Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఒక రద్దు - ఎన్నో వాదాలు

ఒక రద్దు – ఎన్నో వాదాలు

Farm Laws Repeal: Who will gain?
ఒకే అంశం.. కానీ, ఎవరి కోణం వారిదే… సాగుచట్టాలను రద్దు చేస్తామన్న ప్రధాని ప్రకటన అలా వెలువడిందో, లేదో.. మీడియాతో పాటు… సోషల్ మీడియాలోనూ ఈ అంశం విపరీతమైన చర్చకు దారితీసింది. కొన్ని పత్రికలు సాగుచట్టాల రద్దు అన్నట్టుగా ప్లెయిన్ హెడ్డింగ్స్ తో వారికి ఆయా ప్రభుత్వాలు, పార్టీలతో ఉన్న సహజసిద్ధమైన సంబంధాలను బ్యాలెన్స్ చేసేలా ప్రచురిస్తే… కేంద్ర విధానాలపై గుర్రుగా ఉన్న పార్టీలతో అనుసంధానమైన పత్రికలు, కొంత కమ్యూనిజపు భావజాలం కల్గిన ఎడిటర్లున్న మరికొన్ని పత్రికలు మాత్రం ‘దిగొచ్చిన మోడీ’.. ‘తలొగ్గిన ఢిల్లీ’ అంటూ బ్యానర్ ఐటమ్స్ గుప్పించాయి.

అయితే సాగుచట్టాలపై ఎంత చర్చ జరిగిందో… అదే స్థాయిలో మోడీ యూటర్న్ పై జరుగుతుందా, లేదా… దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి… ప్రతిపక్ష పార్టీలు, వాటి అనుబంధ మీడియా సంస్థలు భవిష్యత్తులో ఈ నిర్ణయాన్ని తమకు అనుకూలంగా ఎలా మల్చుకోబోతున్నాయనేది కాలమే సమాధానం చెబుతుంది… విపక్షాల  సమర్ధత, వారిపై జనానికున్న విశ్వాసాన్నిబట్టి రాజకీయంగా ఈ అంశం వారికి ఉపయోగపడొచ్చు, లేకపోవచ్చు. కానీ సందర్భం వచ్చినప్పుడు  ఒక మెట్టు దిగడమే రాజకీయ పరిణతి అని మోడీ మాత్రం నిరూపించాడు. పంజాబ్, హర్యానా రైతాంగమంతా ఢిల్లీ వీధుల్లో ఆహోరాత్రులూ రోడ్లపై నిరీక్షిస్తూ... తిండీ, తిప్పలు కూడా మాని నిరసనలకు దిగినప్పుడు కూడా కఠినాతికఠినంగా ఉన్న మోడీ… ఇప్పుడు మాత్రం సాగుచట్టాలపై ఎందుకు యూటర్న్ తీసుకున్నాడన్నది మరో ప్రశ్న!

ఈమధ్య వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలే ఇందుకు ప్రధాన కారణమనే చర్చ కూడా జరుగుతోంది సరే! కానీ.. ఇప్పటికీ ఈ సాగు చట్టాలను రద్దు చేయకపోతే… వచ్చే  ఎన్నికల్లో ఈ సాగుచట్టాలే బీజేపి పుట్టిముంచనున్నాయని జాతకరూపంలో కాకుండా.. ఎవ్వరైనా కచ్చితంగా చెప్పగలరా…?  అంటే అబ్సర్డ్!  ఎందుకంటే ఇప్పటికీ సరైన ప్రతిపక్షం లేని పరిస్థితుల్లో ఇవాళ దేశం కొట్టుమిట్టాడుతోంది.  125 ఏళ్లకు పైబడ్డ కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కెవ్వరంటే… ఔను ఎవ్వరనే కొశ్చన్ కాంగ్రెస్ పెద్దల్లోనే తీరని అనుమానంగా తయారైన పరిస్థితుల్లో… మళ్లీ మోడీని ఢీకొనగల్గిన శక్తి కాంగ్రెస్ కు ఉందని అనుకోలేం. అయితే ప్రజావ్యతిరేకత సుడిగాలిలా వస్తే మాత్రం.. మోడీయే కాదు… ఢిల్లీపీఠంపై ఎవ్వరున్నా దిగిపోవాల్సిందే. అంత వ్యతిరేకత ఈ సాగుచట్టాల ద్వారా మోడీ మూటగట్టుకోగల్గుతుండేనా అనేదే ఇప్పుడు చర్చ..?

