Tyaga’rama’: త్యాగయ్య (1767-1847) రెండు వందల ఏళ్ల కింద మనమధ్య నడిచినవాడు. కర్ణాటక సంగీత త్రిమూర్తుల్లో ఒకడు. తెలుగు వాగ్గేయకారుల పరంపరలో హిమాలయమంతవాడు. తమిళగడ్డపై పుట్టిన తెలుగువాడు. కర్ణాటక సంగీత, తెలుగు భాషా జయకేతనాలను వినువీధిన రెపరెపలాడించినవాడు. నిగర్వి. నిరాడంబరుడు. 96కోట్ల రామనామ జపం చేసి…రాముడి సాక్షాత్కారం పొందిన ధన్యుడు. సంగీతాన్ని నాదోపాసనగా, ఒక యజ్ఞంగా, ఒక తపస్సుగా మలచుకుని బతుకును పండించుకున్నవాడు. వాల్మీకిని ఆవాహన చేసుకున్నవాడు. పోతన భాగవతాన్ని నిత్యం పారాయణ చేసినవాడు. అయోధ్య రాముడిని తెలుగు రాముడిగా చేసినవాడు.
మిగతా వాగ్గేయకారులవి కృతులు- త్యాగయ్యవి ఉపనిషత్తులు కావడంతో వాటిని త్యాగోపనిషత్తులు అని లోకం ఆరాధిస్తోంది. భాష తెలియనివారికి కూడా త్యాగయ్య కీర్తనల్లో మాధుర్యం ఏదో దొరుకుతూ ఉంటుంది. సామవేద సారమైన సంగీతాన్ని త్యాగయ్య ఎలా తన భక్తి సంగీతంలో ప్రతిఫలింపచేశాడు? అన్నది చాలా లోతైన విషయం. ఆయనవల్ల అయోధ్య సరయూ తీరం వదిలి రాముడు కావేరీ తీరంలో తిరిగాడు. తెలుగువారు రాముడితో మాట్లాడుకోవడానికి ఒక సంగీత భాషను, సాహిత్య సందర్భాలను సృష్టించి ఇచ్చిన త్యాగయ్యకు ఏమిచ్చినా మన రుణం తీరదు. కచేరీల్లో పాడేవారికి, వాద్యాల మీద వాయించేవారికి త్యాగయ్య కృతులు ఎంత అనుకూలమైనవో వినేవారికి అంతే రసమయమైనవి. ఆ శాస్త్రీయ సంగీత, పోతనతో సమానమైన సాహిత్య చర్చలు ఇక్కడ అప్రస్తుతం. ఆయన రాముడితో ఎలా మాట్లాడాడు? ఆ రాముడిని మనకు ఎలా పట్టి ఇచ్చాడు అన్న విషయాలకే పరిమితమవుదాం.
ఈ రోజుల్లో రెండు ప్రాస పదాలు రాయగలిగిన ప్రతివాడూ దేవులపల్లులకు పాఠాలు చెప్పగలిగినవాళ్లే. రెండు స్వరాల పేర్లు చెప్పగలిగిన ప్రతివాడూ ఎం ఎస్ సుబ్బులక్ష్ములకు సంగీతం నేర్పగలిగినవాళ్లే. ఒక పల్లవి, ఒక అనుపల్లవి, ఒకే ఒక చరణంలో రాముడి పరబ్రహ్మ తత్వాన్ని విశ్వరూప దర్శనం చేయించిన త్యాగయ్యకు త్యాగయ్యే పోటీ. అందునా పల్లవి ఎత్తుగడ మొదటి మాటను వార్తకు శీర్షికలా మహోన్నతంగా వెలిగించడంలో త్యాగయ్యది అనన్యసామాన్యమైన ప్రతిభ. అత్యంత సరళంగా…మామూలు తెలుగు మాటల్లా అవి అనిపిస్తాయి. కానీ వాటి లోతు, అర్థ గాంభీర్యం, భక్తి రసావిష్కరణ, సంగీత మాధుర్యాలు తవ్వుకున్నవారికి తవ్వుకున్నంత.
