Sunday, January 26, 2025

మన భాష- 8

తెలుగులో విసర్గ లేదు. సంస్కృత పదాలతో పాటు ఇది తెలుగులో వాడుకలోకి వచ్చింది. విసర్గకు హకారోచ్చారణ ఉంటుంది. సంస్కృతంలో పదాంతంలో ప్రత్యయ రూపంలో దీనికి వాడుక ఎక్కువ. సమాసంలో రెండు మాటలు కలిసినప్పుడు మొదటిమాట చివర ఉన్న విసర్గకు సాధారణంగా లోపం వస్తుంది. ఇది సకారమో, రకారమోగా కూడా మారుతుంది. కొన్ని చోట్ల మార్పు లేకుండా విసర్గ అట్లాగే ఉండిపోవచ్చు.

సంస్కృత పదాలు తెలుగులోకి వచ్చినప్పుడు వాటి చివర ఉన్న విసర్గ లోపిస్తుంది, తెలుగు ప్రత్యయం వచ్చి చేరుతుంది. పదంలో భాగంగా ఉండి మరోరకంగా వాడడానికి వీల్లేని మాటలు మాత్రం చాలా తక్కువ. అటువంటి మాటల్లో ముఖ్యమైంది దుఃఖం. దీనికి బదులుగా దుక్ఖం, దుక్కం, దుఖ్ఖం అని వ్యవహారం ఉంది. సృజనాత్మక రచనల్లో ఇటువంటి లేఖనం ఉంది. కాని దుఃఖం అన్న రూపమే చాలా ప్రచారంలో ఉంది.

విసర్గ చివర ఉండే మాటలు కూడా తెలుగులో వాడుతూ ఉన్నాం. వాటిలో పునః, వస్తుతః, స్వతః, బహుశః, ప్రాయశః, అన్యతః మొదలయినవి ముఖ్యమైనవి. పునః అంటే మళ్ళీ అని అర్థం. మళ్ళీ మళ్ళీ అన్న అర్థంలో పునః పునః అని వాడతాం. పౌనఃపున్యంగా అని కూడా ప్రయోగిస్తాం. పునఃపరిశీలన, పునఃప్రయత్నం, పునఃప్రక్షాళన, పునఃపరీక్ష మొదలయిన విధంగా పునః ప్రయోగించవచ్చు.

వస్తుతః అంటే స్వభావరీత్యా అని అర్థం. వాడి గుణం అది. స్వతః అన్నా కూడా అదే అర్థం. స్వతహాగా అని విసర్గకు బదులు హకారంతో వాడుక ఉంది. స్వభావతః అని కూడా అనవచ్చు.

బహుశః అన్నమాటకు తెలుగులో వాడుక ఎక్కువ. బహుశః అనీ, బహుశా అనీ కూడా రాస్తాం. చాలావరకు అని అర్థం. ప్రాయశః అన్న మాట కూడా ఇటువంటిదే. తరచుగా అని దీనికి అర్థం.

అన్యతః అంటే మరోవిధంగా అని అర్ధం. సద్యః అంటే వెంటనే అని అర్థం. సద్యః పర నిర్వృతి అంటే వెంటనే కలిగే నిరతిశయమయిన ఆనందం అని అర్థం. కావ్యం చదవడం వల్ల సద్యః పరనిర్వృతి కలుగుతుందట. ప్రథమతః మొదటిగా అని అర్థం. క్రమశః అంటే వరుసగా అని అర్థం. ఈ అర్థంలోనే క్రమేణ అనీ, క్రమేపి అని కూడా వాడతాం.

జన్మతః అంటే పుట్టుక నుండీ అని అర్థం. సర్వతః అంటే అన్ని విధాలా అని అర్థం. సమాసంలో కొన్నిచోట్ల విసర్గ యథాతథంగా ఉంటుంది. సాధారణంగా క, ఖ, ప, ఫల ముందు విసర్గ మారదు. ఇటువంటి సమాసాలు సంస్కృతంలో బాగానే ఉన్నాయి. వాటిని తెలుగులో కూడా అట్లాగే వాడుతున్నాం. తెలుగులో ఇటీవల విస్తృతంగా వాడుతున్న సమాసపదం వయః పరిమితి. చాలా సందర్భాలలో వయోపరిమితి అని రాస్తున్నారు. ఇక్కడ విసర్గకు బదులు ‘ఓ’ రాదు. వయఃపరిమితి అనే అనాలి. అట్లాగే వయఃపరిమితి కూడా. వయఃపరిపాకం అనవచ్చు.

