Monday, January 20, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅనంత తిమిర జ్ఞానం

అనంత తిమిర జ్ఞానం

Veerayya Title song Row: కొంతమంది తమ తప్పులు ఒప్పుకోవడానికి ఇష్డపడరు సరికదా బుకాయింపుకి దిగుతారు. దోతరుపు చేసి నెగ్గాలని వ్యర్థయత్నం చేస్తారు. అది తప్పు అని భావించిన వారు పదుగురితో పంచుకుని ‘నేననుకున్నట్టే వీళ్ళూ అనుకుంటు న్నారు, అది తప్పేనని’ అనీ, తమ అవగాహన సరైందేననీ ఇతరులతో తైపారేసి చూసుకుంటారు. తమ అభిప్రాయం సరికాదని తేలితే ఒప్పుకుని కొత్తవిషయం నేర్చుకున్నామని సంతోషిస్తారు. కొందరు అది తప్పు అని తెలిసినా మనకెందుకులే అనుకుని అవతలివాడి అజ్ఞానానికి జాలిపడి నవ్వు కుంటారు.

నిన్నొక మిత్రుడు ఫోన్ చేసి ‘తిమిరనేత్రము’ అంటే ఏమిటి? అనడిగేడు. తనకు తెలసినా… ఏమో? ఏపుట్టలో ఏపాముందో?..ఏ నేత్రంలో ఏ తిమిరం దాగుందో? అనే సందేహంతో.  “తిమిరనేత్రం అంటే చీకటికన్ను అనే కదా..అంటే గుడ్డికన్ను అనే కదా… లేదా ఇంకేమైనా గూఢార్థముందా” అని అడిగేడు. అతడూ తెలుగు అధ్యాపకుడే. నేనూ అదే చెప్పేను. నువ్వనుకున్నదే అని.

ఆ తరువాత బాగా భాషాజ్ఞానమున్నవాడని‌, చందస్సు, వ్యాకణాలంకారాల మీద పట్టు ఉందని నేను నమ్మిన మిత్రుడు తేజోమూర్తుల ప్రకాశరావు మాటల సందర్భంలో తాను కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించి ‘ అదెంత మాత్రమూ సరికాదనీ, విరోధాభాస అలంకారం అవ్వదనీ‘ తన అసహనం వ్యక్తం చేశాడు.

”తిమిర నేత్రమై ఆవరించిన త్రినేత్రుడు వీడు’ అని రాయొచ్చునా?” అని మరో మిత్రుడడిగేడు. వాడు కవితలు రాస్తుంటాడు. ఇలా అప్పుడప్పుడూ తన సందేహ నివృత్తి కోసం నన్ను సంప్రదిస్తుంటాడు. నాకు తెలిస్తే చెప్తాను. లేదంటే తెలీదనీ, తెలుసుకుని చెప్తాననీ చెప్పి ఆ తరువాత ఎలాగో తెలుసుకుని చెప్తాను. ఇప్పుడీ సందేహం ‘తిమిరనేత్రమై ఆవరించిన త్రినేత్రుడే వీడు’ అనడం సరి కాదు అని నేనంటే “సినీ రచయిత కదా..అంత పొరపాటు చేస్తాడా?” అని సందేహం వ్యక్తం చేసేడు. సినీ రచయిత అంటే ఎంత నమ్మకమో.! ‘ఎవర్రాసినా అది సరికాదు’ అన్నాను . సినిమా కవి ఐతే మాత్రం ఆకాశం నుండి ఊడిపడ్డాడా? ఆకాశంలో తిరిగితే తిరగొచ్చుగాక విమానాల్లో…. కానీ తప్పులు రాయడనేమీ లేదు కదా!

