Monday, January 27, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఎవ్వరి క్షేమం కోసం ఈ మారణ హోమం?

ఎవ్వరి క్షేమం కోసం ఈ మారణ హోమం?

మతాల మధ్య యుద్ధం.
అభిమతాల మధ్య యుద్ధం.
కులాల మధ్య యుద్ధం.
గుణగణాల మధ్య యుద్ధం.
మనుషుల మధ్య యుద్ధం.
మనసుల మధ్య యుద్ధం.
భూమికోసం యుద్ధం.
భామకోసం యుద్ధం.
బతుకుంతా యుద్ధం.
ఆదికాలం నుండీ అనాది కాలంనుండీ యుద్ధమే.
యుగాల చరితంతా యుద్ధమే.
మృగం నుండి మనిషిగా మారినా యుద్ధమే.
దేవతల విజయ దరహాసం వెనుక యుద్దమే.
దీనజన ఆక్రందనల వెనుక యుద్దమే.

అసలు లోకంలో ఇంత సంఘర్షణ ఎందుకు?
మనిషికి ఉన్న ఏదో ఆరాటమే పోరాటంగా మారుతుందట.
ఆ పోరాటం కేవలం తనవరకైతే సాధించిన విజయం ఆనందాన్నిస్తుందేమోకానీ-
అదే మనిషి ఓ రాజ్యానికో దేశానికో ప్రతినిధై తన భావజాలాన్ని తన సమూహంపై రుద్దితే అది అంతులేని అరాచకమే తప్ప అందరికీ ఆహ్లాదమమెప్పటికీ అవ్వదు.
అసలు ఎంత పెద్ద యుద్ధమయినా పుట్టేది ఓ మనిషి మెదడులోనే.
ఓ స్వార్థ భావనో,
ఓ భరించలేనితనమో,
తనదికాని దానిపై అత్యాశో
లేదంటే ప్రదర్శనా ప్రభావమో!

చరిత్ర ఏం చెప్పినా కవులు ఏం రాసినా ప్రతి పాత గాధ వెనుక కారణాలు ఇవే .
సంఘర్షణ మానసికమైతే రవ్వంత రాటుదేలడమో , కన్నీళ్ళ బాట తేలడమో జరుగుతుంది.
అదే శారీరకమైతే రూపం మారుతుంది .అది మనిషికైనా, దేశానికైనా .
అసలు భూమిపై మన కథలే మన కాలాన్ని విభజించలేదూ ?
ప్రతి యుగమూ ఓ యుద్ధానికి ప్రాతినిధ్యం వహించలేదూ?
త్రేతాయుగం మనిషి మనో భావ చంచలనానికి ప్రతీక కాదూ ?
అక్కడ హరిశ్చంద్రుడు చివరికి నెగ్గవచ్చు గాక.
కానీ తనతో ఋషులూ దేవతలూ కలిసి ఆడుకోలేదూ ? అది యుద్ధం కాదూ?
ఓ వ్యక్తి మాట తప్పని మనసు, దారి తప్పని అడుగు – తారామతి మాంగల్యం సాక్షిగా , కాశీలో కాలబోయే కొడుకు రోహితాశుని కట్టె సాక్షిగా సత్య నిరూపణతో అది సత్య యుగమైపోలేదూ ?
కాకపోతే నేడు నాటి అద్భుత భావనలు పాటించే వారిని మరీ అమాయకులుగా లోకం పోకడ తెలియని వెర్రిబాగులవారిగా సత్తెకాలపు మనుషులనడం మారే కాలానికి వేరే మాటై పోయింది.

ఇక ఓ వ్యక్తికి ఎంత పాండిత్యం ఉంటేనేమి?
తను ఎంత శివ భక్తుడైతేనేమి, తన భార్య ఎంత సౌందర్యవతి అయితేనేమి – తనది కాని స్త్రీకై ఆరాటం ..
అక్రమంగా అందాన్ని ఎలా అయినా అనుభవించాలనే వ్యామోహం –
ఓ కోతి సాయానికి తలవంచలేదూ?
ఆ రామ బాణానికి బలైపోలేదూ ?
ఆ రామాయణంనాటి ఆ తప్పుడు వ్యామోహం ఇప్పటికీ సమాజంలో రావణకాష్టంగా జ్వలించడం నేటికీ జరుగుతున్న యుద్ధమే కాదూ?