మనస్ అన్న మాట కూడా సమాసంలో క, ఖ, ప, ఫ ల ముందు మనః అవుతుంది. మనః ప్రవృత్తి, మనః పరిణతి, మనః కమలం, మనఃఖేదం, మనఃక్షోభ, మనఃఫలకం మొదలయినవన్నీ మనం సాధారణంగా వాడేవే.

అంతఃపురం అన్నమాట కూడా మనం ఎక్కువగా వాడేదే. దీనిలాగే అంతఃకరణం కూడా. అంతఃకరణం అన్న మాటను మనస్సు అనే అర్థంలో వాడుతున్నాం. ఈ రెండూ పూర్తిగా సమానార్థకాలు కాకపోయినా ‘వాడి అంతఃకరణంలో ఏముందో!’, ‘వాడి అంతఃకరణాన్ని అడిగితే తెలుస్తుంది’ వంటి వాక్యాలలో మనస్సు, అంతరాత్మ అనే అర్థాలే తోస్తాయి.

ప్రాతఃకాలం అంటే వేకువ సమయం, తెల్లవారుజాము. పొద్దున లేవగానే స్మరించుకోవల సిన వ్యక్తిని ప్రాతఃస్మరణీయుడు అంటాం.

మెప్పుకోలుగా తల పంకించడం శిరఃకంపం చేయడం, మంత్రులందరిలో ముఖ్యుడు శిరః ప్రధాని.

తపస్సు వల్ల కలిగిన ఫలం తపఃఫలం. కన్నులకు ఆనందం చక్షుఃప్రీతి. యశస్సు అనే శరీరం కలిగినవాడు యశఃకాయుడు. కీర్తిశేషుడన్నమాట. కీర్తికాయుడు అని కూడా అంటాం. ఇనుపముద్ద అయఃపిండం. కాశీఖండం అయఃపిండం అని నానుడి. శ్రీనాథుని కాశీఖండం అయఃపిండం లాంటిదన్న మాట. ఉషస్సమయంలోని కిరణాలు ఉషఃకిరణాలు.

పాలు తాగడం పయఃపానం. సముద్రుణ్ణి యాదఃపతి అని కూడా అంటారు. జలచరాలన్నిటికీ రాజని అర్థం. ఛందస్సును ప్రస్తరించడం ఛందఃప్రస్తారం.

కొన్ని మాటల్లో విసర్గతోనూ ప్రయోగం ఉంటుంది. పైమాటతో కలిపి సంధి చేయడమూ ఉంటుంది. మనఃశాంతి అనీ అనవచ్చు. మనశ్శాంతి అనీ అనవచ్చు. అదేవిధంగా దోఃశక్తి – దోశ్శక్తి, భుజబలం అన్నమాట. చతుఃషష్టి అనీ రాయవచ్చు, చతుష్షష్టి అనీ రాయవచ్చు. నమస్కారం, తిరస్కారం అన్నవాటిని నమఃకారం తిరఃకారం అనీ అనవచ్చు. కాని తెలుగులో నమస్కారం, తిరస్కారం అన్నవే వాడుకలో ఉన్నాయి. అహఃపతి అంటే సూర్యుడు. పగలుకు అధిపతి. అహర్పతి అని కూడా అనవచ్చు. గీఃపతి అంటే బృహస్పతి. గీర్పతి, గీష్పతి అని కూడా ప్రయో గించవచ్చు.

క, ఖ, ప, ఫ ల ముందు సకారాంత పదాల సకారం విసర్గ కావడం అన్ని చోట్లా జరగదు. ఉదాహరణకు శ్రేయస్+కాముడు శ్రేయస్కాముడు అవుతుంది. శ్రేయఃకాముడు కాదు. అట్లాగే అయస్కాంతం, బహిష్కారం, భాస్కరుడు, దివస్పతి, సుయశస్కుడు, ధనుష్ఖండం, నిష్కారణం, దుష్కృతి, దుష్కార్యం, ధనుష్కోటి, చతుష్పథం మొదలయిన మాటలిటువంటివి.

-డి. చంద్రశేఖర రెడ్డి
98661 95673

(ఇందులో వాడిన ఫోటోలు “Telugu Online Teaching”, “Telugu Vanam: యూట్యూబ్ వి. వారికి కృతఙ్ఞతలు)

రేపు:-
మన భాష- 9
“సున్నా ఎక్కడ”

RELATED ARTICLES

Most Popular

న్యూస్