Friday, April 19, 2024

దూరపు కొండలు

Dolllar Dreams- Realities: మెరుగైన ఉపాధి అవకాశాలు, జీవన ప్రమాణాల కోసం మన దేశానికి చెందిన వారు అమెరికా, ఇంగ్లాండ్, కెనడా లాంటి దేశాలకు వలస వెళ్లడం అందరికీ తెలిసిందే. హైదరాబాద్ లాంటి నగరాల్లో ప్రతి అపార్ట్మెంట్ లో కనీసం మూడు కుటుంబాలు – పిలల్లు అమెరికాలో, తల్లి తండ్రులు ఇక్కడ.

అపర కుబేరుల్లో ఇటీవల ఒక ట్రెండ్ నడుస్తోంది. సుఖవంతమైన జీవనం సాగించడానికి అనువైన దేశాలను ఎంచుకోవడం, ఆ దేశాల పొరసత్వాన్ని డబ్బెట్టి కొనుక్కోవడం… ఇదీ నడుస్తున్న చరిత్ర.

ఆస్ట్రేలియా, అమెరికా, స్విట్జర్లాండ్, సింగపూర్, ఇజ్రాయెల్, న్యూజిలాండ్, పోర్చుగల్, గ్రీస్ … ఇవి అపర కుబేరుల్ని ఆకర్షిస్తున్న దేశాలు.

మన దేశం వారైతే అమెరికా, ఇంగ్లాండ్, కెనడా వైపు ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు.

ఇలా వలస పొతే బాధలు తప్పించుకొని హ్యాపీగా జీవనం గడపవచ్చా?

మా తాతలు నలుగురు. వారిలో ఇద్దరు మలేషియాకు వలస పోయారు. ఆ రోజుల్లో బహుభార్యత్వం సహజం. ఇప్పుడు మలేషియాలో కనీసం వంద కుటుంబాలు మా బంధువులు ఉన్నారు. ఇండియాలో స్థిరపడిన మా బంధువుల తో పోలిస్తే మలేషియాలో స్థిరపడినవారు మెరుగైన జీవన ప్రమాణాలు కలిగి ఉన్నారు. ఇక్కడికంటే విశాలమైన ఇళ్ళు, వాహనాలు, జీతం / ఆదాయం. ఇప్పుడు నాలుగో తరం- ఐదో తరం వచ్చేసింది. వీరిలో ఎక్కువ మంది మలేషియా వదిలి ఆస్టేలియా లో స్థిరపడుతున్నారు. లేదంటే సింగపూర్ లో .

“మలేషియా లో పరిస్థితులు రానురాను దుర్భరం అవుతున్నాయి. ఇక భవిషత్తు ఎలా ఉంటుందో! అయినా మన తాతలు పుట్టిన దేశంలో అంటే సొంత దేశంలో ఉంటే ఆ సంతృప్తే వేరు. నువ్వు ఎంత చేసినా, ఎంత సాధించినా పరాయి దేశంలో పరాయే. ఎన్ని తరాలు మారినా ఇది అంతే” … ఇటీవల వివిధ సందర్భాల్లో మా బంధువులు నాతొ అన్న మాటలు.

“సింగపూర్ ఎంత గొప్ప దేశం!!! .. శుచిశుభ్రత, మెరుగైన పరిపాలన, సివిక్ సెన్స్ .. ఒకటా రెండా? మెట్రో ఎక్కితే అరగంటలో సింగపూర్ ఒక కొస నుంచి మరో దానికి చేరుకోవచ్చు. బెంజ్ కార్ కన్నా సుఖవంతంగా ఉంటుంది. టైం సేవ్. లిటిల్ ఇండియాలో దిగితే ఆంధ్ర భోజనం, చెట్టినాడు భోజనం, కేరళ భోజనం .. అన్నీ పక్క పక్కనే. ముస్తఫా సెంటర్ కు పొతే ఇండియా నుంచి వచ్చిన దుస్తులు. బెస్ట్ క్వాలిటీ. అసలు ఆ క్వాలిటీ ఇక్కడ దొరకదు. అక్కడే దొరుకుతుంది. రేట్స్ కూడా ఫరవాలేదు. సెటిల్ అయితే సింగపూర్ లో సెటిల్ కావాలి”  ఒకప్పటి నా ఆలోచనలు .

