Tuesday, December 3, 2024
Homeజాతీయంకాంగ్రెస్‌లో తాత్కాలిక విరామ సంగీతం..!

కాంగ్రెస్‌లో తాత్కాలిక విరామ సంగీతం..!

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉంటుంది. కాంగ్రెస్ తన చుట్టూ తాను తిరుగుతూ ఎవరి చుట్టూ తిరగాలో తెలియక తనతో తానే సంఘర్షించుకుంటూ ఉంటుంది. ఇది పార్టీగా ఆత్మ శోధనలో భాగం కాదు. లీడర్ల అంతరాత్మల అంతర్మథనాలతో అల్లుకున్న అస్తిత్వ పోరాటం. పార్టీ ఒక ఆస్తి. అందులో ఎవరి వాటా ఎంత అన్నది అధికారంలో ఉన్నప్పుడు అణిగిమణిగి మాట్లాడుకోవాలి. అధికారంలో లేనప్పుడు వీధిలో జుట్లు పట్టుకుని కొట్లాడుకుంటూ మాట్లాడుకోవాలి.

 

గోటితో పోయేదానికి గొడ్డలిని ఎలా వాడాలో కాంగ్రెస్ కు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. కాంగ్రెస్ కు అన్నీ తెలుసు అని తనకు తాను అనుకుంటుంది. కాంగ్రెస్ కు ఏమేమి తెలియవో అందులో పుట్టి పెరిగిన లీడర్లే ప్రపంచానికి విడమరచి చెబుతుంటారు.

 

కాంగ్రెస్ కు ఒక చరిత్ర ఉంటుంది. అయితే ఆ చరిత్ర ఎవరిదో కాంగ్రెస్ నాయకులకే కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ప్రతి పార్టీకి ఒక ఓటు బ్యాంక్ ఉంటుంది. బ్యాంకులను జాతీయం చేసినట్లు ఆసేతుహిమాచలం కాంగ్రెస్ ఓటు బ్యాంకును ఇతర పార్టీలు జాతీయం చేసేశాయి. నిజానికి జాతీయవాదం, దేశభక్తి దగ్గరే ఎందుకోగానీ కాంగ్రెస్ కు ఎప్పుడూ గొంతులో పచ్చి వెలక్కాయలు టన్నులకు టన్నులు అడ్డుపడతాయి. దేశం, ధర్మాలను కాంగ్రెస్ ఒకలా అర్థం చేసుకుంది. కాంగ్రెస్ అవగాహనను దేశం ఇంకోలా అర్థం చేసుకుంది. ఇది భాషాపరమయిన సమస్య కాదు. భావపరమయిన సమస్య.

 

సమస్య ఎక్కడుందో పరిష్కారం అక్కడే ఉంటుంది. సమస్యకు దూరంగా పారిపోతే పరిష్కారానికి దూరంగా పారిపోయినట్లే. కాంగ్రెస్ లో యూత్ అంటే యాభై ఏళ్లు. కొంచెం సీనియర్లు అంటే డెబ్బయ్. సీనియర్ మోస్ట్ అంటే తొంభై దాటి ఉండాలి. ఇప్పుడు సీనియర్లు కాంగ్రెస్ సమస్యను గుర్తించి లేఖ రాసి కాంగ్రెస్ కే పంపారు. తాత్వికంగా చూస్తే ఇది సమస్యకే సమస్య గురించి సమస్యాత్మక ఉత్తరం రాసినట్లు ఉంది. సమభావం, సమసమాజం లాంటి ఆదర్శాల కోవలో సమస్యను కూడా సమాన దృష్టితో చూసే పరిపక్వత కాంగ్రెస్ కు ఉంది. అందుకే సమస్యాత్మక ఉత్తరం ఏడుగంటల ఏడుపు తరువాత సమస్య కాకుండా తేలిపోయింది.

 

ఉత్తరాదిలో ఎంత మొత్తుకున్నా కాంగ్రెస్ కు పూర్వ వైభవం రావడం లేదు. దక్షిణాదిలో కాంగ్రెస్ కు దయా దాక్షిణ్యాలు మిగలలేదు. ఈశాన్యంలో హస్తానికి వాస్తు సహకరించలేదు. నైరుతి మూల మిగలడం లేదు. అలవాటులేని పూజలు, హోమాలు, ఔపచారిక శాంతులు, శివారాధనలు, బొట్లు, ఆలయాల్లో పొర్లు దండాలు కూడా కాంగ్రెస్ ట్రై చేసింది. పెద్దగా వర్కవుట్ కాలేదు.

 

దేశంలో ఇప్పుడు కాంగ్రెస్ ఎవరి తరుఫున నిలబడాలనుకుంటోందో ముందు తనలో తను ఒక మాట అనుకుంటే- తరువాత వారు నిలబడతారో లేదో తెలుస్తుంది. రాజకీయాల్లో ఆదర్శాలకు- ఆచరణకు పొత్తు కుదరదు. కానీ కాంగ్రెస్ పొత్తు కుదర్చబోయి చేయి కాల్చుకుంటూనే ఉంటుంది.

 

చాలా రాద్ధాంతం తరువాత సిద్ధాంతం స్థిరపడుతుంది. కాంగ్రెస్ లో ఎంత రాద్ధాంతం జరిగినా సిద్ధాంతం రూపు దిద్దుకోదు. రాద్ధాంతం తరువాత రాద్ధాంతమే మిగిలి ఉంటుంది. ఈ రాద్ధాంతం పొతే మరో రాద్ధాంతం ద్వారంలో ఎదురు చూస్తూ ఉంటుంది. కాంగ్రెస్ కు కాంగ్రెస్సే శత్రువు.

 

అన్నట్లు…

 

ఉత్తరం చుట్టు తిరిగి, తూరుపు తిరిగి దండం పెట్టి, దక్షిణం కనపడక, మళ్లీ ఉత్తరం వైపే వెళ్లింది. తాత్కాలికంగా తాత్కాలిక అధ్యక్షత్వం ఉన్నచోటే ఉంది. తాత్కాలిక ఉపశమనంతో తాత్కాలిక ఊపిరి పీల్చుకున్న తత్కాలికులకు తత్వం బోధపడినట్లు అనిపించడం కూడా పరమ తాత్కాలికమే.

 

ఇప్పుడొక తాత్కాలిక విరామ సంగీతం.

 

పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్