Sunday, January 26, 2025

మన భాష- 7

సంస్కృతంలో ఎ, ఒలు లేవు. మనం తెలుగులో వాడే సంస్కృత పదాలలో కూడా ఎ, ఒలు ఉండవు. ఎ, ఒలు ఉన్న మాటలన్నీ తెలుగు దేశ్య శబ్దాలు కాని, అన్య దేశ్యాలు కాని అయి ఉంటాయి. ఇంగ్లీషు, ఉర్దూ, తమిళం, కన్నడం నుంచి అరువు తెచ్చుకున్న మాటల్లో ఇవి ఉంటాయి. ఎ, ఒలు వచ్చే మాటలకు సంస్కృత వ్యాకరణ పద్ధతిలో సంధి చేయకూడదు. అంటే ఈ పదాలకు సవర్ణ దీర్ఘసంధి, గుణ సంధి వంటివి రావు. తెలుగు వ్యాకరణాలలో ఒక వింత సంప్రదాయం కనిపిస్తుంది. మొదలైన అన్న అర్థంలో ఆది అనే మాటతో సంస్కృత సంధి చేసి ప్రయోగిస్తారు. ఉదాహరణడు పడు మొదలయిన అనడానికి పడ్వాదులు (పడు + ఆదులు) అని వాడుక ఉంది. వ్యాకరణ శాస్త్రంలో వ్యాకర్తలు పాటించిన ఒక సంప్రదాయంగానే దీన్ని గుర్తించాలి తప్ప సాధారణీకరించి అన్ని చోట్లా వాడకూడదు. పెను, వెల, వెలి, చెల్లు, ఎండ వంటి మాటలు సంస్కృతం కావని తెలిస్తే వాటికి సంస్కృత సంధి చేయకుండా ఉండవచ్చు. పదంలోని ఎ, ఒలు ఆ పదం సంస్కృతం కాదని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి.

తెలుగులో ఐ, ఔలు ప్రత్యేక వర్ణాలు కావు. అంటే వీటిని అయ్, అవ్ అని కూడా రాయవచ్చు. ఐదును అయిదు అని రాయవచ్చు. ఐదువ- అయిదువ; ఐరేని అయిరేని, ఐపు- అయిపు; తెలుగులో ‘అగు’ ధాతువు నుండి వచ్చిన మాటలను ఐ, ఔలతో రాయడం జరుగుతుంది. అగు- అయిన, అయితే, అయి, అయినా. వీటిని ఐన, ఐతే, ఐ, ఐనా అని కూడా రాస్తాం. అందమైన, అర్థమైతే అని సంధిలో కూడా రాయవచ్చు. లేకపోతే అందమయిన, అర్థమయితే అనేవిధంగా రాయవచ్చు. ఈ రెండు విధాల లేఖనం తెలుగులో ఈ ఉచ్చారణ కలిగిన అన్ని మాటల్లోనూ ఉంటుంది. ‘కై’ని ‘కయి’ అనవచ్చు. కైకూడు- కయికూడు, కైకొను కయికొను, కైదండ- కయిదండ, కైపు – కయిపు, కైవసం- కయివసం, కైవారం కయివారం, రైక – రయిక, దైవారు – దయివారు, పైరు పయిరు, పైకం పయికం, పైన- పయిన; ఈ విధంగా తెలుగు మాటల్లో – అయిలు సర్వత్రా ఒకదానికొకటి రాయవచ్చు.

సంస్కృతం నుండి ఇతర భాషల నుండి తెలుగులోకి వచ్చిన మాటల్లో కూడా కొన్ని చోట్ల ఈ రెండు రకాల లేఖనమూ ఉంటుంది. ఇది సంస్కృత పదాల విషయంలో తద్భవాలలో సాధ్యమవుతుంది. ఉదాహరణకు ‘కవిత’ అనే మాట తెలుగులో ‘కయిత’ అయింది. దీన్ని కైత అని కూడా రాస్తాం.

అన్య దేశ్యాలలో ఖైద్ అనే మాట తీసుకోవచ్చు. దీన్ని ‘ఖైదు’ అనీ ‘ఖయిదు’ అనీ రాస్తున్నాం. ఖైదు’, ‘కయిదు’ అని కూడా రాయవచ్చు. అట్లాగే రైతు – రయితు.