మరో మిత్రుడు వాట్సప్ లో నాకో లింక్ పంపించి చూడమన్నాడు. నాకంటే ముందే మిత్రులు ఈ విషయాన్ని గమనించేరన్నమాట. లింక్ తెరిచి చూసేను. ఆ పాట రాసిన కవి మాట్లాడుతున్న వీడియో క్లిప్ అది. అందులో పాట రాసిన కవి కొన్ని అలంకారాల జాబితా వినిపించి కవిత్వంలో అలంకారాలుంటాయని, ఆ పాటలో ‘విరోధాభాస అలంకారం’ వాడాననీ అన్నాడు. అందుకు ఉదాహరణ గా  ‘హిమజ్వాల’ అనే పదాన్ని ‘విరోధాభాస అలంకారం’ అన్నాడు. అలా బుకాయించడం చూస్తే ‘గుడ్డిపిల్లీ ఎలకా ..’ సామెత గుర్తుకొచ్చింది. బుకాయించినంత మాత్రాన తప్పు ఒప్పైపోదు కదా? పోనీ అనుకోకుండా రాశాడా అంటే ‘కావాలనే రాసేను అంటున్నాడా కవి’.  హీరో ధీరత్వాన్ని వర్ణిస్తూ రాసిన ఆ పాటను ఎందరో ప్రముఖులు ప్రశంసించారట. వినడానికి పదాలు బాగున్నాయనో, ట్యూన్ బాగుందనో, గాయకుడు బాగా పాడ్డంవల్లనో ప్రశంసించి వుండొచ్చు. వారి‌ అభిమానాన్ని అలా ప్రకటించి వుండొచ్చు. అంతమాత్రాన అది గొప్పదైపోదు.

అందులో ప్రయోగించిన ‘తిమిరనేత్రమై ఆవరించిన త్రినేత్రుడు వీడు’ అన్నది తప్పుడు ప్రయోగం కాకుండా పోదు. ఆ వాక్యం పట్ల తన సందేహాన్ని వ్యక్తం చేశాడట ప్రముఖ నవలారచయిత యండమూరి వీరేంద్రనాధ్. అది అభ్యంతరకరమైపోయిందీ కవిగారికి. యండమూరి సాధారణమైన వ్యక్తి కాదు. అతను అశేష పాఠకాదరణ పొందిన పేరున్న రచయిత. తన ప్రయోగానికి తానే మురిసిపోయి విరోధాభాస అలంకారాన్ని సాయంగా తెచ్చుకున్నాడే గాని ఇతరులకు తప్పనిపించిన దాన్ని కొంత వివేచనతో ‘తప్పేనేమో’ అని పరిశీలన చేసుకోవాలనీ అనుకోలేక పోయాడు.  తన వివరణ సమంజసంగా లేదు. అర్థవంతమూ కాదు. ‘లోతుగా ఆలోచించాలని’ అన్నాడు గానీ అతను వాడిన పదాల్లో లోతుగా ఆలోచించడానికేమీ లేదు. విరోధాభాస అలంకారమంటే ఏమిటో శ్లోకం చదివి తను రాసింది విరోధాభాస అలంకారమని అనుకుంటున్నాడు, అదే అంటున్నాడు. తాను మాత్రమే అనుకుంటే ఎలా? ‘తిమిరనేత్రమై ఆవరించిన త్రినేత్రుడు’ అంటే ‘శివుడు గుడ్డికన్నై ఆవరించడమే’. అది శివదూషణా కాదా అనేది ప్రధానం కాదిక్కడ. ఆ వాక్యప్రయోగమే తప్పని. ఇందులో లోతులేమీ లేవు.

విరోధాభాసాలంకారాన్ని చాలా సినిమా పాటల్లో చూడగలం.
“ఇటికీలో జాబిల్లి కటికనిప్పులు చెరిగింది”
“మంటలురేపే నెలరాజా, ఈ తుంటరితనము నీకేలా”
“జాబిలిలోనే జ్వాలలు రేగె, వెన్నెలలోనే చీకటి‌మూగె”
“ఇదేమి లాహిరీ, ఇదేమి గారడీ, ఎడారిలోన‌ పూలుపూచె ఎంత సందడీ”
ఇలా చాలా పాటల్లో సినీకవులు వైవిధ్యభరితమైన పాటల్ని అందించారు విరోధాభాసాలంకారం సాయంతో.

