Thursday, September 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంలోథాల్ కానివ్వొద్దు ప్రభో!

లోథాల్ కానివ్వొద్దు ప్రభో!

 Be Alert: వాతావరణంలో అనేక ఏళ్లుగా వచ్చిన మార్పులవల్ల, కుంభ వృష్టి , క్లౌడ్ బరస్ట్ లాంటివి సహజమైపోయాయి. విస్తారంగా అంటే అనేక చోట్ల కురవాల్సిన వర్షం ఒకే చోట కురిస్తే? అదీ కేవలం కొద్ది సేపట్లో… నాలుగైదు రోజుల్లో పడాల్సిన వర్షమంతా పడితే?

నీరు, ధారలై ప్రవహిస్తుంది.
వాగులు, వంకలు నిండిపోతాయి.
కొండచరియలు విరిగిపడుతాయి.
నదులు పొంగి పొరలుతాయి.

గత నెల రోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా… హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి చోట్ల వర్షాలు సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. వేల కోట్ల ఆస్తుల నష్టం. వందల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

కార్యాచరణ ప్రణాళిక :

1 . జులై, ఆగష్టు, సెప్టెంబర్ నెలల్లో విహార యాత్రలు, తీర్థ యాత్రలు పెట్టుకోవద్దు. ముఖ్యంగా కొండ ప్రాంతాలకు పోవద్దు. చార్ ధామ్, అమర్నాథ్ యాత్రలు చేయాలనుకునేవారు వర్షాకాలానికి ముందే ప్లాన్ చేసుకోండి.

2 . పొంగిప్రవహిస్తున్న బ్రిడ్జిలు, కల్వర్ట్ లు మొదలైన వాటిపై పయనించొద్దు. ప్రవహించే నీటి గతి శక్తిని తక్కువ అంచనా వేయొద్దు. నీరు వాహనంలోకి ప్రవేశిస్తే దాని బరువు పెరిగి మునిగిపోతుంది.

3 . అనేక రాష్ట్రాల్లో రోడ్ల వంతెనలు డ్యామ్ ల నిర్వహణ ఏమాత్రం బాగా లేదు. అనేకం శిథిలావస్థకు చేరుకున్నాయి. దిగువ తట్టు ప్రాంతాల్లో వున్నవారు క్షేమంగా ఉండాలంటే చెరువు కట్టలు, డ్యాములు సరిగా నిర్వహించేలా ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెండి. అథితులు ఇంటికొచ్చాక పంట పండించలేము కదా. అలాగే వర్షాకాలంలో మేలుకొంటే సరిపోదు. డ్యాములు బ్రిడ్జిలు లాంటి వాటి నిర్వహణ ఏడాది పొడుగునా జరగాలి. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో వీటి స్థితిపై స్ట్రక్చరల్ ఆడిటింగ్ జరగాలి. అవి  దృడంగా ఉన్నాయని ఇంజనీర్ లు సర్టిఫై చెయ్యాలి. ఇలా కాకపోతే వానాకాలంలో నిద్రలోనే జలసమాధి అయ్యిపోయే ప్రమాదం పొంచి ఉంటుంది.

4 . నదుల్లోకి దిగొద్దు. మీరు దిగినప్పుడు నీరు తక్కువ ఉండొచ్చు. ఎగువ ప్రాంతం లో డ్యామ్ తెరవడం, భారీ వర్షం లాంటి కారణాలవల్ల క్షణాల్లో నీటి ప్రవాహం పెరిగి ఉపద్రవం సంభవించవచ్చు.

5 . కొండ మార్గాల్లో అంటే, ఘాట్ రూట్లలో వర్షాకాలంలో ప్రయాణాలు వద్దు . భారీ వర్షాలు కురిసినప్పుడు పెద్ద ఎత్తున కొండ చరియలు విరిగిపడుతాయి. ఒక పెద్ద బండ రాయి క్షణాల్లో కిందకు వచ్చి అక్కడ పయనిస్తున్న వాహనాన్ని లోయలోకి తీసుకొని వెళ్ళిపోతుంది. తస్మాత్ జాగ్రత్త.

