Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకార్పొరేట్ కంపెనీల్లో పెరుగుతున్న మహిళల ప్రాముఖ్యత!

కార్పొరేట్ కంపెనీల్లో పెరుగుతున్న మహిళల ప్రాముఖ్యత!

కాలం మారుతోంది. శతాబ్దాల అసమానత్వం దశాబ్దాల్లో పోవడం కష్టమే కానీ అసంభవం కాదు. ఆడపిల్లవి…పెద్ద చదువులు, ఉద్యోగాలు నీకెందుకు? అంటే వినే తరం కాదు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు అమ్మాయిలైనా అబ్బాయిలైనా బాగా స్థిరపడాలనే కోరుకుంటున్నారు.

చాలాకాలంగా మహిళలకు అందని ద్రాక్ష కార్పొరేట్ సంస్థల్లో ఉన్నతస్థాయి పదవులు. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి మారుతోంది. పలు కంపెనీలు తమ కార్పొరేట్ పదవుల్లో ఉన్నత స్థానాల్లో మహిళలను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. వ్యవస్థలో ఇంత మార్పా ? అని అవాక్కయ్యారా? ఇది ఒక అడుగు మాత్రమే. ఇంకా వేయాల్సిన అడుగులు చాలా ఉన్నాయి.

లేచింది మహిళా లోకం
# ఆక్సన్చర్, ఇండియా బృందంలో 29 శాతం నాయకత్వ పదవుల్లో ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఇది 45 శాతం.
# దియా జియో ఇండియాలో ఉన్నత పదవుల్లో ఉన్న మహిళలు 30 శాతం.
# మారికో కంపెనీలో కొన్నేళ్ల కృషి ఫలితంగా 30 శాతం నాయకత్వ పదవుల్లో మహిళలు ఉన్నారు.
# వచ్చే ఏడాదికల్లా 40 శాతం నాయకత్వ పదవుల్లో మహిళలుండేలా పెప్సికో ప్రణాళికలు వేస్తోంది.
# లార్సెన్ అండ్ టుబ్రో తమ మహిళా ఉద్యోగుల్లోనే 495 మందిని ఎంపిక చేసి లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద శిక్షణ ఇస్తోంది.

ఎన్ని అర్హతలు ఉన్నా పురుషాధిక్యత, కుటుంబ బాధ్యతల కారణంగా ఎదగడానికి ఇబ్బంది అని అందరూ అనుకుంటారు. అంతకు మించి అనేక కారణాలున్నాయి. అవీ చూద్దాం.

సుమారు 56 శాతం కంపెనీల్లో నిర్వహించిన సర్వే లో 10-30 శాతం మహిళలే కార్పొరేట్ నిచ్చెన ఎక్కగలుగుతున్నారని తేలింది. కొన్నిచోట్ల కీలక పదవుల్లో మహిళలే లేరు. ఇందుకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఏం వెల్లడైందో చూద్దాం.

పక్షపాత ధోరణి
చాలా చోట్ల పక్షపాత ధోరణి కారణంగా మహిళలు ఎదగలేకపోతున్నారు. యాజమాన్యం కొందరిపైనే అధికాసక్తి చూపుతూ మిగిలిన వారిని పక్కన పెట్టడం, వారి నిర్ణయాలను, పనితీరును తక్కువ చేయడం వల్ల మహిళలు నిరాశకు గురవుతున్నారు.

పని చేయలేని వాతావరణం
31 శాతం మహిళలు పనిచేసే చోట అభద్రత, అవమానం ఎదుర్కొంటున్నారు. కుటుంబం,ఉద్యోగం బాలన్స్ చేసుకోవడం భారమవుతోంది. వారిపట్ల సానుభూతి లేకపోగా పై స్థాయినుంచి హేళన ఎదురవుతోంది. కింది స్థాయినుంచి సహకారం ఉండటం లేదు.

లైంగిక వేధింపులు
ప్రమోషన్లు, ఇతర ఉన్నత పదవుల్లో లైంగిక వేధింపులు మహిళలను కుంగదీస్తున్నాయని 30 శాతం అభిప్రాయం. అసభ్యకరమైన మాటలు, కించపరిచేలా ప్రవర్తన ఉద్యోగంలో ఎదగడానికి అడ్డంగా ఉందని వాపోతున్నారు.

వేతనంలో తేడాలు
ప్రపంచ వ్యాప్తంగా పురుషులకు దక్కే ఒక రూపాయికి అదే పని చేసే మహిళలకు ఎనభై పైసలు మాత్రమే దక్కుతోంది. వర్ణ వివక్ష కూడా వేతనాలపై ప్రభావం చూపుతోంది. ఇది మహిళలు ఉన్నత స్థాయికి ఎదగడంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

మూస ధోరణి- వివక్ష
తరాలుగా మగవాళ్ల బుర్రల్లో పేరుకుపోయిన బూజు మహిళల పట్ల తేలిక భావమే పలికిస్తుంది. మహిళలు ఎంత కష్ట పడినా, పనిలో ఎంత ప్రతిభ చూపినా గుర్తించరు. పైగా మరీ మెత్తన అనికానీ మరీ కఠినం వంటి వ్యాఖ్యలతో నొప్పిస్తారు. ఇవన్నీ ఉన్నత స్థానాల్లో ఎదుర్కొనే సమస్యలని 35 శాతం మహిళలు అభిప్రాయపడుతున్నారు.

చూశారా! మహిళలు కంపెనీల సారధ్యం వహించడానికి ఎన్ని అడ్డంకులో ! అయినా ఒక ఇంద్రా నూయి, కిరణ్ మజుందార్ వీటిని దాటి నిచ్చెన పైకి ఎక్కారు. వారి స్ఫూర్తి ఈనాడు మరెందరో మహిళలకు మార్గం చూపుతోంది. ఫలితంగా ఒకటి నుంచి 30 శాతం మహిళలు కార్పొరేట్ స్థాయిలో ఉన్నతపదవుల్లో ఎదిగేందుకు దోహదపడింది. ఈ నడక ఆగకుండా పరుగులా మారాలని కార్పొరేట్ సంస్థల్లో సమానత్వం దిశగా పయనించాలని కోరుకుందాం.

-కె. శోభ

RELATED ARTICLES

Most Popular

న్యూస్