ప్రేయసీప్రియుల విరహగీతాల్లో వెన్నెల్లో సెగలు రేగుతాయి, మల్లెల్లో మంటలెగుస్తాయి. పూలపాన్పు నిప్పులపరుపుగా మారిపోతుంది. మంచుతాకితే వెచ్చని ఆవిర్లొస్తాయి. కవులకీ విరోధాభాసాలంకారం చాలా దగ్గరిది అనిపిస్తుంది. అలాటి అలంకారం పేరుచెప్పి ‘చీకటికన్నై ఆవరించే శివుడీ హీరో’ అని వర్ణించి ముక్కంటిని అంధుడిగా వర్ణించి విరోధాభాస అనడాన్ని ఎలా అంగీకరించగలం?

ఎవరో ఒక యూ ట్యూబ్ చానలాయన గొట్టం ముఖం ముందుపెట్టి అడిగితే అతగాడికి తెలీదని ఏదోవొకటి చెప్పేస్తే ఎలా? విన్నవాళ్ళందరూ వెర్రి వాళ్ళేనా ? అందరికీ అలంకారాల గురించి తెలీదు కాబట్టి ఏదైనా చెప్పేయవొచ్చనీ అనుకుని ఉండొచ్చు. అలంకారాలూ, చందస్సూ తెలిసినవారు, విన్నవాళ్ళలో కొందరైనా ఉండరా? బుకాయింపూ, దోతరుపూ ఎల్లకాలమూ చెల్లవుగాక చెల్లవు.  చెప్పడానికేమీ… పిల్లి గుడ్డిదైతే ఎలక ఎన్ని డ్యాన్సులైనా వేస్స్తాతుంది.  కవిగారు నెట్ లో చూసినట్టుంది విరోధాభాస అలంకారాన్ని వివరించే శ్లోకమూ, ఉదాహరణా. ఆ ఉదాహరణ కూడా సరిగా లేదు. “అంధకుడనే వాడు లేడు, లేని వాడిని శివుడు సంహరించేడు, అందుకే అది విరోధాభాస అయింది” ఇదీ ఆ గూగులమ్మలో చెప్పినతని వివరణ. అంధకాసురుడు బ్రహ్మవరాల చేత గర్వంతో పార్వతీదేవిని పొందాలని ప్రయత్నించి శివునిచేతిలో చనిపోతాడు. (చూ. పూర్వగాధా లహరి)

Chandrabose Song Row
మహాకవి శ్రీశ్రీ ‘అల్లూరిసీతారామరాజు’ సినిమాలో ‘తెలుగువీర లేవరా’ అనే పాటలో ‘ప్రతి మనిషీ తొడలుగొట్టి ,శృంఖలాలు పగుల గొట్టి, సింహాలై గర్జించాలీ’ అని రాశాడు. ఆ పాటకి జాతీయ పురస్కారమూ వచ్చింది. శ్రీశ్రీ యే ఆపాటలో తను చేసిన పొరపాటును గ్రహించి, అది తప్పని తానే చెప్పుకున్నాడు.. ‘ప్రతి ఒకడూ’ అని ఏకవచనంలో రాసి, ‘తొడలుగొట్టి’ ..’సింహాలై’ అని బహువచనం లో చెప్పడం సరికాదని’. అలా ఒప్పుకోవడం, దాన్ని చెప్పుకోవడం ఆ మహాకవి ఉన్నత సంస్కారానికొక ఉదాహరణ.

