Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

రోష‌న్‌, శ్రీలీల జంట‌గా ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ఆధ్వ‌ర్యంలో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌D’. ఈ మూవీని రాఘ‌వేంద్రరావు శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేశారు. ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్ పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 15న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా  ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేశ్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఈ సంద‌ర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “నా సినిమా ‘యుద్ధభూమి’ నిర్మాత కృష్ణ‌మూర్తి గారికి ముందుగా నివాళులు అర్పిస్తున్నాను. శ్రీకాంత్ హీరోగా 1996లో వచ్చిన ‘పెళ్లి సంద‌డి’ 175 రోజుల ఈవెంట్ జ‌యవాడ‌లో జ‌రిగిన‌ప్పుడు దానికి నేనే చీఫ్ గెస్ట్‌ గా వెళ్లాను. అప్పుడు నా సినిమాలు నాలుగు వ‌రుస‌గా స‌క్సెస్ కాలేదు. దాంతో నేను కాస్త డ‌ల్‌ గా ఉన్నాను. కానీ ప్రేక్ష‌కులు న‌న్ను రిసీవ్ చేసుకున్న తీరు చూసిన త‌ర్వాత నాలో తెలియ‌ని ఉత్సాహం వ‌చ్చేసింది. ‘నువ్వు కాస్త డ‌ల్‌గా ఉన్నావ‌నిపించింది. అందుక‌నే నిన్ను ఇక్క‌డ‌కు తీసుకొస్తే బావుంటుంద‌నిపించిద‌’ని రాఘ‌వేంద్ర‌రావు గారు అన్న‌ప్పుడు నాలో తెలియ‌ని ఓ జోష్ వ‌చ్చింది. ఆ జోష్ త‌గ్గ‌లేదు.

పాతికేళ్ల త‌ర్వాత మ‌రోసారి ఆయ‌న న‌న్ను ఈ పెళ్లి సంద‌డి సినిమాకు ఆహ్వానించి అదే ప్రేమానురాగాలు, ఆప్యాయ‌త‌ను చూపించారు. అభిమానులంద‌రి రుణం తీర్చుకోలేనిది.  ప్ర‌తి సినిమాకు రాఘవేంద్ర రావు గారు న‌న్ను ఎంక‌రేజ్ చేసిన తీరు గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ‘అడ‌విదొంగ’ సినిమా చేసేట‌ప్పుడు యాక్ష‌న్ సీన్స్‌ ను ముందు రోజే ప్రాక్టీస్ చేసేవాడిని. అది చూసి బాగా క‌ష్ట‌ప‌డుతున్నావ్ బాబాయ్ అని మెచ్చుకునేవాడు. ఆ పిలుపు నాకెంతో ఉత్సాహాన్ని ఇచ్చేది. అలాగే ‘ఘ‌రానా మొగుడు’ సినిమా స‌మ‌యంలో డాల్ఫిన్ హోట‌ల్‌లో ప్ర‌భుదేవాగారితో బంగారు కోడిపెట్ట పాట‌ల‌ను షూటింగ్ పూర్తి చేసుకుని వ‌చ్చి రాత్రి స‌మ‌యంలో ప్రాక్టీస్ చేస్తుంటే నీకు అవ‌స‌ర‌మా అని అంటుండేవారు. అలా ఆయ‌న అందించిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదు..గొప్ప ద‌ర్శ‌కులు ఎంతో మంది ఉన్నా కూడా ఆయ‌న‌లా ప్రేమ‌ను చూపించే ద‌ర్శ‌కుడు చాలా త‌క్కువ మంది ఉంటారు.

ఆర్టిస్టులు అంద‌రినీ ఆయ‌నంత ప్రేమిస్తారు. నేటి ద‌ర్శ‌కులు కూడా అది నేర్చుకోగ‌లిగితే చాలా బావుంటుంది. స్వీట్ డైరెక్ట‌రే కాదు..రొమాంటిక్ ఆలోచ‌న ఉండే డైరెక్ట‌ర్ కూడా.  ఆయ‌న ఆధ్వ‌ర్యంలో గౌరి గారి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ‘పెళ్లి సంద‌D’ సినిమాలో రోషన్ హీరోగా నటించాడు. ఈ సినిమా అప్ప‌టి శ్రీకాంత్ పెళ్లి సంద‌డి చిత్రంలా సంద‌డి చేస్తుంద‌ని భావిస్తున్నాను. కీర‌వాణిగారి అద్భుత‌మైన మ్యూజిక్‌, ఆర్ట్ డైరెక్ష‌న్ అన్ని ప్ర‌తి ఒక్క‌రినీ అల‌రిస్తుంద‌ని అనుకుంటున్నాను. హీరోయిన్ శ్రీలీలకు అభినంద‌న‌లు. నా చిర‌కాల మిత్రుడు విక్ట‌రీ వెంక‌టేశ్ ఈ వేడుక‌కి రావ‌డం ఎంతో ఆనందంగా ఉంది. హీరోలంద‌రి మ‌ధ్య‌లో ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం ఉంటే ఇండ‌స్ట్రీలో ఇలా కొట్టుకోవ‌డాలు, మాట‌ల‌న‌టం, మాట‌ల‌నిపించుకోవ‌డం ఉండ‌దు క‌దా. ప‌ద‌వులు ఏదైనా తాత్కాలిక‌మే. వాటి కోసం మాట‌లు అన‌డం, అనిపించుకోవ‌డం.. చూస్తుంటే బాధ‌నిపిస్తుంది. అదెవ‌రైనా కానీ. నేను ఏ ఒక్క‌రినీ వేలు పెట్టి చూపించాల‌నుకోవ‌డం లేదు. ప్ర‌తి ఒక్క‌రూ విజ్ఞ‌త‌తో ఉండండి. మ‌న ఆదిప‌త్యం చూపించుకోవ‌డానికి, ప్ర‌భావాన్ని చూపించుకోవ‌డానికి ఎదుటి వారిని కించ‌ప‌ర‌చాల్సిన అవ‌స‌రం లేదు. స‌మ‌స్య‌ను ఎక్క‌డ స్టార్ట్ అయ్యింది. వివాదాలు ఎక్క‌డ స్టార్ట్ అయ్యాయో తెలుసుకుని హోమియోప‌తి వైద్యంలా మూలాల్లోకి వెళ్లి ట్రీట్‌మెంట్ ఇవ్వాలి. అలాంటి వ్య‌క్తుల‌ను దూరంగా ఉంచితే అంద‌రూ బావుంటారు. అప్పుడది వ‌సుధైక కుటుంబం అవుతుంది. ఈ ‘పెళ్లి సంద‌D’ నాటి ‘పెళ్లి సంద‌డి’లా గొప్ప‌గా ఆడాల‌ని, ఆడుతుంద‌ని భావిస్తున్నాను’’ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com