ఇక-
‘పాచిక ‘ పారిందంటూ
ఈ రాజ్యం మనదేనంటూ
‘వారికి ‘ అడవేనంటూ
ఆడది అబలేనంటూ
మయసభను భరించలేని కురుసభ కుత్సితాన్ని కృష్ణుడి కనుచూపు అర్జునుడి బాణమై భూమి భారాన్ని తగ్గించలేదూ ? ధర్మాధర్మాలు తెలిసినా అధర్మం, అసూయను కాపు కాస్తే అంతటి గంగపుత్రుడూ బాణాలపై పడుకుని ఓ గుక్కెడు గంగకోసం ప్రాధేయపడలేదూ ? కాకపోతే అది రాజధర్మం,
యుద్ధం అనివార్యం అంటూ ఆ మహాభారతం ఓ యుగమై మన నేటి భారతదేశవిధమై , మంచీ చెడులను ఆలోచిస్తూ పెద్దవారమైనా పక్కనున్న చిన్నవారిని ఆక్రమించుకోకపోవడం మన ధర్మబాట. ఈ భూమి కర్మ బాట.

మన నుండే విడిపోయి మనపైనే కక్ష చూపే తత్వం
ఒకే తల్లికి పుట్టిన అన్నదమ్ముల ఆస్థి పోరులా అనిపించడం ఆ నాటి ద్వాపర యుగకాలానికి ద్వారాలు పూర్తిగా మూయబడలేదని అనిపించడం అసంబద్దం కానే కాదు .
ఇక ఇన్ని ఇతిహసాలూ , రాజ్యాల కథలెందుకు?
పొలంగట్ల దగ్గర ఒకే తల్లి పిల్లల పోరాటం
భార్యాభర్తల మధ్య ఓ చిన్న సంఘర్షణ
అత్తాకోడళ్ళ మధ్య ఆధిపత్య పోరు.
పక్కవారిని భరించలేనితనం.
ఆఫీసుల్లో అసూయలు.
మనలో మనకే నచ్చని గుణాలతో పోరాటం.
వదలలేని వ్యసనానిపై వ్యామోహం.
ఎంతకీ తగ్గని తనువు బరువుపై ఉక్రోషం…అన్నీ యుద్ధాలే .
ఒక్కోసారి గెలుపు.
ఒక్కోసారి ఓటమి.
వ్యక్తుల గెలుపోటములు వారి మధ్య బంధాన్ని నిత్య వసంతమో,
గతి తప్పని గ్రీష్మమో చేస్తే..
చివరివరకూ కలిసే ఉండాల్సిన వారి మధ్య యుద్ధం మనసులను మోడువారిన మోహంగానో, చిగురు వీడిన శిశిరం గానో చెయ్యడం ఖాయం .

ఇక ఆధునిక కాలంలో ఎన్ని యుద్ధాలో!
జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలూ , కనులముందే కనిపిస్తున్న మూడోదీ – మానవ నైజాన్ని ఎన్ని రకాలుగా ఎత్తి చూపిస్తుందో.
ఓ జాతిని భరించలేనితనానికి మధ్య , తన ఉనికిని ఎలాగైనా కాపాడుకోవాలన్నతనానికి మధ్య జరుగుతున్న యుద్ధం మధ్య ప్రాచ్యాన్ని మంటల్లో నేడు నిలబెడితే …
ఒకప్పటి తనలో భాగంపై అనేక కారణాలతో మొన్నటి వరకూ అజేయమైన రష్యా , ప్రపంచానికే గోధుమ భాండాగారమైన ఉక్రేయిన్ పై ఉక్రోషంతో తిరిగి కలిపేసుకోవాలన్న తపన యూరోప్ ని రాబోయే రోజుల్లో ఏ తీరానికి చేరుస్తుందో!


కొందరి వ్యక్తుల
అంతు లేని అహంకారం,
హద్దులు లేని అత్యాశ
మిగిలిన దేశాలనూ ఈ పోరులో భాగం చేస్తే –
ఎవరితో యుద్ధమంటూ
ఎందుకీ యుద్ధమంటూ
తనది కాని కారణానికై
నచ్చినా నచ్చకపోయినా పోరాడే వ్యక్తుల మనసునెవరు చూస్తారు ?
ఆ కుటుంబాల కలతనెవరు చూస్తారు ?మళ్ళీ తమ దగ్గరకొస్తారో, రారో ఎవరు చెప్తారు ?
అమ్మా నాన్నలకోసం ,
పెళ్ళాం పిల్లలకోసం పరుగెట్టుకుంటూ వస్తాడో!
జెండా చుట్టి పెట్టెలో వస్తాడో ఎవరు చెప్తారు ?

నాటి కురుక్షేత్రంలో కత్తి పట్టిన వారైనా…
నేటి రష్యాలో కొరియన్ సైనికులైనా…
అందరిదీ ఒకటే కథ.
మానవాళికి యుద్ధం అంతులేని వ్యధ.

-కిలపర్తి త్రినాథ్
9440886844
(భారత వాయుసేన మాజీ ఉద్యోగి. ప్రస్తుతం విశాఖపట్నంలో బ్యాంక్ ఉద్యోగి. రచన ప్రవృత్తి)

Previous article
Next article
RELATED ARTICLES

Most Popular

న్యూస్