Monday, January 27, 2025

మన భాష- 6

మన భాష అజంత భాష. అంటే పదాలన్నీ అజంతంగా ఉంటాయని అర్థం. పదం చివర అచ్చు ఉంటుంది, హల్లు ఉండదు. అయితే ఆధునిక భాషలో పూర్ణబిందువుతో అంతమయ్యే మాటలెన్నో వాడుతున్నాం. ముఖ్యంగా ‘ము’తో అంతమయ్యే తత్సమ పదాలన్నింటినీ బిందువుతోనే ఉచ్చరిస్తున్నాం, రాస్తున్నాం. పుస్తకం, అంతం, వనం, బలం మొదలయినవి ఇటువంటివి. తెలుగు మాటల్లో మనం, మేం అనే సర్వనామాలను మాత్రం బిందువుతో రాస్తున్నాం. ఏం అన్న ప్రశ్నార్థక సర్వనామాన్నీ బిందువుతో రాస్తున్నాం. ‘ము’తో అంతమయ్యే సార్వనామిక విశేష్యాలు అందరము, చేసేవాళ్ళము మొదలయినవీ, ‘ము’తో అంతమయ్యే క్రియలనూ బిందువుతో రాస్తున్నాం. ఉదాహరణకు వచ్చాం, తిన్నాం మొదలయినవి. ఈ మాటల్లో ‘ము’ పురుషబోధక ప్రత్యయం. ఈ మాటలన్నింటినీ హలంత పదాలు అనవచ్చు. ఇవికాక ఇంగ్లీషు, ఉర్దూ భాషల నుండి అరువు తెచ్చుకున్న మాటలెన్నింటినో ప్రస్తుతం హలంతాలుగా రాస్తున్నారు. ఈ మాటల్ని విడిచిపెడితే అధికశాతం మాటలు అజంతాలే.

అచ్చుతో అంతమయ్యే మాటలు ఎక్కువగా ఉండడం వల్ల ఒకమాట తర్వాత మరోమాట వచ్చినప్పుడు ఆ మాట అచ్చుతో మొదలయిన మాట అయినప్పుడు రెండు అచ్చులు వరుసగా వస్తాయి. ఇటువంటి సందర్భంలో సంధి జరుగుతుంది. తెలుగులో సంధి జరగడం అంటే మొదటి పదం చివరి అచ్చు లోపించడం అన్నమాట. సంధి జరగకపోతే ఈ రెండు అచ్చుల మధ్యా ఒక హల్లు చేరుతుంది. ఆ హల్లు ‘య’ అని వ్యాకర్తలు చెప్పారు. ప్రాచీన సాహిత్యంలో యడాగమమే కనిపిస్తుంది. అయితే ఉచ్చారణలో ‘వ’ కూడా వినిపిస్తుంది. మా ఊరును కావ్య భాషలో మాయూరు అంటే వాడుకభాషలో మావూరు అంటారు. ‘మా’ ‘ఊరు’ అనే రెండు మాటల మధ్య ‘వ’ ఉచ్చారణలో వినిపిస్తుందన్నమాట. అట్లాగే ‘పెద్ద ఎత్తున’ అన్నప్పుడు ‘పెద్ద’, ‘ఎత్తున’ మధ్య ‘య’ వినిపిస్తుంది. పెద్దయెత్తున అని.

పదాలమధ్య వినిపించే ఈ య, వ ల వల్ల తెలుగులో ఒక ప్రశ్న తలెత్తింది. ఇ, ఈ, ఎ, ఏ లను యి, యీ, యె, యే అనీ, ఉ, ఊ, ఒ, ఓలను వు, వూ, వొ, వో లనీ ఎందుకు రాయకూడదూ అన్నది ఈ ప్రశ్న. కొంత మంది ఇల్లును యిల్లు అనీ, ఈతను యీత అనీ, ఎవరును యెవరు, యవరు అనీ, ఏదిని యేది అనీ రాయడమూ, ఉట్టిని వుట్టి అనీ, ఊరును వూరు అనీ, ఒకటిని వొకటి, వకటి అనీ, ఓటమిని వోటమి అనీ రాయడమూ కనిపిస్తుంది. ఒకప్పుడు ఇట్లా రాయడమే వ్యావహారిక భాషా లక్షణమని కూడా కొందరు భావించారు. అయితే అజాది పదాలను అంటే అచ్చుతో మొదలయ్యే మాటలను హల్లుతో రాయడం వల్ల చేకూరే ప్రయోజన మేమిటి? సృజనాత్మక సాహిత్యంలో పాత్రోచితంగా ఉచ్చారణకు అనుగుణంగా రాయాలనుకున్నప్పుడు రాయవచ్చు. మాండలిక భాషలో రచనలు చేసేటప్పుడు ఆ మాండలికంలో ఆ విధమైన ఉచ్చారణ ఉంటే రాతలో కూడా సూచించవచ్చు. కాని ఆధునిక ప్రమాణ భాషలో ఈ విధంగా రాయడం అవసరమా? అంటే అవసరం లేదనే చెప్పవచ్చు.