గతంలో కూడా ఇదే కవి ‘అధరకాగితం’ ‘మధురసంతకం’ అనేవి దుష్టసమాసాలు అంటే తన తప్పుని ఒప్పుకోక పూర్వకవి ప్రయోగమని ఎర్రన ‘కపిలకన్నులు‘ ఉదాహరణ తీసుకొచ్చేడు.’ ఆర్యవ్యవహారము దుష్టమైనా గ్రాహ్యమే’ అన్నారని అలాటి వాటిని అనుసరించమని కాదు అర్థం. . తాను ‘ఎర్రన’ అంతటి మహాకవినని కాబోలు ఆ ఉదాహరణ తీసుకొచ్చేడీకవి..ఎస్పీ బాలుగారు ఈ కవిని సభకు పరిచయం చేస్తూ ‘ ఆత్రేయ అంతటి వాడనీ, ఎన్నో ప్రయోగాలు చేసేడనీ, ‘అధర కాగితం’ ‘మధురసంతకం’ పదాల్ని ఉదహరించి ‘మాయా బజార్’ చిత్రంలో ఘటోత్కచుడు అంటాడు కదా “వెయ్యండి ‘వీరతాళ్ళు” అని. ఆ పదాన్ని ఉదహరించి “ఇదీ దుష్ట సమాసమే కదా” అని సమర్ధించుకొచ్చేరు. .
‘వీరతాళ్ళు’ దుష్టసమాసమే అయినా దానికొక ప్రయోజన ముందని, ఆ ప్రయోగానికొక పరమార్థముందనీ గమనించాలి. ఘటోత్కచుడు క్షత్రియుడైన భీమునికీ, రాక్షస స్త్రీ అయన హిడింబకూ జన్మించినవాడు.. అతని మాటలు తెలుగు సంస్కృత పదాల కలగలుపుతో అతని పుట్టుకకు సంబంధించిన విషయాన్ని సూచనప్రాయంగా దుష్ట సమాసాన్ని కవి వాడేడని గ్రహిస్తే ఆ దుష్టసమాసం అక్కడ ప్రయోగించడం అర్థవంతమే అవుతుంది. ‘అధరకాగితం’ ప్రయోగ పరమార్థం ఏమిటో మరి కవిగారికే తెలియాలి.

ఇక ‘కోకాకోలాటం” వయస్కాంతం’ వంటి పదబంధాలు ప్రయోగాలు అద్భుతమట. ”వాణిశ్రీధర్, బాబూ మోహన్ బాబు’ అనడమూ ప్రయోగాలే అనాలి మరి. ఇక వార్తాపత్రికల్లో ఇలాంటి పదబంధాలెన్నో, ‘ప్రసంగాలకు హోరెత్తిన ప్రభం’జనం’. ‘హడలెత్తించిన తుపాకీ’మొన’గాడు’ ‘ ‘యువతను పక్కదారిపట్టిస్తున్న సినీ’మా’యలోకం’ ‘ఎడ్లపందాల్లో కొమ్ములాటలు’ వంటివి ఎన్నో . కొద్ది సమయం కేటాయిస్తే పదోతరగతి పిల్లడుకూడా ఇలాటి పదబంధాలు బోలెడు సృష్టించగలడు. ‘మమ’కారం’గా ఉంది, ‘బిస’కత్తుల’బండి ‘ అన్నాడొక పిల్లడు క్లాసులో ఇలాంటి పదాల సరదా ఆటల్లో. ఇలా చాలా పదాల్ని తయారుచేసే వారు తరగతిగదిలో పిల్లలు. అదొక పదక్రీడ అంతే. దాన్ని ప్రయోగని మురిసిపోనక్కర్లేదు, పొగడ్తలలోముంచెయ్యాల్సిన పనీలేదు. విశేషమేమిటంటే ఆ కవిగారే చెప్పుకున్నారు.. అవి ‘ప్రయోగాలని’. చెప్పుకోనివ్వండి గానీ బుకాయించడమే ఇబ్బంది.

