Friday, November 22, 2024

పల్నాటి సీమ

తెలుగు సాహిత్యంలో శ్రీనాథుడు శిఖర సమానుడు. ఆరేడు శతాబ్దాల క్రితం అప్పటికి కలిసి ఉన్న కర్ణాటక- ఆంధ్ర ప్రాంతాల్లో అతడు తిరగని రాజ్యం లేదు. తెలుగు పద్యాన్ని పల్లకిలో ఊరూరా తిప్పినవాడు శ్రీనాథుడు. బంగారు నాణేల స్నానాల సన్మానాలు పొందినవాడు. భోజనం తరువాత శ్రీనాథుడు వేసుకున్న తాంబూలంలో కస్తూరి పరిమళం ఇన్ని శతాబ్దాలయినా ఇగిరిపోలేదు. బంగారు తూగుటుయ్యాలలో ఊగుతూ శ్రీనాథుడు పద్యం చెబితే లోకం విని రాసుకుంది.

విలాసవంతమయిన శ్రీనాథుడి జీవితం అంత్యదశలో అష్టకష్టాలపాలైన మాట నిజం. చేసిన ఏడు వందల అప్పు తీర్చడానికి కృష్ణా తీరంలో వ్యవసాయం కూడా చేసి చేతులు కాల్చుకుని-

“కృష్ణ వేణమ్మ గొనిపోయె నింత ఫలము
బిల బిలాక్షులు దినిపోయె తిలలు, పెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
నెట్లు చెల్లింతు టంకంబు లేడు నూర్లు?” అని పద్యంలోనే పరిపరివిధాలుగా విలపించాడు.

శ్రీశ్రీ వ్యక్తిగత అలవాట్లను ముందు పెట్టుకుని అగ్గికి వేడి పుట్టించే ఆయన కవిత్వాన్ని చూడకూడదు. అలాగే శ్రీనాథుడి విలాసవంతమయిన జీవితంతో మనకేమి పని? తెలుగు పద్యానికి వెలుగులద్దినవాడు. పద్యం ఎత్తుగడ, సుదీర్ఘ సంస్కృత పదబంధాల బిగింపు, మహా ప్రవాహ వేగం, కొత్త కొత్త అచ్చ తెలుగు మాటలను పుట్టించడం…ఇలా పద్యరచనలో శ్రీనాథుడికి శ్రీనాథుడే సాటి. తరువాత వందల మంది ప్రబంధ కవులు శ్రీనాథుడి దారిలోనే వెళ్లారు కానీ…శ్రీనాథుడిని చేరుకోలేకపోయారు.

మొన్న ఒకరోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం దాకా రెంటచింతల, మాచర్ల పల్నాడు సీమలో తిరుగుతుంటే శ్రీనాథుడు, ఆ ప్రాంత మహాకవి గుర్రం జాషువా వెంటపడ్డారు.

“చిన్న చిన్న రాళ్ళు చిల్లర దేవుళ్ళు
నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు
సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును తేళ్ళు
పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు”

అన్నాడు శ్రీనాథుడు. నాపరాతి ముక్కలతో కట్టిన గోడలు, దుమ్ము రేగే నేలలతో పల్నాటి ముద్ర స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. వెయ్యేళ్ల క్రితమే అంటరానితనాన్ని రూపుమాపడానికి పల్నాటి బ్రహ్మన చేసిన ప్రయత్నం అనన్యసామాన్యం. పౌరుషాల గడ్డ. దాయాదుల పోరులో కుత్తుకలు తెగి నెత్తురు ఏరులై పారిన గడ్డ. కోళ్లు కూడా కాళ్లకు కత్తులు కట్టుకుని పరస్పరం మెడలు కోసుకున్న గడ్డ. సమసమాజ అభ్యుదయ భావాలకు శ్రీకారం చుట్టిన గడ్డ.

ఆనాడు శ్రీనాథుడు, మొన్నటికి మొన్న గుర్రం జాషువా చెప్పిన పల్నాడును తలచుకుంటూ…ఈనాటి పల్నాటి సీమ దాటి…సూర్యుడు ఎదురెండగా నాగార్జునసాగర్ కృష్ణలో తళతళలు, మిలమిలతో మెరిసిపోతూ ఉండగా తెలంగాణలోకి ప్రవేశించాను. సాగర్ కుడి ఎడమ కాలువలు పెంచి పోషించిన పచ్చటి వరి పొలాల మీద సూర్యుడు సాయం సంధ్య బంగారు రంగు పులుముతున్నాడు. కుడి ఎడమ నీటి విద్యుత్ ను మోసుకెళ్లే పెద్ద పెద్ద కరెంటు టవర్లు చేతులు చాచిన మనిషిలా ఆకాశంలో నిలుచుని వైర్లను మోస్తున్నాయి. “అరకోటి ఎకరాల మాగాణికి పైరు పచ్చల పట్టు చీర కట్టిన మా కృష్ణవేణి”; “తెలుగింటమ్మ వెలుగింటమ్మ కృష్ణవేణి” అన్న వేటూరివారి కృష్ణా పుష్కరాల పాటలు మదిలో మెదిలాయి.

వరి పొలాల గట్ల మీద రెల్లు పొదల అందం ప్రకృతి గీసిన మనోహర వర్ణచిత్రంలా ఉంది. పైరు పచ్చటి పొలాల అంచుల్లో తెల్లటి దూది రంగు రెల్లుగడ్డి గాలికి ఊగుతుంటే అక్షరం ముక్కరానివాడు కూడా కృష్ణశాస్త్రి కావాల్సిందే. సెల్ ఫోన్ నిండా ఆ దృశ్యాలను బంధిస్తూ రాత్రికి కాంక్రీట్ జంగిల్లో నా గూడు చేరుకున్నాను.

కొసమెరుపు:-
రెంటచింతల్లో రెండు నిముషాలు ఎండలో నిలుచుంటే చలికాలంలో వేసవి వడగాడ్పుల అనుభవం ఎదురయ్యింది. ఈలోపు స్థానిక మిత్రుడు మా రెంటచింతల ప్రపంచంలోనే మండే ఎండకు పెట్టింది పేరు….త్వరగా రండి అంటూ కార్లో ఏ సి ఆన్ చేసి లోపల కూర్చోబెట్టాడు. కూర్చోగానే వేడి వేడి అరిసెలు మీకోసమే తెచ్చారు…తింటారా! అని మొహమాట పెట్టాడు. వేడికి వేడే విరుగుడు- “ఉష్ణం ఉష్ణేన శీతలం” అన్న పురాతన పరమ ప్రమాణాన్ని రెంటచింతల బాగా వంట పట్టించుకున్నట్లుంది. “మా ఊరి మండే ఎండ” అంటున్నప్పుడు అతడి కళ్ల వెలుగులో నాకు “జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసి” అని రాముడిచేత వాల్మీకి చెప్పించిన వేదవాక్కు ప్రతిధ్వనించింది.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్