ఇక్కడ తుప్పుబట్టిన సైకిల్ ను రిపేర్ చేసేందుకు ఢిల్లీ నుంచి మెకానిక్ లు వచ్చారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఆ సైకిల్ కు హ్యాండిల్, సీటు, పెడల్స్, చక్రాలు లేవని, మధ్యలో ఫ్రేమ్ కూడా లేదని…. కేవలం బెల్లు ఒక్కటే మిగిలిందని అందుకే అబద్ధాల మేనిఫెస్టో ఆనే ఆ బెల్ తో ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని రాజానగరంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో జగన్ ప్రసంగించారు.
గతంలో ఎన్నికల హామీలు అమలు చేయకపోవడం వల్లే 2019 ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలూ చంద్రబాబు సైకిల్ ను ఏ ముక్కకు ఆ ముక్క విరిచేశారని, ఆ తుప్పు పట్టిన సైకిల్ కు రిపేర్ చేయాలని ఆయన నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళారని, ఫలితం లేదని…. తర్వాత దత్తపుత్రుడిని పిలిచాడని…. ఆయన సైకిల్ పరిశీలించి టీ గ్లాస్ పట్టుకొని క్యారేజ్ మీద మాత్రమే ఎక్కుతానని, మిగతాది తనవల్ల కాదని ఆయన చెప్పాడని… ఆ తర్వాత వదినమ్మను రంగంలోకి దించారని చమత్కరించారు.
ఐదేళ్లుగా క్రమం తప్పకుండా, ఓ క్యాలెండర్ ప్రకటించి సంక్షేమ పథకాలను అక్క చెల్లెమ్మలకు అందిస్తున్నామని… కానీ చివర్లో తాము నొక్కిన బటన్ లకు నిధులు విడుదల చేయకుండా కేంద్రంతో కలిసి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల కోసం తాము ఆ బటన్ లు నొక్కలేదని అవి ఆన్ గోయింగ్ స్కీములేనని, అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఈ పథకాలకు ఆమోదం కూడా తెలిపామని వెల్లడించారు. తనను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్నిన దౌర్భాగ్యపు పరిస్థితి నెలకొందని అన్నారు.
తనను ఇబ్బందులు పెడితే నా అక్కచెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటాయా? ఓటు అనే అస్త్రంతో చంద్రబాబు చేస్తున్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపు ఇచ్చారు. ‘ఎవ్వరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఏ ఒక్కడూ ఆపలేడు’ అంటూ ధీమా వ్యక్తం చేశారు. మళ్ళీ రాబోయేది తమ ప్రభుత్వమేనని, జూన్ 4న మళ్ళీ గెలవగానే వారం రోజుల్లో ఆగిపోయిన బటన్లు అన్నీ కియర్ చేస్తామని హామీ ఇచ్చారు.