గతంలో ఎప్పుడో మాట్లాడుకున్నవే అయినా ఒకసారి గుర్తుచేసుకోవాలని పిస్తుంది ..”చీకటితో వెలుగేచెప్పెను నేనున్నానని, నీకేం కాదనీ” అని రాసేడీ కవి. వెలుగు చీకటికి ఎలా ధైర్యం చెప్తుందో ఇప్పటికీ తెలీలేదు నాకు. ఎవరైనా చెప్తే తెలుసుకోవాలని ఉంది. బాగా జనంలోకెళ్ళిన హిట్ పాట “మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది” ఈ కవిగారిదే. పాట మంచిదే కానీ పల్లవిలో సూచించిన విషయం చరణాల్లో కనబడదు. పల్లవికీ చరణాలకీ పొంతన లేదు. పల్లవి విషయసూచిక లాంటిది. పల్లవిలో వెప్పిన అంశాన్నే చరణాల్లో చెప్పడం సాధారణం. అదేదీ ఈ పాటలో కనబడదు.

ఒకపాటలో ‘చింతచెట్టెక్కి చిగురు కొయ్యబోతే చేతికి అందిన చందమామ లాగ సక్కగా ఉంటాది అమ్మాయి, వేరుసెనగ చేను తీతకెల్తే దొరికిన లంకెబిందెల్లాగ సక్కగా ఉంటాది అమ్మాయి. దీన్నెలా అర్థం చేసుకోవాలో? కవి వర్ణించేది అందాన్నో? అదృష్టాన్నో? నాకైతే అర్థంకాలేదు. లేదా నాకు అర్థం చేసుకోవడం రాలేదో!? (ఎవరైనా మంచి తెలుగు భాషా పండితుడు సరైన వివరణయిస్తే తెలుసుకోడానికీ, నేనే పొరబడ్డానని ఒప్పుకోడానికీ నాకేమీ అభ్యంతరం లేదు).

Chandrabose Song Row

సినిమా పాటల్లో ఇలపింటివి వెతికి చూడ్డం అవివేకం అంటే చెప్పలేనుగానీ సినిమా పాట మాత్రం సాహిత్యం కాదా? సందేహాలు నలుగుర్లో పెడితే నివృత్తవుతాయి కదా. నత్కీరోపాఖ్యానమని ఒక కథవుంది “. పద్యం రాసింది మూడుకన్నులవాడే అయినా అదితప్పు అనీ, తలచుట్టువార కన్నులున్నా’ తప్పు ఒప్పైపోదు” అనీ కవి నత్కీరుడు అంటాడు. తన రాతలోనే తప్పును ఎత్తిచూపుతావా? అని నత్కీరుడ్ని శపిస్తాడు శివుడు. పాపం నత్కీరుడు. ఆ కథలో శివుడు నత్కీరుణ్ణి శపించడం అన్యాయం అనిపిస్తుంది. నత్కీరుడు తప్పును తప్పు అనడం తప్పెలా అయ్యిందో నాకిప్పటికీ సందేహమే.

ఈ ‘సినీచంద్రబోశివుడు’ బుకాయించి శపించీవొచ్చుగాక. తప్పెప్పుడూ తప్పే గానీ ఒప్పయి పోదు. నిజానికి యండమూరి ఈ విషయాన్ని దృష్టికి తెచ్చినప్పుడు ‘ఔనా ..’ అని యండమూరి అభిప్రాయాన్ని కవి పరిగణనలోకి తీసుకునుంటే హుందాగా ఉండేది. భాష అందరిదీ కదా! ఎవరోవొకరు అడగాల గదా! నేను‌ ఇప్పటికీ అది తప్పే అను‌కుంటున్నాను. ఒకవేళ ఒప్పే అయితే అలంకారశాస్త్రంలో నిష్ణాతులైన వాళ్ళెవరైనా అది ఒప్పెలాగో వివరించే అవకాశం ఉంటుందికదా ఇక్కడ రాసుకుంటే. అందుకే మనసులో ఉంచుకుని‌ మథన పడకుండా మిత్రులతో ఇలా పంచుకోవడం.

-గంటేడ గౌరునాయుడు

(ఫేస్ బుక్ గోడమీద నుండి ఎత్తిపోత. రచయిత అనుమతి లేకుండా వాడుకున్నందుకు క్షమాపణలు)

Also Read :

పల్లె పన్నీరు చల్లుతోందో…

RELATED ARTICLES

Most Popular

న్యూస్