‘ఐ’ని ‘అయ్’గా రాసినట్లే ‘ఔ’ను ‘అవ్’గా రాయడం కూడా ఉంది. ఉదా: ఔడు అవుడు, ఔదల- అవుదల, ఔరా – అవురా, ఔను అవును. ‘అగు’ధాతు రూపాలు ‘అవు’గా ఏర్పడతాయి. అగు నుండే అవును, అవుట ఏర్పడ్డాయి. వీటి ఔను, ఔట అని కూడా రాయవచ్చు. కౌగిలి – కవుగిలి అని రాయవచ్చు. ఇటువంటి మాటలెన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని, కౌజు కవుజు, కౌను- కవును, గౌద- గవుద, గౌళి- గవుళి, గౌసెన- గవుసెన, చౌక- చవుక, చౌడు- చవుడు, చౌలం- చవులం, తౌడు- తవుడు, దౌడు- దవుడు, దౌడ- దవడ. తెలుగు మాటల్లో కొన్ని చోట్ల ‘గ’ – ‘వ’ అవుతుంది. ఉదాహరణకు రగులు – రవులు అవుతుంది, తగులు – తవులు అవుతుంది. ఇటువంటి సందర్భాల్లో ‘రవులు’ను ‘రౌలు’ అనీ, ‘తవులు’ను తౌలు అనీ రాయడం కూడా జరిగింది. ప్రస్తుతం రగులు, తగులు రూపాలే ఎక్కువ ప్రచారంలో ఉన్నాయి. అరువు తెచ్చుకున్న మాటల్లో కూడా ‘ఔ’ ‘అవ్’ కావడం ఉంది. ఉదాహరణకు సంస్కృతం నుండి వచ్చిన రాహుత్తు తెలుగులో రౌతు అయి రవుతుగా కూడా మారుతుంది. నౌబత్తు నవుబత్తు అని కూడా వాడుక. ఫౌజ్ తెలుగులో పౌజు అయింది. దీన్నే పవుజు అని కూడా రాశారు. అట్లాగే ‘కౌలు’కు ‘కవులు’ అన్న రూపం. ఇంగ్లీషు నుండి వచ్చిన ‘ఔట్’ను ఔటు- అవుటు అని రెండు రకాలుగానూ రాస్తున్నాం.

‘ఐ’ని ‘అయ్’గా, ‘ఔ’ను ‘అవ్’గా రాయడం సంస్కృత పదాలలో కుదరదు. సంస్కృతంలో అనేక అర్థాలలో పదం మొదట ఉన్న అచ్చుకు వృద్ధి వస్తుంది. అంటే ఇ, ఈలు ఐ అవుతాయి. ఉ, ఊలు ఔ అవుతాయి. ఉదాహరణకు కుంతి కొడుకులు కౌంతేయులు, కురు వంశజులు కౌరవులు. ఉరస్యుడు – ఔరసుడు అంటే కన్నకొడుకు. పురుషుడు చేసినది పౌరుషేయం. విమానంతో దాటేవాడు వైమానికుడు. ఇంద్రజాలం చేసేవాడు ఐంద్రజాలికుడు. ఈవిధంగా అసంఖ్యాకమయిన పదాలు తయారవుతాయి. యువ యౌవనం, కుమార- కౌమారం, మూల – మౌలిక, చేతన- చైతన్య, కుతూహల- కౌతూహల, చిత్ర – చైత్ర, తిల- తైల, దితి – దైత్య, నీల -నైల్య, పుత్ర- పౌత్ర, జిన – జైన, బుద్ధ – బౌద్ధ మొదలైనవి ఇట్లా ఏర్పడ్డవే. వీటిని సాధారణంగా ఐ, ఔలతోనే రాస్తాం. మవులిక, చయితన్య, చయిత్ర, తయిల, బవుద్ధ అని రాయం. కాని కొన్ని మాటల్లో రెండు రకాల లేఖనం కనిపిస్తుంది. ఉదాహరణకు యౌవనం- యవ్వనం. తెలుగులో ఊయల – ఉయ్యాల, తీయని – తియ్యని, చేయి – చెయ్యి, నేయి – నెయ్యి, నేయడం – నెయ్యడం వంటి వాటి సామ్యం వల్ల ఇది జరిగి ఉండవచ్చు. ‘యౌవనం’ అన్నదే సరయిన రూపం. సంస్కృతంలో అయ్, అవ్ లతో మొదలయ్యే మాటలను ఐ, ఔలతో రాయడం కూడా సరికాదు. ఉదాహరణకు అయస్కాంతాన్ని ఐస్కాంతం అని కానీ అవసరాన్ని ఔసరం అని కానీ రాయడం సరయింది కాదు.

సంస్కృత పదాలలో ఐ, ఔలను యథాతథంగా వాడాలి. అయ్ – ఐ, అవ్ – ఔలను ఒక దానిబదులు ఒకటి వాడకూడదు. తెలుగులో రెండు రకాలుగానూ రాయవచ్చు.

(ఇందులో వాడిన ఫోటోలు “Ramesh Babu” యూట్యూబ్ వి. వారికి కృతఙ్ఞతలు)

-డి. చంద్రశేఖర రెడ్డి
98661 95673

రేపు:-
మన భాష- 8
“విసర్గ ఎక్కడ వాడాలి”

RELATED ARTICLES

Most Popular

న్యూస్