Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంబ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్

బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్

Be Careful: అందమైన కురుల కోసం బ్యూటీ పార్లర్లను ఆశ్రయిస్తూ ఉంటారు చాలా మంది. అక్కడ సుతారంగా చేసే మసాజ్, తర్వాత సుగంధ భరిత షాంపూతో తలంటించుకోవడం గొప్ప అనుభూతిగా మొదలై అలవాటయిపోతుంది..అలాగే
అలవాటుగా హెయిర్ కట్ కి వెళ్లిందో మహిళ. దానికి ముందు హెయిర్ వాష్ చెయ్యడం ప్రారంభించారు సిబ్బంది. కాసేపటికే ఆ మహిళకు వాంతులు మొదలయ్యాయి. తల తిరగడం కూడా. శరీరం స్వాధీనం తప్పడంతో వైద్య పరీక్షలు చేసి ఆమె ‘ బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ ‘ కి గురైనట్టు నిర్ధారించారు వైద్యులు. ఇప్పుడామె జీవితాంతం మందులు వాడాలి.
మొదటిసారిగా 1993 లో అమెరికాలో ఈ తరహా కేసు నమోదైంది. అప్పటినుంచి ఇటువంటి వాటిని ‘బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్’గా పేర్కొంటున్నారు.

జర భద్రం
బ్యూటీ పార్లర్ లో హెయిర్ వాష్ అంటే చాలామందికి ఇష్టం. చాలా సార్లు ఆయిల్ మసాజ్ తర్వాత, హెయిర్ కట్ ముందు షాంపూ తో కడగడం మామూలే. జుట్టుకు హెన్నా పెట్టించుకుని ఆరేదాకా ఉండి కడిగించుకుంటారు కొంతమంది. మరి కొంతమంది భుజాలు, మెడ మసాజ్ కోసం పార్లర్ కి వెళ్తారు. ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం అంటున్నారు నిపుణులు. నిజానికి బాగా అలసటగా ఉన్నప్పుడు జుట్టు కు ఆయిల్ మసాజ్ చేస్తే చాలా విశ్రాంతిగా అనిపిస్తుంది. ఆపైన తలని అలా …అలా వాల్చి వాష్ బేసిన్లో షాంపూతో కడగడం మామూలే. చాలా సార్లు అలాంటప్పుడు మెడ నొప్పెడుతుంది. అయినా భరిస్తాం. అయితే ఒక్కోసారి ఈ మెడ వాల్చడం ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంది. అందుకు ఉన్న కారణాలు, అవకాశాలు పరిశీలిద్దాం

  • బీపీ లాంటి ఆరోగ్య సమస్యలున్నవారు ఆ విషయం చెప్పకుండా పార్లర్ లో ట్రీట్మెంట్ చేయించుకోకూడదు. మెడ బాగా వెనక్కి వంచినప్పుడు సంబంధిత రక్త నాళాలు నొక్కుకుపోయి మెదడుకు రక్త సరఫరా ఆగి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది.
  • చాలా మంది పురుషులు కూడా తల, మెడ మసాజ్ చేయించుకుంటూ ఉంటారు. అప్పుడు తలని అటూ ఇటూ తిప్పటమూ మామూలే. ఇలాంటప్పుడే జాగ్రత్తగా లేకపోతే సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.

  • 20 డిగ్రీలకన్నా ఎక్కువ మెడ వంచితే బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్ బారిన పడే అవకాశం ఉంది. సాధారణంగా వచ్చే స్ట్రోక్స్ లో గుండె నుంచి రక్త సరఫరా ఆగితే , బ్యూటీ పార్లర్ స్ట్రోక్స్ లో మెడ దగ్గర రక్త సరఫరా దెబ్బతింటుంది
  • బీపీ , డయాబెటిస్ తదితర ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి. ముందే పార్లర్ వారికి తగిన సూచనలివ్వాలి
  • చల్లటి నీళ్లు కాకుండా కొంచెం వేడి నీటితో హెయిర్ వాష్ చెయ్యమనాలి
  • ఎక్కువగా మెడతిప్పడం చెయ్యకూడదు
  • పార్లర్ లో సరైన శిక్షణ పొందిన సిబ్బంది ఉండాలి

అంచేత అందం కోసం పరుగెట్టేముందు ఈ విషయాలూ ఆలోచించాలి.

-కె. శోభ

Also Read :

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్