Abroad

నిజమే యాభై ఏళ్ళ క్రితం మలేషియా నుంచి వేరుపడిన సింగపూర్ అద్భుత ప్రగతి సాధించింది. బెస్ట్ గవెర్నన్స్. ఒకసారి లిటిల్ ఇండియాలో ఉంటే భారీ వర్షం కురిసింది. అర గంట కుండపోత. ఇక్కడైతే మూడు రోజులు రోడ్లు జలమయం అయివుండేవి. అక్కడ వర్షం వెలిసిన పది నిముషాల్లో రోడ్డుపై నీటి చుక్క లేదు.

జపాన్ లో అయిదు గంటలు రోడ్డుపై బస్సులో పయనించి దిగి ఆ బస్సు టైర్ ను వేలితో అద్ది చూస్తే వేలిపై మరక కనిపించలేదు. ఇది కలా? నిజామా? అనిపించింది.

న్యూజిలాండ్ లో క్వీన్స్ టౌన్ నుంచి మిలీఫోర్డ్ సౌండ్ కు బస్సులో ప్రయాణిస్తుంటే అయిదు గంటల్లో మీకు కనపడే వాహనాలు వంద కంటే తక్కువ. అరగంటకు ఒక చిన్న కాలనీ. నదుల్లో నీరు బాటిల్ లో తీసుకొని తాగొచ్చు. నిజమైన మినరల్ వాటర్ ఆంటే అదే. “మానవుడు సంచరించని భూప్రపంచానికి వచ్చాము. అసలు బతికితే ఇక్కడే బతకాలి” అనిపించింది.

కానీ….

సింగపూర్ ఒక చిన్నదేశం. ఏమాత్రం పరిస్థితి తలకిందులు అయినా అది శ్రీలంకే. న్యూజిలాండ్ లో ఇప్పుడు ఆర్థిక సంక్షోభం. జపాన్ లో వేరే దేశం వారికి అసలు ప్రవేశం లేదు. లేదంటే లేదని కాదు. క్లుప్తంగా చెప్పాలంటే నువ్వు అక్కడికి టూర్ కు వెళ్లగలవు. అంతే!

మనవాళ్ళు ఎన్నిచెప్పినా లండన్, ఆస్ట్రేలియాల్లో జాతి విద్వేషం. నీ ఇంటి బిడ్డకు ఇరుగుపొరుగు పిలల్లు దాన్ని రుచి చూపిస్తారు.

ఇక అమెరికా గురించి ఒక మాటలో చెప్పాలి ఆంటే అదో రొటేషన్ చక్రవర్తి. ప్రొఫషనల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లాంటి వి ఉన్న మాట వాస్తవం. మనదేశంలో కనిపించే కాలుష్యం అక్కడి కంటికి అంతగా కనిపించని పొల్యూషన్. లాస్ ఏంజెల్స్ లో కారు ఎక్కగానే ఒక సిక్కు డ్రైవర్ మాటలు “సార్ .. ఇక్కడ అంతా బాగుటుందని అందరూ అనుకొంటారు . కానీ లైఫ్ చాల టఫ్. బతకడానికి చాలా కష్టపడాలి. ఇరవైలో ముప్పైలో లైఫ్ బాగుంటుంది. సమస్యలు నలబై లో మొదలవుతాయి”

పెట్రో డాలర్ పరిస్థితి మారితే రొటేషన్ చక్రవర్తి స్థితి ఏంటో ఊహించడం కష్టం!

ఇంగ్లాండ్ లో అయితే ఇప్పుడే పరిస్థితి ఏమీ బాగోలేదు. మొన్నటిదాకా ఎండలు. ఎండలకు నిజంగానే జనాలు చచ్చిపోయారు. రైలు పట్టాలు కరిగిపోయాయి. ఇప్పుడు ఆకలి కేకలు. విపరీతంగా పెరుగుతున్న ధరలు. రెండు ఉద్యోగాలు చేసినా రెండు పూటలు తిండి తినలేని స్థితిలో కొందరు.

ఇక స్కాండినేవియన్ దేశాలు .. గాలి బుడగలు . భూతాపానికి ఆర్కిటిక్ మంచు కరిగితే కొంపలు కాదు దేశాలే మునుగుతాయి.

దూరపు కొండలు నునుపా? ఆలోచించండి!

మరి ఇండియా?

ఆయన ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు డిజిపి స్థాయి అధికారి. విజయవాడ ఎయిర్పోర్ట్ లో నాలుగేళ్ళ కింద కలిసాడు. IPS అధికారుల బాధలు (దేశం మొత్తం మీద ఏదో ఒక రాష్ట్రం అని కాదు) హైదరాబాద్ లో విమానం దిగేవరకు చెబుతూనే వచ్చాడు. ఆమె హైదరాబాద్ లో స్థిరపడిన మహిళా IPS . డీజీపీ స్థాయిలో రిటైర్డ్. పోలీస్ ఉద్యోగాలు వద్దు మొర్రో అంటారు. మరో సందర్భంలో ఐఏఎస్ అధికారిది ఇదే మాట. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు RJD జాయింట్ డైరెక్టర్ గా ఉన్న నా శిష్యులు తమ వృత్తిలో ఎదురయ్యే సాధక బాధకాలు చెప్పుకొని దాదాపుగా కన్నీళ్లు పెట్టుకొంటున్నారు.

వ్యాపారం చేసేవారిని అడగండి, వద్దు మొర్రో అంటారు. ఈ బాధలు పడలేము… మా పిలల్లకు ఈ వృత్తి వద్దు అంటారు.

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేసి రెండు లక్షలు నెలకు సంపాదించే వ్యక్తి ఒక చిన్న పుస్తకాల షాప్ పెట్టుకొంటాము. ఈ వృత్తిలో ఉండలేను అంటాడు.

క్యాబ్ డ్రైవర్ ను కదపండి. కన్నీళ్లు పెట్టుకొంటాడు. ఏదో మోసపోయి క్యాబ్ కొనుకొన్నాను అంటాడు.

ఇక టీచర్ లు .. ప్రైవేట్ టీచర్ ల ది కన్నీటి వ్యధ . ప్రభుత్వ టీచర్స్ కూడా సంతృప్తిగా లేరు .

ఐఏఎస్ ఆయన వద్దు మొర్రో ఈ సర్వీస్ అంటాడు . IPS ఆమెదీ అదే మాట . బ్యాంకు ఉద్యోగులు , సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, రెవెన్యూ, రోడ్డు రవాణా, విద్యా రంగంవ్యాపార రంగం .. ఎవరిని కదిపినా ఏడుపే .

అంటే అసంతృప్తి. తీవ్ర అసంతృప్తి.

మొన్న ఒక యువ లాయర్ ఇటీవల తన రంగం లో చోటుచేసుకున్న పరిణామాలను వివరిస్తూ ఇలా అయితే నేను ఐదేళ్లు చూసి ఎక్కడికైనా వలస పోతా అన్నాడు.

ఎక్కడికీ పరుగు?

ఎందుకు ఉన్న చోట ఇమడ లేక పోతున్నారు?

ఎందుకు ఎక్కడో దూరతీరాల్లో సంతృప్తిని వెతుకొంటున్నారు?

లోపం ఎక్కడుంది ? ఇండియా బాగాలేదు . అమెరికా బాగాలేదు .

సింగపూర్… ఆస్ట్రేలియా… లండన్…. స్విట్జర్లాండ్ ..

ఎక్కడ ఎక్కడ? మనిషికి మనఃశాంతిని ఇచ్చే ప్రాంతం ఎక్కడ?

కొలంబస్ కొలంబస్ .. ఆనందంగా బతకడానికి కావాలో చోటు! .

ఆలోచించండి.

ఈ సమస్య కు పరిష్కారం ఏంటి?

అసలు సమస్య ఏమిటి?

రేపటి పోస్ట్ లో ..

Also Read :

భాషకు లోకం దాసోహం

RELATED ARTICLES

Most Popular

న్యూస్