నాతో పాటు వివేకానందా కాలేజీలో డిగ్రీ (ఎకనామిక్స్) చదివినతనే సుకీ శివం. అనంతరం అతను లా కాలేజీ నుంచి న్యాయశాస్త్రంలోనూ డిగ్రీ పొందారు. కానీ అతని గురించి చెప్పుకోవలసిన అంశమేమిటంటే ఎక్కడా ఎటువంటి ఉద్యోగాలూ చేయకుండా కేవలం ప్రసంగాలతోనే తనకంటూ తమిళనాడులో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్నారు. దేశ విదేశాలలో లెక్కలేనన్ని ప్రసంగాలు చేస్తూ వస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాలపైనే కాకుండా ఏ విషయాన్నయినా తేలిక మాటలతో చక్కగా చెప్పడంలో దిట్ట. అటువంటి సుకీ శివం ప్రసంగం ఏదో ఒకటి వింటే తప్ప నాకు రోజు గడవదు. అలా విన్న ఓ విషయాన్నే ఇక్కడ చెప్పబోతున్నాను…..

1965 ప్రాంతంలో తమిళంలో తిరువిలయాడల్ అనే సినిమా విడుదలైంది. పరమేశ్వరుడి లీలలతో సాగిన చిత్రమింది. ఈ చిత్రంలో శివాజీ గణేశన్ శివుడిగా నటించారు.

హేమనాథ్ భాగవతార్ అని ఒకానొక గాయకుడు ఉండేవారు. ఆయన పాండ్య రాజు ఆస్థానానికి వెళ్ళి మీ రాజ్యంలో ఏ గాయకుడైనా నన్ను గెలవగలడా అని సవాల్ విసురుతారు. అప్పట్లో హేమనాథ్ ని మించిన గాయకులెవరూ లేకపోవడంతో ఏం చేయాలో తెలీక రాజు కలవరపడతాడు. అప్పుడా సమస్య నుంచి తన భక్తుడిని కాపాడటం కోసం శివుడే భూమ్మీదకు మారువేషంలో వచ్చి తన పాటతో హేమనాథ్ ని ఊరువిడిచి పెట్టి వెళ్ళిపోయేలా చేసిన కథను ఆధారంగా చేసుకుని ఈ శివలీలలో ఓ సన్నివేశాన్ని చిత్రించారు. హేమనాథ్ భాగవతార్ గా బాలయ్య నటించారు. ఆయనపై ఓ పాట చిత్రించాలి. ఎవరితో పాడించాలని చిత్రదర్శకుడు, సంగీత దర్శకుడు ఆలోచించి మంగళంపల్లి బాలమురళీకృష్ణగారితో పాడించాలని నిర్ణయించుకుంటారు. కానీ చిత్రంలో ఆయన పాడిన పాట పాత్రధారి ఓడిపోయే సన్నివేశం. మరి అటువంటి పాట పాడేందుకు బాలమురళీకృష్ణ అంగీకరిస్తారా అనేది ఓ ప్రశ్న. ఎందుకంటే అప్పటికే దేశంలో శాస్త్రీయ సంగీతంలో సాటి లేని మేటి గాయకులుగా పేరుప్రఖ్యాతులు గడించారు. మరి తను పాడే పాట ఓడిపోవడానికి బాలమురళీకృష్ణ ఒప్పుకుంటారో లేదో అనే సందేహంతోనే దర్శకుడు, సంగీతదర్శకుడు వెళ్ళి ఆయనను కలిసి కథ చెప్పారు.

కథంతా విన్న బాలమురళీకృష్ణ “పాడు తాను. దానికేం” అన్నారు. పాట పాడటమూ అయిపోయింది. పాటా నేనే, భావమూ నేనే అని సాగే పాటది.

అయితే ఓ పాత్రికేయుడు బాలమురళీ కృష్ణగారిని కలిసి “మీరు శాస్త్రీయసంగీతంలో గానగంధర్వులు. అటువంటి మీరు మీ పాట ఓడిపోవడాన్ని మీరెలా స్వీకరిస్తున్నారు? అసలీ పాట పాడటానికి ఎలా సమ్మతించారు” అని అడిగాడు.

అప్పుడా బాలమురళీకృష్ణగారు
“ఈ పాట పాడటంలో తక్కువేముంది. తప్పేముంది. నన్ను ఓడించాలంటే ఆ దేవుడైనా దిగి రావలసిందేగా దివి నుంచి” అని వినమ్రతతో జవాబివ్వడం గమనార్హం.

ఆ పాట సూపర్ డూపర్ హిట్టయింది.

– యామిజాల జగదీశ్

Also Read :

విఎకె వారి ముచ్చట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *