Tuesday, March 19, 2024
HomeTrending NewsPalamuru-Rangareddy: పాలమూరు వలసలు ఆగలేదు - రేవంత్ రెడ్డి

Palamuru-Rangareddy: పాలమూరు వలసలు ఆగలేదు – రేవంత్ రెడ్డి

“తెలంగాణ వస్తే పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తామని కేసీఆర్ మాట ఇచ్చారు. కానీ తెలంగాణ వచ్చినా ఇంకా పాలమూరులో వలసలు ఆగలేదు, నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆగలేదు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు. కేసీఆర్ పాలమూరు పాలిట శనిలా, శకునిలా తయారయ్యారు” అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా గురువారం జడ్చర్లలో నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రంలో అభివృద్ధి నిధులన్నీ సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు వెళుతున్నాయి ఆయన ఆరోపించారు. 2009లో కరీంనగర్ ప్రజలు బోంద పెడ్తరని భయడి పాలమూరుకు వస్తే ఇక్కడి ప్రజలు గెలిపించి కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టారు. తెలంగాణ పునర్నిర్మాణంలో పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం, మల్లన్నసాగర్, కొండపోచమ్మ పూర్తయ్యాయి కానీ వాటి కంటే ముందు మొదలు పెట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 2010లో అలంపూర్ ప్రాంతంలో వరదలు వస్తే బంజారాహిల్స్ లోని తన ఇళ్లు అమ్మి అయిన వరద బాధితులకు ఇళ్లు కట్టిస్తా అని మాట ఇచ్చిండు. ఒక్క ఇళ్లు కట్టి ఇయ్యలేదు అని రేవంత్ రెడ్డి కేసీఆర్ ను విమర్శించారు.
“పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కట్టడాన్ని ఎవరు అడ్డుకున్నారని కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నా.కేసీఆర్ చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా పాలమూరు ప్రజల రుణం తీర్చుకోలేరు. పాలమూరులో 10లక్షల ఎకరాలను ఎడారి చేసే హక్కు కేసీఆర్ ఎవరు ఇచ్చారు? తులసి వనంలో గంజాయి మొక్కలా… పాలమూరు అభివృద్ధిని కేసీఆర్ అడ్డుకుంటున్నారు” అని రేవంత్ రెడ్డి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు.తెలంగాణలో కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకొని బడుగు బలహీనవర్గాల బిడ్డలు కులవృత్తులు చేసుకోని బతకాలి అని అంటుండు. ఇందుకోసమే తెలంగాణ తెచ్చుకుంది? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
జడ్చర్ల ప్రాతినిధ్యం వహించిన లక్ష్మారెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి కూడా ఈ ప్రాంతానికి 100 పడకల ఆసుపత్రి తేలేకపోయారు. కనీసం ఆస్పత్రిలో కరెంట్ పోతే పెట్టుకునేందుకు జనరేటర్ కూడా లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఎర్రశేఖర్, మల్లు రవి ఉన్నప్పుడే జడ్చర్ల అభివృద్ధి జరిగిందని, సెజ్ కూడా కాంగ్రెస్ హయాంలో వచ్చిందన్నారు. “నేను ఇంతకు ముందే సవాల్ విసిరా…మరోసారి ఇక్కడ లక్ష్మారెడ్డికి సవాల్ విసురుతున్న ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారో అక్కడే ఓట్లు అడగండి.. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లో మేం ఓట్లు అడుగుతాం” దీనికి సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
“నేను మీరు నాటిన మొక్కను. 2006లో మిడ్జిల్ నుంచి జెడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తే నన్ను గెలిపించారు. ఆ రోజు మీరు నాటిన మొక్క ఇవాళ మహా వృక్షమైంది. టీపీసీసీ అధ్యక్షుడుగా మీ ముందు నిలబడ్డా..ఇది మిడ్జిల్ ప్రజల గొప్పదనం..నల్లమల అడవుల్లో పుట్టిన మీ బిడ్డకు టీపీసీసీ అధ్యక్షుడుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నడిపించే బాధ్యతను సోనియా గాంధీ అప్పగించారు.మీ బిడ్డను ఆదరించండి. జిల్లాలో 14కు 14 అసెంబ్లీ స్థానాలను, 2 పార్లమెంటు స్థానాలను గెలిపించండి. అలా చేస్తేనే సోనియమ్మకు కృతజ్ఞత చెల్లించిన వాళ్లం అవుతాం. ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించి అంశం” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఏడాదిలోనే పాలమూరు-రంగారెడ్డి, నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల, తుమ్మిళ్ల ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని రేవంత్ రెడ్డి అన్నారు. బోయలను ఎస్టీల్లో చేరుస్తామన్నారు. “కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇల్లు కట్టుకునే పేదలకు రూ.5లక్షలు అందిస్తాం.రైతులకు 2లక్షల రుణమాఫీ అందిస్తాం. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. ” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్