పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ భవానీపూర్ లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ రోజు జరిగిన ఓట్ల లెక్కింపులో మమత 58 వేల ఓట్ల మెజారిటి సాధించారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మమత బెనర్జీకి 85,263 ఓట్లు వచ్చాయి. పోలైన ఓట్లలో 71.90 శాతం మమత దక్కించుకున్నారు.  బిజెపి  అభ్యర్థి ప్రియాంక తిబ్రేవాల్ కు 26,428 ఓట్లు రాగా సిపిఎం అభ్యర్థి శ్రిజిబ్ బిస్వాస్ కు కేవలం 4,226 ఓట్లు పడ్డాయి. మమత బెనర్జీ ఈ నెల ఏడో తేదిన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గెలుపుకు సహకరించిన నియోజకవర్గ ప్రజలకు మమత కృతజ్ఞతలు తెలిపారు. భవానీపూర్ లోని ప్రతి వార్డులో తృణముల్ కాంగ్రెస్ మెజారిటీ సాధించిందని, సేవకురాలిగా ప్రజలకు అందుబాటులో ఉంటానని సిఎం మమత ధన్యవాదాలు తెలిపారు.

ఈ ఏడాది ప్రథమార్థంలో జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ లో సువెందు అధికారి చేతిలో మమత బెనర్జీ ఓటమి చవిచూశారు. అయితే మమత దీదీ నాయకత్వంలో తృణముల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో విజయ డంకా మోగించింది. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన దీదీ నవంబర్ లోగా ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి శోభందేబ్ చటర్జీ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి దీదీ కోసం భవానీపూర్ ఖాళీ చేశారు. ఉపఎన్నికల్లో గెలిచిన మమత బెనర్జీకి దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. ఎన్సిపి అధినేత శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దీదీకి శుభాకాంక్షలు తెలిపారు.

బెంగాల్ లో జాంగిపూర్ నియోజకవర్గం నుంచి తృణముల్ కాంగ్రెస్ నేత జాకీర్ హుస్సేన్ 92 వేల మెజారిటీతో విజయం సాధించారు. షంషేర్ గంజ్ ఉపఎన్నికలో టి.ఎం.సి అభ్యర్థి అమ్రుల్ ఇస్లాం 26 వేల మెజారిటీతో గెలిచారు.   ఓడిశాలోని పిప్లీ నియోజకవర్గంలో బిజు జనతాదళ్ అభ్యర్థి రుద్ర ప్రతాప్ మహారథి సమీప ప్రత్యర్థి బిజెపి నేత ఆశ్రిత్ పట్నాయక్ మీద 20 వేల ఆధిక్యంతో గెలుపొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *