పురుషుల టి 20 వరల్డ్ కప్ లో మాజీ ఛాంపియన్ వెస్టిండీస్ పేలవమైన ఆటతీరుతో మరోసారి తొలి రౌండ్ లోనే ఇంటిబాట బట్టింది. నేడు జరిగిన మ్యాచ్ లో విండీస్ పై ఐర్లాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సూపర్ 12లో అడుగు పెట్టింది. క్రికెట్ రంగానికి ఎందరో యోధులైన క్రీడాకారులను అందించిన వెస్టిండీస్ ఇటీవలి కాలంలో దారుణమైన ఆట తీరుతో విఫలమవుతోంది.
హోబార్ట్ లోని బెల్లిరివ్ ఓవల్ మైదానంలో నేటి మ్యాచ్ లో విండీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఐర్లాండ్ అద్భుతమైన బౌలింగ్, ఫీల్డింగ్ తో విండీస్ ను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేసింది. జట్టులో బ్రాండన్ కింగ్ ఒక్కడే 62 పరుగులతో రాణించాడు, చార్లెస్ (24), ఓడియన్ స్మిత్ (19*) ఫర్వాలేదనిపించారు. నిర్ణీత 20ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది.
ఐర్లాండ్ బౌలర్లలో డెలానీ మూడు; బ్యారీ మెక్ కార్టీ, సిమి సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.
ఆ తర్వాత ఐర్లాండ్ తొలి వికెట్ కు 7.3 ఓవర్లలోనే 73 పరుగులు చేసింది. కెప్టెన్ అండ్రూ బాల్బిరిన్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ పాల్ స్టిర్లింగ్- లోర్కాన్ టక్కర్ లు రెండో వికెట్ పడకుండా క్రీజులో నిలిచి 17.3 ఓవర్లలోనే 150 పరుగులు చేసి అపూర్వ విజయం విజయం అందించారు. స్టిర్లింగ్ 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 66; టక్కర్ 35 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్సర్లతో 45 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.
ఐర్లాండ్ బౌలర్ గారేత్ డెలానీకి ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : ICC Men’s T20 World Cup 2022: నమీబియాపై ఎమిరేట్స్ విజయం