6 . ఎక్కడో కొండప్రాంతాల్లో కాదు. మహానగరాల్లో జలప్రళయం సాధారణం అయిపోయింది. గతంలో చెరువులు, కుంటలు ఉన్న ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరుచుకోవద్దు . స్మార్ట్ ఫోనుల్లో కంపాస్ అనేది ఉంటుంది . అందులో చెక్ చేసుకొంటే మీరున్న ప్రాంతం ఎత్తు ఎంతో , ఇట్టే తెలిసిపోతుంది. ఇక్కడ నిజానికి చూడాల్సింది సముద్ర మట్టం నుంచి ఎత్తు కాదు. మన చుట్టు పక్కల ప్రాంతంతో పోలిస్తే మన నివాస ప్రాంతం ఎత్తులో ఉందా? లేదా పల్లం లోనా? అనేది చూడాలి.  కొద్దిపాటి హెచ్చుతగ్గులు సాధారణం. కానీ మరీ లోతట్టు ప్రాంతం అయితే భారీ వర్షం కురిసినప్పుడు నీరు మీ కొంప ముంచే ప్రమాదముంది. ముఖ్యంగా కొత్తగా ఇల్లు కట్టుకొనే వారు, కొనుక్కొనేవారు దీన్ని పాటించాలి…తప్పదు. రాబోయే రోజుల్లో జలప్రళయాలు సాధారణం అయిపోతాయి. ప్రభుత్వాలు కూడా లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవి నివాస యోగ్యం కావని ముందే హెచ్చరికలు జరీ చెయ్యాలి. ఇంటిలోకి నీరు ప్రవేశిస్తే ఇంటిలోని సామాగ్రి మొత్తం పాడై వేలల్లో నష్టం కలుగుతుంది. పాములు తేళ్లు లాంటివి, అరుదుగా నైనా మొసళ్ళు ఇంటిలోకి వస్తే ప్రాణానికే ప్రమాదం.

7 . చెట్లు నాటడం, వన సంరక్షణ, డ్రైయినేజ్ వ్యవస్థలు, బ్రిడ్జిలు, ఇతరత్రా మౌలిక సదుపాయాల నిర్వహణ ప్రభుత్వాల బాధ్యత. వాటిని ఆయా ప్రభుత్వాల దయాదాక్షిణ్యాలకు వదలకుండా ఏటా ఇంత అని టార్గెట్ పెట్టి ఆ లక్ష్యాన్ని అందుకోవడం తప్పని సరి చేస్తూ పార్లమెంట్ చట్టం తేవాలి. లక్ష్యాన్ని అందుకోలేని ప్రభుత్వాలపై రాజ్యాంగపరమైన చర్యలు ఉండాలి.

8 . అహ నా పెళ్ళంట సినిమా లో కోట శ్రీనివాస్ రావు క్యారెక్టర్ “నా కేంటి .. నా కేంటి” అంటుంటుంది . మనం పడవ లో పయనిస్తున్నాము. దానికి చిల్లు పడితే అందరం పోతాము. మనం బతకాలంటే మంది కూడా బతకాలి అనే ఇంగిత జ్ఞానం ప్రజల్లో రావాలి. ఆలా కాకపోతే ఒక వర్షాకాలం రాత్రికి రాత్రే ఒక భారీ డ్యామ్ పగిలి ఒక పెద్ద నగరం, అనేక గ్రామాలు కొట్టుకొని పోయే ప్రమాదం ఉంది.

సింధు నాగరికత చివరి దశ చరిత్రను పునరావృతం కానివ్వొద్దు. చరిత్రను మరచిన జాతికి మనుగడ ఉండదు.

-వాసిరెడ్డి అమరనాథ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్