యకారం, వువూ వొవోలు తెలుగు మాటలకు ముందు లేవు. అంటే యకారంతో మొదలయ్యే మాటలు తెలుగు మాటలు కావు. అట్లాగే వువూ వొవోలతో మొదలయ్యే మాటలు కూడా తెలుగు మాటలు కావు. యమున, యతి, యజ్ఞం వంటి మాటలు సంస్కృతం. వాక్యాదిలో అచ్చుతో మొదలయ్యే పదాన్ని హల్లుతో రాయడం వల్ల కలిగే ప్రయోజనమేమీ లేదు కాబట్టి దాన్ని అచ్చుతో రాయడమే మంచిది. వాక్యం మధ్యలో సంగతేమిటి? సమాసంలో రూఢమయిన రూపాలను యథాతథంగా వాడక తప్పదు. పేదరాలు పేదరాలే. వేపాకు వేపాకే. మేనత్తకు కావ్య భాషలో మేనయత్త అనికూడా రూపం. ఆధునిక భాషలో మేనయత్త అని రాయవలసిన అవసరం లేదు. వెలయాలు మొదలయినవి అట్లాగే వాడాలి. సమాసంలో కాకుండా విడిగా ఉన్నప్పుడు సంధి చేయవలసిన చోట సంధి చేయాలి. సంధి చేయడానికి వీలు లేనప్పుడు అజాదిగానే రాయవచ్చు. యడాగమం చేయవలసిన పనిలేదు. ఉదాహరణకు మనిషి ఉన్నాడు అనే రాయ వచ్చు, మనిషి యున్నాడు అని రాయవలసిన అవసరంలేదు. మనిషి వున్నాడు అనీ రాయవచ్చు.

సంప్రదాయ పద్ధతిలో చేసే పద్య రచనలో యడాగమం అవసరం కావచ్చు. ఆధునిక ప్రమాణ భాషలో, వచనంలో దాని అవసరంలేదు. అట్లాగే వడాగమం కూడా, అందువల్ల అజాది పదాలను హలాదులుగా రాయకపోవడం మంచిది. హలాదులుగా రాసినట్లయితే పదం సహజ స్వరూపం తెలియకుండా పోతుంది. అనుద్దిష్టమయిన రూపాలు ఏర్పడతాయి. ఒక క్రమబద్ధత లేకపోవడం వల్ల హల్లు రాయవలసిన చోట అచ్చూ, అచ్చు రాయవలసిన చోట హల్లూ రాయడం జరుగుతుంది. వడ్డీ అనడానికి ఒడ్డీ, వంతెన అనడానికి ఒంతెన, వద్దు అనడానికి ఒద్దు, వగరు అనడానికి ఒగరు అని రాయడం ప్రామాణికం కాదు. అట్లాగే ‘ఒడలు’కు ‘వడలు’, ‘ఒడి’కి ‘వడి’, ‘ఒంటరి’కి ‘వంటరి’, ‘ఒకకు ‘వక’, ‘ఒప్పుకొను’కు ‘వప్పుకొను’, ‘ఒప్పగించు’కు ‘వప్పగించు’, ‘ఒత్తిడి’కి ‘వత్తిడి’, ‘ఒడ్డు’కు ‘వద్దు’, ‘ఒడ్డాణం’కు ‘వడ్డాణం’, ‘ఒడిసెల’కు ‘వడిసెల’ రాయడం సరికాదు. ఒగరు – వగరు, ఒడి – వడి, ఒక్క వక్క ఒండు – వండు, ఒత్తి – వత్తి, ఒదలు – వదలు, ఒనరు – వనరు, ఒమ్ము – వమ్ము మొదలయిన మాటలకు అర్థభేదం ఉంది. అందువల్ల వీటిని ఒకదానికి బదులు ఒకటి వాడకూడదు. అజాది శబ్దాన్ని అజాదిగా, హలాది శబ్దాన్ని హలాదిగా రాయడం వల్ల పదాల లేఖనంలో ద్వైరూపకతను కూడా తొలగించవచ్చు.

-డి. చంద్రశేఖర రెడ్డి
98661 95673

రేపు:-
మన భాష- 7
“ఏది తెలుగు- ఏది సంస్కృతం”

RELATED ARTICLES

Most Popular

న్యూస్