ముంబై ఇండియన్స్ జట్టు విమెన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్స్ కు చేరుకుంది, నేడు జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో యూపీ వారియర్స్ పై 72 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసి 182 పరుగులు చేసిన ముంబై, ఆ తర్వాత బౌలింగ్ లోనూ రాణించి యూపీని 110 పరుగులకే ఆలౌట్ చేసింది. ముంబై బౌలర్ ఇస్సీ వాంగ్ డబ్ల్యూ పి ఎల్ లో తొలి హ్యాట్రిక్ సాధించింది. 13వ ఓవర్లో మూడు వరుస బంతుల్లో కిరణ్ నవ్ గిరే, సిమ్రాన్ షేక్, సోఫీ ఎక్సెల్ స్టోన్ లను పెవిలియన్ పంపింది.
నవీ ముంబై లోని డా. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో యూపీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. నటాలీ స్కివర్ బ్రంట్ 38 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 (నాటౌట్); మెలీ కేర్ర్-29; హేలీ మాథ్యూస్-26; యస్తికా భాటియా-21 పరుగులతో రాణించగా, కెప్టెన్ హర్మన్ 14; చివర్లో పూజా వస్త్రాకర్ కేవలం 4 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్ తో 11 రన్స్ చేశారు. దీనితో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. యూపీ బౌలర్లలో ఎక్సెల్ స్టోన్ 2; అంజలి శర్వాణి, పర్శవి చోప్రా చెరో వికెట్ పడగొట్టారు.
యూపీ 21 పరుగులకే మూడు వికెట్లు (శ్వేతా షెరావత్-1; అలిస్సా హీలీ-11; తహిలా మెక్ గ్రాత్-7) కోల్పోయింది. జట్టులో కిరణ్ నవ్ గిరే ఒక్కటే 43 పరుగులతో రాణించింది. ముంబై బౌలర్ల దెబ్బకు 17.4 ఓవర్లలో 110 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇస్సీ వాంగ్ 4; సైకా ఇషాక్ 2; నటాలి బ్రంట్, కలిత, హేలీ మాథ్యూస్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
నటాలి స్కివర్ బ్రంట్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.