన ఏమి ఆనందం మూటగట్టుకున్నారో ఇప్పుడు అర్థమవుతోంది. పుస్తకం తెరవకూడదు. నోట్సు చెప్పరు. అలా అయన చెబుతుంటే వినడమే – వెయ్యి నోట్సులతో సమానం. ఆయనదయవల్లే ప్రపంచ చరిత్రమీద జిజ్ఞాస పెరిగింది. పుస్తకంలో లేని పిఎస్ఎల్వీలు, కరువులు, నదీ గమనాలు, పరిశ్రమలు ఎన్నెన్ని చెప్పారో? నడిచే గ్రంథాలయం ఆయన. క్రమశిక్షణకు మారుపేరు. కొడితే ఒకడికి పళ్లు ఊడిపోయాయి. ఒకడికి వారం జ్వరం వచ్చింది. ఇది తెలిసి అయన కొట్టకుండానే సగం స్కూలుకు జ్వరమొచ్చింది. కానీ స్కూలు బయట మెత్తటి మనిషి. ఇళ్ళకొచ్చి మరీ ప్రేమగా పలకరించేవారు.

హెడ్మాస్టారు తిప్పరాజు. మిలటరీ పాలనే. ఎప్పుడూ కర్ర చేతిలో. ధర్మపాలకుడు. గొప్పయక్షగాన కళాకారుడు. తెలుగు, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో పండితుడు. 1500 మంది విద్యార్థులను కనుసైగలతో నియంత్రించగలిగిన దీక్షాదక్షుడు. గో ఇన్ ద లైన్ అని అయన ఒకసారి అరిస్తే – పిల్లలతోపాటు ఆ ప్రాంగణంలో తిరిగే కుక్కలు, చీమలు ఇతర జీవులు కూడా వణికిపోయి లైన్ లోనే వెళ్ళేవి. రైతు బిడ్డలంటే తిప్పరాజుగారికి ప్రాణం. ఎందుకంటే – అయన రైతు బిడ్డ.

కోకోలు, కబడ్డీలు, వాలీ బాల్, బ్యాడ్మింటన్, రన్నింగులు, జంపింగులు, సాఫ్ట్ బాల్ – సాయంత్రం మా స్కూలు ఆడేవేళ చూడ్డానికి రెండుకళ్లు చాలవు. రావి చెట్లకింద క్వార్టర్లీ, హాఫ్ యియర్లీ, యాన్యువల్ ఎగ్జామ్స్. పెద్ద చెట్ల నీడలో రోజూ అసెంబ్లీ. క్లాసు బయటే చెప్పులు. తలుపులు ఊడిన, ఉన్నా పడని కిటికీల్లో నుండి ఎటు చూసినా పచ్చని పొలాలు.

స్కూలు అయి ఇంటికొచ్చాక మళ్ళీ ఆటలే. కాళ్లకు గుచ్చుకున్న ముళ్లు తీయటి గాయాలు. గోడలు దూకి పగిలిన మోకాళ్ళు సాహసాలకు గుర్తులు. సైకిలు తొక్కుతూ పడ్డ గాయాలకు కుట్లు. వేసవిరాగానే నానమ్మ, అమ్మమ్మ ఊళ్ళు కడప జిల్లా పెనగలూరు, రైల్వే కోడూరుకు పరారు. పదిదాకా ఎప్పుడూ మార్కులు, సమీక్ష, మందలింపు, ఓదార్పు ఎరగని విశృంఖల విద్యార్థులం.

వేసవి సెలవుల తరువాత బడి తలుపులు తెరిచినవేళ తొలిరోజు విద్యార్థుల రాకకు మేళతాళాలు, డప్పులు, పూలజల్లులు ఏర్పాటు చేశారు వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు. ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి ఉత్సాహం, కోలాహలం అరుదు కాబట్టి ఈ వార్త బాగా వైరల్ అయ్యింది. అవ్వాలి కూడా. ఇల్లంద గ్రామ పెద్దలకు, ఉపాధ్యాయులకు శిరసు వంచి నమస్కరించాలి. నిండు మనసుతో అభినందించాలి.

(పాత వ్యాసం పునర్ముద్రణ)

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్