Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఇరవైల్లో అరవైల ఆలోచనలు

ఇరవైల్లో అరవైల ఆలోచనలు

Corona makes even young draw up their wills – Will Deeds At Young Age

ఇదివరకు ఎనభయ్యో పడిలో వీలు చూసుకుని వీలునామా రాద్దామనుకునేవారు. వీలునామా రాయగానే ఆ పెట్టే నాలుగు మెతుకులు కూడా పెట్టరు అన్న భయంతో చాలామంది తెలివయిన ముసలి వారు అసలు వీలునామా రాయకుండానే పోతారు. వారి వారసత్వంగా మిగిలిన గోచీ గుడ్డ సంపద కోసం సంతానం జుట్లు పట్టుకుని రోడ్డున పడుతూ ఉంటారు. ముసలివారు బతికి ఉండగానే నువ్ పొతే నీ చేతి గడియారం నాకు, వేలి ఉంగరం చెల్లికి, అమ్మ మెడలో గొలుసు అక్కకు అని బాధ్యతగా, పద్ధతిగా, భద్రంగా, మర్యాదగా ఒక మాట అనుకునే సంతానానికి కొదువ లేదు.

ఆస్తి పంపకాలు యుగయుగాలుగా తెగని సమస్య. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు అమెజాన్ అధిపతి పదహారు లక్షల కోట్ల ఆస్తి పంపకం నుండి అలంపురం వలస కార్మికుడి పూరి గుడిసె పంపకం దాకా పంపకం పంపకమే. మనస్పర్ధలు, గట్ల పంచాయతీలు, కేసులు, గెలుపోటములు, రాజీలు, మనసు ముక్కలు కావడాలు షరా మామూలే.

ఏడు దశాబ్దాలుగా ఎల్ ఐ సి వారు మీరు పొతే మీ వారికి ఈ డబ్బు ఇస్తాం అన్న మాట చెప్పలేక చెప్పలేక నీళ్లు నమిలేవారు. ఇప్పుడు ప్రయివేటు ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చాక…ఎలాంటి మొహమాటం లేకుండా ముందు మీరు పొతే మేము నష్టపోకుండా ఈ ప్రీమియం, ఆపై మీ కుటుంబీకులకు ఇవ్వడానికి ఈ ప్రీమియం అని చావు మీద ఒట్టేసి చెబుతున్నారు.మానవ నాగరికతా ప్రయాణంలో అత్యంత గొప్ప నిర్మాణం కుటుంబ వ్యవస్థ. ఎంత గొప్ప కుటుంబమయినా కుటుంబ పెద్ద బతికి ఉన్నంతవరకు అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ పెద్ద దీపం ఆరిపోగానే అప్పుడు మొదలవుతాయి ఆస్తి గొడవలు. వేల కోట్ల ఆస్తికి గొడవలున్నట్లే…ఒక చీపురు, ఒక చేట, రెండు లోటాలు, మూడు గిన్నెలు, నాలుగు దుప్పట్లు, అయిదు గరిటెలు పంచుకోవడంలో కూడా అనేక చిక్కు ముళ్లు, ఎక్కువ తక్కువలు ఉంటాయి.

కోర్టు గొడవలు ఏళ్లకు ఏళ్లు సాగి…ఓడినవాడు కోర్టులో ఏడుస్తాడు…గెలిచినవాడు ఇంటికొచ్చి ఏడ్చి మొహం కడుక్కుంటాడు- అని లోకంలో అపవాదం ఉంది. దేవుడికన్నా దెబ్బే గురువు. కరోనా వేళ ఆస్తి పంపకాల వీలునామాలు పెరిగాయట. ఎవరు ఎప్పుడు మంచాన పడతారో, ఎవరు ఎప్పుడు పాజిటివ్ లోకి వెళ్లి ఇక నెగటివ్ లోకి రాకుండా అలాగే పైకి పోతారో తెలియని అనిశ్చితి, భయం వల్ల చాలా మంది ముందే వీలునామాలు రాసి పెట్టుకుంటున్నారు.

కనీసం అరవై ఏళ్లు దాటనిదే ఇదివరకు వీలునామాలు రాసేవారు కాదు. కరోనా దెబ్బకు నలభై ఏళ్లకే వీలునామాలు రాసుకుంటున్నారట. ఇకపోతే…అన్న మాట అక్షరాలా కొందరికి పోతే…చేయాల్సిన పనులు ముందే చేసి పొతే పోండి…అన్నట్లు ధ్వనిస్తోంది.

దేశవ్యాప్తంగా ఆరోగ్య బీమా, జీవిత బీమా పాలసీలు పెరిగాయి. కష్టమో నష్టమో వస్తే తట్టుకోవడం ఎలా అన్న ఆలోచనలు పెరిగాయి.

ఎప్పుడయినా పోయే వాళ్లమే. కాకపోతే కరోనా ఆ పోయే జ్ఞానాన్ని మనలో బలంగా నాటింది. వినడానికి ఇబ్బందిగా ఉన్నా వాస్తవం ఇంతే.

దేశంలో వీలునామాలు రాసే రాతగాళ్లకు ఒక్కసారిగా డిమాండు పెరిగిందట. అసలే కరోనా కాలం. వీలునామా సేవలు ఆన్ లైన్లో కూడా అందుబాటులోకి వచ్చాయట.

“Where there is a will there’s a way”

“Where there is no will there’s no way”

-పమిడికాల్వ మధుసూదన్

Also Read: సామాన్యులకు భారం – ఎగ్గొట్టే వారికి అభయం!

Also Read: తాగుబోతుల మద్యవ్యాకరణ సూత్రాలు!

RELATED ARTICLES

Most Popular

న్యూస్