పంచరత్న కీర్తనలు:-
“జగదానందకారకా!”. ఈ ఒక్క ఎత్తుగడ పదబంధంతో కీర్తన మొత్తం అయిపోయినట్లే ఒకరకంగా. “జగత్తుకు ఆనందం కలిగించేవాడా!” అని అర్థం. అది ఎలాంటి ఆనందమో తెలిపే మిగతాది పాడుకోవడానికి కొనసాగింపు. అంతే. ఒక్కొక్క మాటలో ఒక్కో కావ్యమంత సారాన్ని దట్టించగల అరుదైన విద్య ఉన్నవాడు కాబట్టే త్యాగయ్యకు చాలా సందర్భాల్లో చెప్పడానికి రెండో చరణం అవసరమే ఉండదు.
“దుడుకుగల నన్ను ఏ దొర కొడుకు బ్రోచురా?” అయిపోయింది కీర్తన. మిగతాదంతా ఎలాంటి దుడుకు అన్న కొనసాగింపు-అంతే.
“సాధించెనే ఓ మనసా!”. అయిపొయింది కీర్తన. ఏమి సాధించిందో? ఎందుకు ఎలా సాధించిందో చెప్పడమే మిగతా కీర్తన-అంతే.
“కనకన రుచిరా కనకవసన! నిన్ను…”
కలకలమను ముఖకళగలిగిన సీత
కులుకుచు నోరకన్నులను జూచె నిన్ను…”
అయిపోయింది కీర్తన. మిగతాదంతా ఆ కనకన రుచి కళకళలు, తళతళలు-అంతే.
“ఎందరో మహానుభావులు”. ఈ కీర్తన ఎత్తుగడ మాట తెలుగుభాషకు ఒక వాడుక మాట అయిపోయింది. త్యాగయ్య తెలుగు భాషకు ఇచ్చిన పలుకుబళ్లు ఎన్నెన్నో! సాధారణంగా త్యాగయ్య కీర్తన నిడివి చాలా తక్కువ ఉంటుంది. దానికి భిన్నంగా “ఎందరో మహానుభావులు” ఎక్కువ చరణలతో చాలా పెద్ద కీర్తన. త్యాగయ్య మనసులో ఎప్పటినుండో గూడుకట్టుకుని కొలువై ఉన్న మహానుభావులు వీళ్ళందరూ. ఒకరా! ఇద్దరా? వాళ్లందరికీ చేతులు జోడించి సవినయంగా చేసిన వందనమిది. అలాంటి ఎందరో మహానుభావులకు మనచేత నమస్కారం చేయించడానికి త్యాగయ్య ఇచ్చిన అపురూపమైన కీర్తన ఇది. ఎలాంటివారికి నమస్కారం చేయాలో చెప్పిన ప్రమాణం ఇది.
“ప్రేమ ముప్పిరి గొను వేళ
నామము దలచు వారిని” మహానుభావులు అంటూ సాష్టాంగ నమస్కారం చేసిన త్యాగయ్య వినయం ముందు సప్తసముద్రాలు కూడా చిన్నబోవాల్సిందే.
నగుమోముతో కనిపించకపోతే నా ముందుకే రావద్దని రాముడికి ఈ భూ ప్రపంచంలో ఇంకెవరైనా షరతు పెట్టగలరా? త్యాగయ్య తప్ప.
“రా రా! మా ఇంటిదాకా!” అని కావేరీ తీరంలో స్నానం చేస్తూ త్యాగయ్య గొంతెత్తి పిలిస్తే…త్యాగయ్య కంటే ముందే ఇంటికెళ్లి…ఏమమ్మా! ఏడీ మీ ఆయన? నన్ను రమ్మని ఇంట్లో లేడే? అని త్యాగయ్య భార్యను రాముడు నిలదీస్తుంటే…ఆమె ఉండండి స్వామీ! వస్తున్నాడు! ఈలోపు ఒక అరటిపండు తింటారేమిటి? అని అడుగుతున్నట్లు, ఆపై త్యాగయ్య వచ్చాక ఒక కీర్తన పాడించుకుని…విని పరవశిస్తున్నట్లు…ఒక అద్భుతమైన చిత్రం ఎవరు గీచారో కానీ…అది నిజంగా జరిగిన సందర్భం.
“రా రా! మా తెలుగువాళ్ల ఇళ్లకు”
అని త్యాగయ్య పిలిచి అయోధ్య రాముడిని మన నట్టింట కూర్చోబెట్టి వెళ్లిన త్యాగయ్య తారాడు నాదాలు మన చెవుల మారుమోగుతూనే ఉంటాయి. ఉండాలి. అలాగే ఉండిపోవాలి.
రేపు- రామాయణం-12
“నను బ్రోవమని చెప్పవే! సీతమ్మ తల్లీ!”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018