రాస్తే హిందూపురం కథ చాలా పెద్దది. ఎవరూ రాయక, చెప్పక చాలా చిన్నదైపోయింది. మరాఠా యోధుడు మురారి రావు తన తండ్రి హిందూరావ్ పేరుతో స్థాపించిన ఊరు కాబట్టి “హిందూపురం” అని పేరు వచ్చిందని చెబుతారు. ఆ మరాఠా యోధుడు ఇక్కడే ఎందుకు ఒక కొత్త ఊరిని పుట్టించాడో! లేక అప్పటికే ఉన్న ఊరికి తన తండ్రి పేరు పెట్టి విస్తరించాడో! అన్న చారిత్రక సత్యాల లోతులను హిందూపురం పెద్దగా తవ్వుకోలేదు. ఈ కథ ప్రకారం హిందూపురానికి మూడొందల సంవత్సరాల చరిత్ర ఉండి ఉండాలి. ఐదొందల సంవత్సరాల క్రితం విజయనగర ప్రభువు అచ్యుతరాయల పెనుకొండ కొలువులో కోశాధికారిగా ఉన్న విరుపణ్ణ లేపాక్షి ఆలయం కట్టిన నాటికి హిందూపురం ఊరు ఉన్నట్లు లేదు. లేపాక్షి శాసనాల్లో పక్కనున్న కంచిసముద్రం, చోళసముద్రం ఊళ్ళ గురించి ప్రస్తావన ఉంది. ఆ ఊళ్ళు ఇప్పటికీ అదే పేర్లతో అలాగే ఉన్నాయి. పరిగి, శాసనకోటల్లో దొరికిన శాసనాల్లో లేపాక్షి, పెనుకొండ, మడకశిర, అమరావతి(మడకశిర దగ్గరి ఊరు) గురించి ఉంది కానీ…హిందూపురం గురించి ఒక్కమాట కూడా లేదు.
దక్షిణాన తమిళనాడులో మన తెలుగు నాదబ్రహ్మ త్యాగయ్య తండ్రికి ఆశ్రయమిచ్చింది శరభోజీ మహారాజు మరాఠా రాజే. ఇప్పుడంటే కర్ణాటక- ఆంధ్ర- తమిళనాడు- మహారాష్ట్ర రాష్ట్రాలు అంటున్నాం కానీ…మూడు, నాలుగు వందల ఏళ్ళు వెనక్కు వెళితే…రాజుల పాలనలో ఇప్పటి మన సరిహద్దులేవీ అప్పుడు లేవు.
హిందూపురం ఎలా పుట్టింది? ఎందుకు పుట్టిందో? కనుక్కునే అవసరం హిందూపురానికి ఇప్పటిదాకా కలగలేదు. ఇకముందు కలుగుతుందన్న నమ్మకమూ లేదు. ఎవరు పుట్టించారో కూడా ఇప్పటితరానికి తెలియకపోవచ్చు.
ఎన్ టీ ఆర్, హరికృష్ణ,బాలకృష్ణ ప్రాతినిథ్యం వహించడంవల్లే హిందూపురానికి ఈమాత్రం పేరొచ్చిందని ఈతరం అభిప్రాయం. అంతకుముందు స్వాతంత్ర్య సమరయోధుడు పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు, నీలం సంజీవరెడ్డి లాంటి మహామహులు హిందూపురం ప్రతినిధులుగా పనిచేసిన విషయం మరుగునపడిపోయింది. తమ ప్రతినిధిగా స్థానికేతరుడిని నెత్తిన పెట్టుకుని…స్థానికుడిని పక్కన పెట్టే హృదయ వైశాల్యం, ఔదార్యం గొప్పదో! కాదో! ఎప్పటికీ తేల్చుకోలేని అయోమయం హిందూపురానిది. ఒక నాయకుడిని ఎదగనివ్వని హిందూపురం రాజకీయాలే స్థానికేతరులకు అద్భుతమైన అవకాశం ఇచ్చి ఉండవచ్చు. ఒకసారి పరాయి ప్రాతినిథ్య పరవశం అలవాటు అయ్యాక ఇక స్థానిక నాయకత్వం ఎదిగే అవకాశం ఉండదు.
