వచ్చే ఎన్నికల్లోపే వికేంద్రీకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి సూత్రప్రాయంగా వెల్లడించారు. కేవలం పట్టుదల కోసమో, ఎవరినో రెచ్చగొట్టడానికో కాదని, ఈ ప్రభుత్వ విధానం ప్రకారం విశాఖకు పాలనా రాజధానిని తరలిస్తామని, ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారం చేస్తామని చెప్పారు. ఉద్యోగుల తరలింపు, హైకోర్టులో ఉన్న వ్యాజ్యాలను వీలైనంత త్వరలో పరిష్కరించుకొని అక్కడకు వెళతామన్నారు. ఈ అంశాన్ని తాము ఒక ఎన్నికల అజెండాగా చూడడం లేదని, మూడు ప్రాంతాలూ సమానంగా అభివృద్ధి చెందాలన్నదే సిఎం జగన్ అభిమతమని స్పష్టం చేశారు. కృత్రిమ పాదయాత్రతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని ఆరోపించారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో సజ్జల పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
గత ఎన్నికల్లో చంద్రబాబు వ్యతిరేక ఓటు చీల్చడానికే పవన్ కళ్యాన్ ఒంటరిగా పోటీ చేశారని, నేడు తమ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా ఉండేందుకు మళ్ళీ కలిశారని వ్యాఖ్యానించారు. వారి కలయిక ఇప్పటివరకూ రహస్యంగా ఉండేదని, ఇప్పుడు బట్టబయలైందన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం పూర్తి చేస్తున్నామని, 87శాతం మంది ప్రజలకు తమ ప్రభుత్వంలో పథకాల ద్వారా లబ్ధి చేకూరిందని, ప్రతిపక్షాల కుట్రలకు బలికావోద్దని ప్రజలకు సజ్జల విజ్ఞప్తి చేశారు.
Also Read : వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ది సజ్జల