రైతులకు ప్రోత్సాహకంగా, సులభతరంగా దేశంలో తమ పంట ఉత్పత్తులను అన్నదాతలు ఎక్కడైనా అమ్ముకోవచ్చన్న ఏ ఉద్దేశంతో.. రైతు ఉత్పత్తుల వ్యాపార, వాణిజ్య చట్టం-2020ని ప్రవేశపెట్టారో… అక్కడే కనీస మద్దతుధర అనే చట్టానికి ముగింపు పలుకుతున్నారన్న రైతులు, వారి సానుభూతిపరుల ఆందోళనకు కేంద్రం నుంచి సరైన, స్పష్టమైన సమాధానం లేకపోవడమే సాగుచట్టాల మొదటి బిల్లులోని ప్రధానమైన లోపం.

ఇక పండించబోయే పంటలకు సంబంధించి రైతులు ముందస్తుగానే వ్యాపారసంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని… మార్కెట్ లో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకునేందుకు, ఏ ఉద్దేశంతోనైతే రైతుల రక్షణ కోసమంటూ చట్టంలోని రెండో అంశాన్ని పొందుపర్చారో…  ధరలను బేరమాడేలా అవకాశం, అధికారం కార్పోరేట్ సంస్థలకిచ్చి.. తమ శక్తిని ప్రభుత్వమే బలహీనపరుస్తోందన్న రైతుల ప్రశ్నలకూ మోడీ ప్రభుత్వ పెద్దలుగానీ, వారి అనుకూలురుగానీ సరైన జవాబు చెప్పలేకపోయారు.

తృణధాన్యాలు, పప్పులు, నూనెగింజలు, ఉల్లి, ఆలుగడ్డలు వంటి ఉత్పత్తులను నిత్యావసర వస్తువుల జాబితా నుంచి తొలగించి… ఎగుమతులపై, నిల్వ పరిమితికి సంబంధించిన ఆంక్షలు విధించకూడదని.. కొన్ని ప్రత్యేక విపత్కర పరిస్థితుల్లో మాత్రమే ఆ ఆంక్షలు పనిచేయాలని ప్రభుత్వం భావించిందో.. అక్కడే లొసుగుందన్న అన్నదాతల ఆందోళనకు సరైన సమాధానం లేదు. ఎప్పుడో వచ్చే ప్రత్యేక విపత్కర పరిస్థితులను మినహాయిస్తే… మిగిలిన కాలమంతా నిత్యావసరాల జాబితా నుంచి మినహాయించిన ఉత్పత్తులను నిల్వ చేసుకుని... బడా కంపెనీలు ఈ చట్టం స్ఫూర్తిని తమకనుకూలంగా మల్చుకుని.. తమను శాసించే స్థాయికి వస్తాయన్న రైతుల ప్రశ్నలకు స్పష్టమైన జవాబులు ఎక్కడా కనిపించలేదు.

ఈ క్రమంలో ఏర్పడ్డ ఆందోళనల నేపథ్యంలో.. దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ తో పాటు.. పలు పార్టీలు రైతుల ఆందోళనకు మద్దతు తెలిపితే… మరికొన్ని పార్టీలు కేంద్రానికి భేషరుతుగా మద్దతు ప్రకటించాయి. మరికొన్నింటిలో ఓవైపు లోపల ఆందోళన పెట్టుకుని… ఇంకోవైపు ఈ చట్టానికి మద్దతు ప్రకటించి ఆత్మవంచనకు గురైనాయి. అదిగో అలాంటి సందర్భాలు ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో కనిపించాయి. అసలు బియ్యమే కొనబోమని కేంద్రం చెప్పిందో.. కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే కొనలేమని చెప్పిందా అనే అంశంపైన సమాజానికి స్పష్టతనివ్వకుండా… అధికార పార్టీనే ధర్నాలకు దిగడంతో పాటు.. తాను మద్దతిచ్చిన రైతు సాగుచట్టాలపై కూడా ఇంతకాలం మౌనం వహించి.. ఇప్పుడు మాత్రం ఇదే అదనుగా, అవకాశంగా చేసుకుని  కినుక ప్రదర్శించడం మారిన రాజకీయ పరిణామాలకు ప్రతిరూపం.

