విమెన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై రెండో ఓటమి చవి చూసింది. మొదట్లో వరుసగా ఐదు విజయాలతో అందరికంటే ముందే ప్లే ఆఫ్స్ కు అర్హత పొందిన ముంబై గత మ్యాచ్ లో యూపీ చేతిలో ఓడిపోగా, నేడు ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఈ విజయంతో ముంబైని దాటి మెరుగైన రన్ రేట్ తో… ఢిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
డా. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబై 21 పరుగులకే నాలుగు వికెట్లు…యస్తికా భాటియా(1), నటాలి స్కివర్ బ్రంట్ (డకౌట్), హేలీ మాథ్యూస్(5); అమేలియా కేర్ర్ (8) కోల్పోయింది. జట్టులో పూజా వస్త్రాకర్-26; హర్మన్ ప్రీత్ కౌర్-23; ఇస్సి వాంగ్-23; అమన్ జొత్ కౌర్ 19 లు మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. దీనితో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 109 పరుగులు చేయగలిగింది.
ఢిల్లీ బౌలర్లలో కాప్, శిఖా పాండే, జెస్ జోనాస్సేన్ తలా రెండు; అరుంధతిరెడ్డి ఒక వికెట్ పడగొట్టారు.
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ తొలి ఓవర్ నుంచే ఉతుకుడు మొదలు పెట్టింది. ఓపెనర్లు తొలి వికెట్ కు 4.3 ఓవర్లలో 56 పరుగులు చేశారు. షఫాలీ వర్మ 15 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ తో 33 పరుగులు చేసి స్టంప్ ఔట్ గా వెనుదిరిగింది. మరో ఓపెనర్, కెప్టెన్ మెగ్ లన్నింగ్ 22 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్లతో 32; ఆలీస్ క్యాప్సీ 17 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 38 పరుగులతో నాటౌట్ గా నిలిచి 9 ఓవర్లలోనే విజయం అందించారు.
మారిజాన్ కాప్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.