Tuesday, September 17, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకొత్త ఐ టీ చట్టాలపై వాట్సాప్ న్యాయపోరాటం!

కొత్త ఐ టీ చట్టాలపై వాట్సాప్ న్యాయపోరాటం!

“కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతీ కర మూలే స్థితా గౌరీ ప్రభాతే కర దర్శనం ” అని స్మరించుకుని…  కాళ్ళు కింద పెట్టకుండా భూమాతని  కుడి చేతితో తాకి కళ్ళకద్దుకుని లేవడం గతకాలమాన సంప్రదాయం. కానీ ఇప్పుడు..?

కరాగ్రే వసతే వాట్సప్ కరమధ్యే ఫేస్ బుక్ కరమూలే ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ కర దర్శనమనుకుంటూ లేవడమే నేటియాంత్రిక జీవనంలో మానసికంగా మాత్రమే కష్టపడుతూ భౌతికసుఖాలకలవాటుపడిన జనుల కొంగొత్త సంస్కృతి.

మరి ఇలాంటి సమయాన అలాంటి సోషల్ మీడియానే సర్వస్వమైపోయినప్పుడు..  సదరు సోషల్ మీడియా.. రాజ్యంపైనే ధిక్కారస్వరం వినిపించడమంటే అతిశయోక్తి ఏమాత్రం కాదు. మనలాంటి ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగపరంగా తప్పు అంతకన్నా కాదు. పైగా ధిక్కారస్వరం వినిపించకుంటేనే అది స్వేచ్ఛాహక్కును తమకు తామే కాలరాసుకున్నట్టు కూడా!! అందులో ఉన్న లొసుగులును పట్టుకుని.. ఆ లొసుగులే ఆశగా, శ్వాసగా పోరాటమూ అంతకన్నా తప్పుకాదు.

అందుకే కేంద్ర ప్రభుత్వ కొత్త డిజిటల్ నియమావళి.. తమ వినియోగదారుల ప్రైవసీకి భంగం కల్పించడమేనంటూ ఏకంగా ఢిల్లీ హైకోర్టుకే ఎక్కింది  మన కరాగ్రే వసతే వాట్సప్.  ఔను ఆ వాట్సప్ ఈమధ్యే కరమధ్యే ఫేస్ బుక్ వశమైన విషయమూమనమెరిగిందే. పైగా.. కరమూలమైన ఇన్ స్టా కూడా వాళ్లదే!  అంటే ఇంకెంత బలముండాలి..?  అందుకే వాట్సప్ రాజ్యంపైనే పిటిషన్ ఏసేసింది.

ఇంతకాలం లేంది ఇప్పుడే ఎందుకొచ్చిందబ్బా  ఈ చిక్కూ అంటే…? మన మోడీ సర్కారు ఈమధ్యే తీసుకొచ్చిన డిజిటల్ నిబంధనలే అందుకు కారణమట! ఛ ఛా… ఆ నిబంధనలే సరిగ్గా లేవు… ఆ నిబంధనలకు మేం కట్టుబడినట్టైతే… మేం నమ్ముకున్న ప్రజాస్వామ్యానికి వమ్ము చేయడమేనన్నది వాట్సప్ వాదన. కాదు కాదు.. మీరు పొరబడుతుందంతా తప్పు… ఏ వినియోగదారుడి వ్యక్తిగత గోప్యతకు వచ్చిన ప్రమాదమేదీ లేదు.. కానీ దేశంలో సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో దేశభద్రత దృష్ట్యా,  లైంగిక నేరాల నుంచి బాధితులను కాపాడాల్సిన తరుణాన, ఉగ్రవాదులు, మావోయిస్టుల చర్యలకు అడ్డువేయాల్సిన పరిస్థితుల దృష్ట్యా మాత్రమే ఈ నిబంధనలను అమలు చేస్తున్నామంటోంది కేంద్రం.