తమ వల్లే మోడీ దిగివచ్చాడని  అధికార టీఆర్ఎస్… నిన్నగాక మొన్న పుట్టుకొచ్చిన షర్మిల పార్టీ..  నిజంగానే రైతుల పక్షాన పోరాటం చేసిన కాంగ్రెస్… ఇలా ఎవరికివారు ప్రకటనలిచ్చుకుంటూ ప్రజల్లో ఒకరకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంటే… మరికొందరికి మాత్రం ఈ ప్రకటనలన్నీ మంచి హాస్యాన్ని పంచుతున్నాయి. మోడీ ప్రభుత్వం ఎన్ఆర్సీ, ఆర్టికల్ 370 రద్దు, నోట్ల రద్దు,  సీఏఏ వంటి ఎన్నో చట్టాల్ని తీసుకొచ్చే విషయంలో ఎలాంటి వివాదాలను ఎదుర్కొందో.. వాటితో పోలిస్తే కొంత ఎక్కువగానో, తక్కువగానో, లేక అదే మోతాదులోనో రైతు సాగుచట్టాల విషయంలోనూ ఎదుర్కొన్న మాట వాస్తవం.

ఈ క్రమంలో ఇదే మోడీ ప్రభుత్వ అనుకూలురు పలువురు….నిరసనల్లో పాల్గొన్నవారెవ్వరూ అసలు రైతులే కాదని.. పక్కదేశాల నుంచి దిగమతై వచ్చారనీ… మళ్లీ ఖలిస్తాన్ ఉద్యమాన్ని రగిల్చి చిచ్చుపెట్టే యత్నమని.. ఇది సిక్కులకు, హిందువులకూ మధ్య కొందరు పన్నిన కుట్ర అనే ప్రచారాన్నీ ముమ్మురంగా చేశారు. ఇన్ని కోణాల మధ్యలో మళ్లీ అదే మోడీ ఇప్పుడు రైతులకు క్షమాపణ చెబుతున్నానని..  ఎవరికి వారు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లిపోవాలని పిలుపునిస్తూ.. తన సాగుచట్టాలను రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించడంతో…

ఇది మోడీ వ్యూహాత్మక విజయం కాబోతుందా?

యూటర్న్ గా ప్రజలు భావించి ప్రతిపక్షాలు బలపడేందుకు ఊతమిస్తుందా?
నిజంగా రైతులకు మేలా?

చట్టాలను ఎంతో చిత్తశుద్ధితో చేయాల్సిన లామేకర్స్ విధాన పరమైన బిల్లుల రూపకల్పనలో చూపిస్తున్న నిర్లక్ష్యమా?

అసలీ విజయం రైతులదా?
రైతుల పక్షాన పోరాటం చేసిన ప్రతిపక్షాలు, మీడియాదా?

పంథా మార్చుకుని మోడీకన్నా ముందే యూటర్న్ తీసుకుని రైతులకు మద్దతు ప్రకటించిన పార్టీలదా?

ఒకటీ రెండూ రాష్ట్రాలు ఆందోళన చేసినంత మాత్రాన దేశం మొత్తం వర్తించే అంశాల విషయంలో ఒత్తిళ్లకు తలొగ్గి.. విధానపరమైన నిర్ణయాలను ఉపసంసరించుకోవడం ప్రభుత్వాలకు సమంజసమా..?

ఇలా ఒకే అంశం.. వివిధ కోణాలన్నట్టుగా ఇప్పట్లో తెగని ఓ భారీ చర్చకైతే తెరలేసింది సాగు చట్టాలపై మోడీ ఉపసంహరణ ప్రకటన.

-రమణ కొంటికర్ల

Also Read  : అగ్గికి ఆజ్యం

RELATED ARTICLES

Most Popular

న్యూస్