Saturday, November 23, 2024
HomeTrending NewsJournalists: జర్నలిస్టుల పక్షాన బీజేపీ పోరాడుతుంది - బండి సంజయ్

Journalists: జర్నలిస్టుల పక్షాన బీజేపీ పోరాడుతుంది – బండి సంజయ్

‘‘ జర్నలిస్టులు కొనుక్కున్న స్థలాన్ని వాళ్లకు ఇవ్వడానికి అభ్యంతరమేమిటి? వాళ్లకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 10 నెలలు దాటినా ఎందుకు అమలు చేయడం లేదు? సుప్రీంకోర్టు తీర్పునే కాలరాస్తారా? ఈ స్థలం కోసం ఎదురుచూసి ఇప్పటికే 60 మంది జర్నలిస్టులు నేలరాలిపోయారు. ఇంకెంత మంది చస్తే కనికరిస్తారు?’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఈరోజు పేట్ బషీరాబాద్ కు విచ్చేసిన బండి సంజయ్ కుమార్ జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌజింగ్ సొసైటీకి కేటాయించిన స్థలాన్ని సుప్రీంకోర్టు న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎన్.రామచంద్రరావు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మేడ్చల్ అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులు హరీష్ రెడ్డి, విక్రమ్ రెడ్డిలతో కలిసి సందర్శించారు.

అనంతరం రామచంద్రరావు, కూన శ్రీశైలంగౌడ్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ముఖ్యాంశాలు…

15 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం 70 ఎకరాలు స్థలాన్ని జవహర్ లాల్ నెహ్రూ హౌజింగ్ సొసైటీ పేరుతో 1105 మంది జర్నలిస్టులకు కేటాయించింది. ఈ స్థలాన్ని అప్పుడున్న మార్కెట్ ధర ప్రకారం 12 కోట్ల 50 లక్షల రూపాయలు కట్టి ఇక్కడున్న జర్నలిస్టులంతా స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ పైసల కోసం ఆనాడు ఒక్కో జర్నలిస్టు ఇంట్లో అప్పు చేసి, పుస్తెలతాడు కుదువపెట్టి 2 లక్షలు జమ చేసి కట్టారు. కొందరు కోర్టుకు వెళ్లడంతో ఈ కేసు తొలుత హైకోర్టుకు, తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్లింది. 70 ఎకరాల స్థలం జేఎన్ జే సొసైటీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సుప్రీం కోర్టు 2017లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తరువాత గతేడాది ఆగస్టు 24న సుప్రీం కోర్టు ఇచ్చిన తుది తీర్పులో.. 70 ఎకరాలు స్థలాన్ని జేఎన్ జే హౌసింగ్ సొసైటీకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆదేశించారు. ఈ స్థలాన్ని మరెవరికీ కేటాయించరాదని కూడా తీర్పులో స్పష్టంగా చెప్పారు. తీర్పు వచ్చి 10 నెలలైనా కేసీఆర్ సర్కారు  పేట్ బషీరాబాద్ స్థలాన్ని ఎందుకివ్వలేదు.

ఇంకా బాధాకరమైన విషయమేందంటే…. ఈ స్థలాల కోసం ఎదురు చూసి.. చూసి.. 1100 మంది సభ్యుల్లో ఇప్పటికే 60 మందికి పైగా చనిపోయారు. మరో 5 నెలలు ఆగండి… అధికారంలోకి వచ్చేది బీజేపీ. మా పార్టీ అధికారంలోకి రాగానే ఈ స్థలాన్ని జర్నలిస్టులకు స్వాధీనం చేస్తామని హామీ ఇస్తున్నా. అంతేగాదు.. హైదరాబాద్ సహా తెలంగాణలో ఇళ్లులేక ఎదురుచూస్తున్న జర్నలిస్టులందరికీ ఇండ్లు కట్టించి ఇచ్చే బాధ్యత బీజేపీ తీసుకుంటుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్