హిందూపురం ఔదార్యానికి, హద్దులెరుగని అభిమానానికి ఒక ఉదాహరణ మాత్రం చెప్పుకుని తీరాలి. హిందూపురం ప్రతినిధి చేతికి వాటంగా ఉంటే ఎవరి చెంప ఎప్పుడు చెళ్లుమంటుందో తెలియదు. అలా ఒకానొక అభిమాని చెంప ఒక గుంపులో పబ్లిక్ కెమెరాల సాక్షిగా చెళ్లుమంది. సాయంత్రానికి ఆ అభిమాని గుండెలు పొంగిన ఆనందంతో సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. “ఈరోజు నా జన్మ ధన్యం. ఈ ఎరుపెక్కి వాచిన నా చెంప, నా చెంప మీద ఈ వేలి గురుతులే కలకాలం నాకు తీపి గురుతులు” అన్నది ఆ వీడియో సారాంశం. ఇలాంటి చెంపదెబ్బలు తినే అవకాశం మాకెప్పుడో! అని హిందూపూర్ అభిమానం ఎల్లప్పుడూ ఎదురుచూస్తూ ఉంటుంది. ఇది మాటలకందని అభిమానం! అయినా…కందకులేని దురద కత్తికెందుకన్నట్లు ఈ విషయంలో చర్చ అనవసరం.
హిందూపురంలో నేను చదువుకున్నాను. విలేఖరిగా పనిచేశాను. హిందూపురం గురించి రాయమని నా మిత్రులు ఎప్పటినుండో అడుగుతున్నారు. ఇప్పటికి కుదిరింది. ఊరంటే గోడలు, నీడలు కాదు. ఊరంటే మనుషులు. ఆ మనుషుల స్వభావాలు, అలవాట్లు, భాష- యాస, తిండి, వేషం, అభిరుచులు, చరిత్ర, కళలు, గుడిగోపురాలు, సంస్కృతి…ఇలా అన్నిటి కలగలుపు. ఈకోణంలో హిందూపురాన్ని నాకు తెలిసినంతవరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను.
హిందూపురం అనగానే మొట్టమెదట చెప్పాల్సింది పెన్నా నది గురించి. తమ ఊరు పెన్నా నదిలో ఉందో! ఊరే పెన్నను మింగేసిందో! హిందూపురానికి తెలియకపోవచ్చు కానీ…నీరింకిన పెన్నకు మాత్రం తెలుసు.
హిందూపురం పక్కన కర్ణాటక నంది హిల్స్ లో పుట్టే పెన్నా నది 600 కిలోమీటర్లు ప్రవహించి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు తీరంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. పెన్న- పెద్ద; ఏరు కలిసి పెన్నేరు. శివుడి ధనస్సు పేరు పినాకం. నంది కొండల్లో శివుడి చెంత నంది కొమ్ముల మధ్య పుట్టిన నది కాబట్టి పినాకిని అని పెన్నకు మరొక పేరు. అంతటి ఆకాశగంగనే నెత్తిన జడలో చుట్టేసుకున్న శివుడి పినాకం పేరుతో ఉన్న నది రెండు, మూడు తరాలకొకసారి నీటి చుక్కను చూడడం కూడా శివుడి లీలే అయి ఉండాలి.
కర్ణాటకలో ప్రవహించే కుముద్వతి; జయమంగళి, చిత్రావతి, పాపాఘ్ని పెన్నకు ఉపనదులు. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో, కర్ణాటకలో ఈ ఉపనదులన్నీ పెన్నలో కలుస్తాయి. అందుకే పెన్న దారి పొడుగునా అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో కన్నడ సంస్కృతి కూడా పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. కన్నడ నేలను దాటిన తరువాత కుందేరు, సగిలేరు, చెయ్యేరు, బహుదా, బొగ్గేరు, బీరాపేరు ఇలా మరికొన్ని ఉపనదులు పెన్నలో కలిసి బంగాళాఖాతం దాకా వెళ్లి వీడ్కోలు చెబుతాయి.
పెన్నార్-కుముద్వతి; పి ఏ బి ఆర్; పెనకచర్ల; చిత్రావతి; మైదుకూరు; యోగివేమన; సోమశిలలాంటి డ్యాములు పెన్న కడుపులో జలభాండాగారాలు. ఇందులో పి ఏ బి ఆర్, పెనకచర్ల డ్యాములకు నీళ్లు తుంగభద్ర హై లెవెల్ కెనాల్ నుండి వస్తాయి. కన్నడ- తెలుగు కలిసినట్లు పెన్న- తుంగ- భద్ర కూడా వియ్యమంది చుట్టాలయ్యాయి.
“నంది పర్వత జాత నవ పినాకినీ జలము నీ స్నాన సంస్పర్శ నిలువునా పులకించె”
అన్నాడు అడవి బాపిరాజు. నంది కొండల్లో పుట్టిన పినాకినీ నీళ్లల్లో లేపాక్షి నంది స్నానం చేయడంతో ఆ నది నిలువెల్లా పులకించిందట. పెన్న దారంతా పుణ్య క్షేత్రాలే. పుణ్యతీర్థాలే.
రేపు:-
“హిందూపురం ఆణిముత్యం
కల్లూరు సుబ్బారావు”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు