మరో సంవత్సరం తరువాత తాము అధికారంలోకి వస్తామని, రాగానే హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు ఎత్తి వేస్తామని మాజీ మంత్రి టిడిపి నేత నక్కా ఆనందబాబు వెల్లడించారు. పేరు మార్పుపై అసెంబ్లీ సాక్షిగా సిఎం జగన్, మంత్రి రజని అబద్ధాలు చెప్పారని, దీనిపై ఎన్టీఆర్ అభిమానునంతా ఆవేదనకు గురయ్యారని చెప్పారు. ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్టలను దెబ్బ తీయడానికే ఇలా చేశారన్నారు. చీప్ ట్రిక్స్ ప్రదర్శించుకోవడానికి అసెంబ్లీని ఉపయోగించుకోవడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు 24 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని, వాటిలో 4 ప్రభుత్వ, 12 ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయని… ఇవి కాకుండా తిరుపతిలో బర్డ్స్, టాటా కేన్సర్ ఆస్పత్రి తీసుకొచ్చారని, మంగళగిరిలో ప్రతిష్టాత్మక ఎయిమ్స్ సంస్థను తీసుకువచ్చి, దానికి 195 ఎకరాల భూమిని కేటాయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. సిఎం జగన్ ఏడాదిగా ఈ సంస్థకు నీరు అందించకుండా ఇబ్బంది పెతుడున్నందుకు సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉన్నాయని సిఎం చెప్పారని, కానీ రాష్ట్రంలో ఎన్ని కాలేజీలు ఉన్నాయో కూడా తెలియకుండా స్టేట్మెంట్ ఇచ్చిన ఘనత ఈ సిఎం కు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో మొత్తం 21 ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయని విజయసాయి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చిందన్నారు. ఈ ప్రభుత్వం చెబుతున్న 17 కొత్త మెడికల్ కాలేజీలు ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయని చెప్పారు. అసలు రాష్ట్రం ఏడింటికే దరఖాస్తు చేసిందని, దానిలో మూడు మాత్రమే ఆమోదించామని, నాలుగు తిరస్కరించామని కేంద్రం చెప్పిన విషయాన్ని నక్కా గుర్తు చేశారు.
ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారంటూ మాట్లాడడంపై ఆనందబాబు తీవ్రంగా తప్పుబట్టారు. లక్షీ పార్వతి పెత్తనం భరించలేక మా పార్టీ ఎమ్మెల్యేలు అధికార మార్పిడి చేసుకుంటే దాన్ని వెన్నుపోటు అని ఎలా అంటారని ప్రశ్నించారు. అంబేద్కర్ విదేశీ విద్య పేరు మార్చి సిఎం జగన్ పేరు పెట్టుకోవడం దారుణమన్నారు.
Also Read: ఎన్టీఆర్ పేరు మార్పుపై రాజకీయ దుమారం