సోషల్ మీడియాలో ఒక మెస్సేజ్ ఎక్కడ పుట్టిందో చెప్పడం ముమ్మాటికీ స్వేచ్ఛాహక్కుకు భంగం కల్పించడమేనని వాట్సపంటుంటే… ఆయా సందర్భాల్లో నేరాలు, ఘోరాలు అడ్డుకోవాల్సి వచ్చినప్పుడు అదేమంత తప్పుకాదు… వాటికి ఒప్పుకుంటేనే సరేసరి.. లేదంటే ఎందుకు ఒప్పుకోవడం లేదో సదరు సోషల్ మీడియా సంస్థలు.. త్వరితగతిన, వీలైతే ఇవ్వాళే తెలియజేయాల్సిందేనన్నది రాజ్యం వాదన.

ఒకవేళ తమ ఆదేశాలను పాటించనట్టైతే… సర్కారు నుంచి పొందుతున్న సౌలభ్యాలను ఆయా సంస్థలు కోల్పోవాల్సిందేనని.. వాటిపై వచ్చే ఫిర్యాదులపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కూడా రాజ్యం హెచ్చుస్వరంతో హెచ్చరిస్తోంది.

ఇప్పటికే మన భారత్ వంటి కంట్రీలో వాట్సప్ వాడుతున్నవారి సంఖ్య 50 కోట్లు.. ఫేస్ బుక్ వాడుతున్నవారి సంఖ్య 40 కోట్లు.. యూట్యూబ్ వాడుతున్నవారి సంఖ్య 45 కోట్లు… ఇన్ స్టా గ్రామ్ సోషల్ వారియర్స్ సంఖ్య 21 కోట్లు.. ట్విట్టర్ ఖాతాల సంఖ్య రెండు కోట్లకు చేరుకుంటున్న దశలో… జనం వీటిని ఉపయోగించుకోలేకుండా.. వాటిని కనీసం పది నిమిషాలకొక్కసారైనా చూడకుండా కూడా ఉండలేని దశలో… ఇప్పుడు సోషల్ మీడియా వర్సెస్ రాజ్యం అనే ఈ ఫైట్ కోర్ట్ మెట్లెక్కడం సర్వత్రా ఒక రకమైన ఉత్కంఠ.. ఆసక్తినీ రేకెత్తించేదే!

మరిప్పటికే రాజ్యాంగంలోని నాల్గు పిల్లర్లూ సర్కారు చేతుల్లో బందీలైపోయాయనే చర్చలు ఇదే సోషల్ మీడియా వేదికగా ఏకంగా విజ్ఞులు, న్యాయకోవిదుల నుంచే వినిపిస్తున్న క్రమంలో… మరి అది లేకుండా మనలేని స్థితిలో జనచైతన్యం వేల మీమ్స్, లక్షల ట్రోలింగ్సై నడుస్తున్న కాలాన… ఆ జనాన్నే నమ్ముకుని పౌరసమాజం తరపున పనిచేస్తామని రాజ్యాన్నే ధిక్కరించిన సోషల్ మీడియా ఆధిక్యం నిలబడుతుందా…?  లేక ఇదే జనంతో కూడిన రాజ్యానికి తండ్రిలాంటి బాధ్యతలను నిర్వర్తిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలకే కోర్ట్ జై కొడుతుందా అన్నది ఎన్ని విచారణలకు తేలేనో ఇప్పటికైతే అంతుచిక్కని ప్రశ్నే మరి..?!!

ఇప్పుడేకంగా.. సోషల్ మీడియా వర్సెస్ రాజ్యమనే ఈ ప్రైవసీ ఫైట్ చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టుగా… మన రాజ్యంలో మన పాలకుల మాటకు జైకొట్టడమా… లేక అది లేకుంటే మనమే లేమనే స్థాయిలో ప్రభావితం చేసిన ఎక్కడినుంచో వచ్చిన సోషల్ మీడియాకు జైకొట్టడమా.. అనే  మీమాంసకు  కూడా తెరలేపి.. పౌరసమాజం బుర్రలను బద్దలుకొట్టేదే మరి!

-రమణ కొంటికర్ల

RELATED ARTICLES

Most Popular

న్యూస్