స్వతంత్ర భారతదేశ చరిత్రలో-
గవర్నరు సంతకం లేకుండా పది బిల్లులు చట్టాలై అమలులోకి రావడం;
దానికి సుప్రీం కోర్టు ఆమోద ముద్ర వేయడం;
రాష్ట్రపతికి సుప్రీం కోర్టు గడువు విధించడం;
సుప్రీం కోర్టు తనకు లేని అధికారాలను చలాయిస్తూ సూపర్ పార్లమెంట్ అవుతోందని సాక్షాత్తు ఉపరాష్ట్రపతి బహిరంగంగా విమర్శించడం మీద చాలా చర్చ జరగాలి. ఆ చర్చ బి జె పి అనుకూల – వ్యతిరేక కళ్ళద్దాలతో కాకుండా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అన్న పునాదిమీద నిష్పాక్షికంగా జరగాలి.
దేశమంటే మట్టి కాదు- మనుషులే. ఆ మనుషులే చరిత్ర. ఆ మనుషులదే సంస్కృతి. ఆ మనుషులదే నాగరికత. ఆ మనుషులు నిర్మించుకున్నవే వ్యవస్థలు. ఆ మనుషులు ఎన్నుకున్నవే ప్రభుత్వాలు. ఆ మనుషులు కొన్ని విలువలు, ఆదర్శాల బాటలో తమను తాము నడిపించుకోవడానికి నిర్మించుకున్నదే రాజ్యాంగం. చట్టసభలు, పరిపాలన, న్యాయవ్యవస్థలు ఆధునిక సమాజానికి మూడు మూల స్తంభాలు. దేని అధికారాలు దానికున్నట్లే…దేని పరిమితులు దానికుంటాయి. అలాగే ఉండాలి కూడా. ఎవరికివారే బాధ్యతగా ప్రవర్తించినన్ని రోజులూ చిక్కే లేదు. ఆ బాధ్యతను విస్మరించినప్పుడు ఒక వ్యవస్థను మరో వ్యవస్థ ప్రశ్నించడానికి వీలుగా మనమే రాజ్యాంగంలో చెక్స్ అండ్ బ్యాలెన్స్ కు కొన్ని నియమాలు పెట్టుకున్నాం.
తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఏళ్ళతరబడి ఆమోదించకుండా, తిరస్కరించకుండా తన టేబుల్ మీదే పెట్టుకున్నారు. రాష్ట్రపతి పరిశీలన అవసరమేమోనని భావించడంవల్ల ఆలస్యమయ్యిందన్నారు. చివరికి దేశచరిత్రలో తొలిసారి గవర్నరు అనుమతి, సంతకమే లేకుండా సుప్రీం కోర్టు తీర్పుతో పది బిల్లులూ చట్టాలయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతికి కూడా సుప్రీం కోర్టు గడువు విధించింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ “రీజనబుల్ టైమ్” అంటే ఎంత టైమ్ అని సుప్రీం కోర్టు విసుక్కుంది. ఏదో ఒక నిర్ణీత గడువులో తేల్చకపోతే…మేమే గడువు విధించాల్సి వస్తుంది- అని హెచ్చరించింది.
సుప్రీం కోర్టు, హై కోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి నియమించిన న్యాయమూర్తులు రాష్ట్రపతినే శాసించడమేమిటని బాధపడవచ్చు. ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనమిదేనని పొంగిపోవచ్చు. మన దృష్టిని బట్టి ఎలాగైనా అనుకోవచ్చు.
కానీ…రాజ్యాంగంలో సుప్రీం కోర్టు ఆదేశం ఈదేశంలో చట్టంగా చలామణి అయ్యే ఆర్టికల్-142ను ఎందుకు పెట్టారో ఆలోచిస్తే…ఒక్కో వ్యవస్థమీద మరో వ్యవస్థ సమీక్షకు అవకాశం కలిగించారని బోధపడుతుంది.
ఆర్టికల్ 142ను అడ్డుపెట్టుకుని సుప్రీం కోర్టు ప్రజాస్వామ్య వ్యవస్థమీద అణుబాంబులు వేస్తోందని సాక్షాత్తు ఉపరాష్ట్రపతి బహిరంగంగా విమర్శిస్తున్నారంటే…అది ఎవరి అభిప్రాయమో విడిగా చెప్పాల్సినపనిలేదు. “నాకు గడువు విధించే అధికారం మీకెక్కడిది?” అని రాష్ట్రపతి ఘాటుగా సుప్రీం కోర్టుకు ఒక సమాధానం ఇవ్వగలరా? తమిళనాడు గవర్నర్ తన మొండితనంతో ఇందులోకి అకారణంగా రాష్ట్రపతిని లాగారు.
ప్రభుత్వంలో అన్యాయం జరిగితే కోర్టుకు వెళతారు. చట్టసభల్లో అన్యాయం జరిగితే కోర్టుకు వెళతారు. కోర్టులో అన్యాయం జరిగితే కోర్టుకే వెళ్ళాలి. ఢిల్లీలో న్యాయమూర్తి ఇంట్లో దొరికిన కాలిన నోట్లకట్టల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ఉపరాష్ట్రపతి న్యాయవ్యవస్థమీద దాడి మెదలుపెట్టారు. చివరిది వీధికొళాయి దగ్గర నీళ్ళు నింపుకునేందుకు సిగపట్లలా మారుతోంది.
ఒక్కో రాజ్యాంగ వ్యవస్థ అధికారాలు, పరిమితులమీద చర్చ జరగాల్సిందే. ఎవరి హక్కులు వారు కాపాడుకోవాల్సిందే. కానీ జరగాల్సిన న్యాయమో, ధర్మమో ఒక జీవితకాలం ఆలస్యమైతే…అది న్యాయం, ధర్మం అవుతుందా?
రాష్ట్రపతి, గవర్నర్, స్పీకర్ నిర్ణయాన్ని మాత్రమే సమీక్ష చేసే అధికారం కోర్టుకు ఉంటుంది తప్ప…ఫలానా గడువు లోపు నిర్ణయాన్ని ప్రకటించాలి- అని నిర్దేశించే అధికారం లేనే లేదు అనుకుంటే… ఒక రాష్ట్రపతి, ఒక గవర్నర్, ఒక స్పీకర్ ఎంతకాలమైనా ఏమీ తేల్చకుండా ఉండవచ్చా? వారిని ప్రశ్నించడానికి వీలేలేదా? ఒకవేళ వీలే లేదంటే…అప్పుడది ప్రజాస్వామ్యం అవుతుందా?
రాజ్యాంగం మీద ప్రమాణం చేసి…రాజ్యాంగ పదవులను అధిష్ఠించినవారే రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడకపోతే…ఇక వికసించిన, వికసిస్తున్న, వికసించబోయే మేరా భారత్ మహాన్ రాజ్యాంగానికి అర్థమేముంటుంది?
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు