Well Done: మౌఖికంగా ఉన్న భాషకు శాశ్వతత్వం కల్పించేది లిపి. అక్షరం అంటే నశించనిది. పలికినా అక్షరమే. రాసినా అక్షరమే. చదివినా అక్షరమే. క్షయం కాకుండా ఉండాలంటే శబ్దానికి రూపం తప్పనిసరిగా ఉండాలి. అలా ఏర్పడిందే లిపి. లిపిలో ఉన్న శబ్దాలను చదువుతున్నప్పుడు ముందు కన్ను చదువుతుంది. తరువాత మెదడు చదువుతుంది. ఆపై నోరు పలుకుతుంది. బాగా నచ్చితే మెదడు రికార్డు చేసుకుంటుంది. పుస్తకం సరిగ్గా చదివితే ఏకకాలంలో కన్ను, మెదడు, నోరు, మనసు పనిచేస్తాయి. ఒట్టి శబ్దం చెవిన పడితే ఇంత సాంద్రంగా రికార్డు కాదు. అందుకే చదవాలి. మళ్లీ మళ్లీ చదవాలి. చదువుతూనే ఉండాలి. చచ్చినా చదువు ఆపకూడదు.
పద్నాలుగు భాషల్లో మునిగితేలిన పుట్టపర్తి నారాయణాచార్యులు చనిపోవడానికి ముందు మృదంగం నేర్చుకున్నారు.
ప్రధానిగా పనిచేస్తున్నా పి వి నరసింహారావు కంప్యూటర్ లాంటి కొత్త విద్యలు నేర్చుకోవడం మానలేదు. అనేక భాషల్లో ప్రావీణ్యం సరేసరి.
తెలుగు, సంస్కృతాల్లో అపార పాండిత్యం ఉన్న విశ్వనాథ సత్యనారాయణ చదవని ఇంగ్లీషు డిటెక్టివ్ నవలలు ఉండేవి కావు.
అనేక భాషల పరిచయం, ప్రావీణ్యం ఏ రకంగా చూసినా మంచిదే. భారతదేశంలో ఇంగ్లీషు, హిందీకి తోడు ఎక్కడికక్కడ ప్రాంతీయ భాష తెలిసి ఉంటే…వారికి ఇక ఆకాశమే హద్దు.
కేరళకు చెందిన ఆనంద్ బోస్ బెంగాల్ గవర్నర్ గా నియమితులయ్యాక…బెంగాలీ నేర్చుకోవాలనుకున్నారు. మిగతా ప్రాంతాల్లాగే వసంత పంచమికి బెంగాల్లో కూడా సంప్రదాయంగా అక్షరాభ్యాసాలు చేయించడం ఆనవాయితీ. మొన్న వసంత పంచమి రోజు గవర్నర్ పలక బలపం పట్టుకుని బెంగాలీ అక్షరాలు దిద్దడం మొదలు పెట్టారు.
ఇది చాలా చిన్న వార్త అయినా…నిజానికి చాలా పెద్ద విషయం. గవర్నర్ ప్రయత్నం అభినందనీయం. ఇలాగే పెద్ద స్థానాల్లో ఉన్న వారు స్థానిక భాషలు నేర్చుకుంటే ఉభయతారకం కాగలదు.
Also Read :