కృష్ణాజలాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, చట్టప్రకారం తెలంగాణకు రావాల్సిన వాటా సాధించుకుని తీరతామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటియార్ స్పష్టం చేశారు. నీటి వాటా కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో మాత్రమే కాదని కెసియార్ నాయకత్వంలో అవసరమైతే దేవుడితో కూడా పోరాడతామని వ్యాఖ్యానించారు. ఎవరెన్నిఅడ్డంకులు సృష్టించినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతామని, పాలమూరు జిల్లాకు కేసియార్ ఎట్టి పరిస్థితులలోనూ అన్యాయం చేయరని భరోసా ఇచ్చారు. పాలమూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు.
తెలంగాణాలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో ఒక్కటైనా కర్ణాటకలో అమలవుతుందా అని కేటియార్ ప్రశ్నించారు. దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. నారాయణపేటలో మంత్రి కేటియార్ పర్యటించారు. జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల వార్డును, సింగారం వద్ద చేనేత పార్కును ప్రారంభించారు. వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కు శంఖుస్థాపన చేశారు. అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస గౌడ్, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.
చేనేత కార్మికులకూ బీమా పథకం ప్రవేశ పెట్టాలని సిఎం నిర్ణయించారని కేటియార్ వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు బీమా కార్యక్రమం మొదలుపెట్టమని చెప్పారు. నేతన్నకు చేయూత పథకం ద్వారా 96 కోట్ల రూపాయల సాయం చేశామన్నారు. నేతన్నలు తమ వృత్తినే నమ్ముకుని జీవనం సాగించేలా, వారికి దీని ద్వారా ఉన్నతమైన జీవనోపాధి కలిగేలా కృషి చేస్తున్నామన్నారు. 50 శాతం సబ్సిడీతో నూలు, రసాయనాలు అందిస్తున్నామని చెప్పారు. నేతన్నలకు ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని, ఆర్ధికంగా వారికి చేయూతనిస్తామని కేటియార్ హామీ ఇచ్చారు.