కోవిడ్ సంక్షోభ సమయంలోను సంక్షేమ పధకాలు కొనసాగిస్తున్నామని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వెల్లడించారు. ప్రజా సంక్షేమమ ధ్యేయంగా ఇప్పటికే 95 శాతం హామీలు అమలు చేశామని చెప్పారు. నవరత్నాలు ద్వారా లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి సంక్షేమ పథకాలు చేరుస్తున్నామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి వర్చువల్ విధానం ద్వారా గవర్నర్ ప్రసంగించారు.
దేశవ్యాప్తంగా కోవిడ్ రెండో దశ ఉధృతంగా ఉందని, మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉందని బిశ్వ భూషణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు గవర్నర్ సంతాపం తెలిపారు. కోవిడ్ నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ఇప్పటి వరకూ కోటి 80 లక్షల మందికి టెస్టులు చేశామని, కోవిడ్ చికిత్సను ఆరోగ్రశ్రీ లో చేర్చామని వివరించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్లు కోవిడ్ చికిత్స కోసం తీసుకున్నామని, ఇవి కాక ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశామని గవర్నర్ తన ప్రసంగంలో చెప్పారు, ఆక్సిజన్ కొరత లేకుండా ఇతర దేశాల నుంచి క్రయోజనిక్ ఆక్సిజన్ దిగుమతి చేసుకుంటున్నామన్నారు. కోవిడ్ పై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు సెల్యూట్ చేశారు. కరోనా ప్రభావం ఆర్ధిక రంగంపై తీవ్రంగా ఉందన్నారు.