జింబాబ్వే చాలా కాలం తరువాత వరల్డ్ కప్ పోటీల్లో మొదటి దశ దాటింది. టి 20 వరల్డ్ కప్ పోటీల్లో నేడు జరిగిన మ్యాచ్ లో స్కాట్లాండ్ పై 5వికెట్ల తేడాతో విజయం సాధించి సూపర్ 12కు చేరుకుంది. కెప్టెన్ క్రెగ్ ఎర్విన్ 58 (54బంతులు, 6ఫోర్లు) పరుగులతో రాణించి జట్టును విజయ తీరం వైపు నడిపించాడు.
హోబార్ట్ లోని బెల్లిరివ్ ఓవల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో స్కాట్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ మున్షీ-54; మెక్ లియోడ్-25 పరుగులు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 132పరుగులు చేసింది. జింబాబ్వే బౌలర్లలో చాతారా, నగరవ చెరో రెండు; ముజారబని, రాజా చెరో వికెట్ పడగొట్టారు.
జింబాబ్వే ఏడు పరుగులకే రెండు వికెట్లు (చకబ్వా-4; వెస్లీ డకౌట్) కోల్పోయింది. సీన్ విలియమ్స్ కూడా ఏడు పరుగులే చేసి వెనుదిరిగాడు. ఈ దశలో ఎర్విన్-సికందర్ రాజాలు నాలుగో వికెట్ కు 64 పరుగుల మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. సికందర్ 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి ఔట్ కాగా, ఆ కాసేపటికే ఎర్విన్ (58) కూడా పెవిలియన్ చేరాడు. మిల్టన్ శుంబ(11)-రియాన్ బర్ల్(9) లు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి 18.3 ఓవర్లలో లక్ష్యం సాధించారు.
ఆల్ రౌండ్ ప్రతిభ చాటిన సికందర్ రాజాకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
నేటితో గ్రూప్ దశ పోటీలు నేటితో ముగిశాయి. నిన్న జరిగిన మ్యాచ్ ల్లో గ్రూప్ ‘ఏ’ నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్… నేడు జరిగిన పోటీల్లో ఐర్లాండ్, జింబాబ్వే సూపర్ 12కు చేరుకున్నాయి.