Wednesday, February 21, 2024
Homeసినిమాతెలుగు పాటపై తేనె జల్లు .. సిరివెన్నెల

తెలుగు పాటపై తేనె జల్లు .. సిరివెన్నెల

(మే 20,  సిరివెన్నెల జన్మదినం)

మధురమైన పాటకు .. మంచులా కరిగే మనసుకు విడదీయరాని అనుబంధం ఉంది. పాట విహరించడానికి మనసు కావాలి .. మనసు ఊరట చెందడానికి పాట కావాలి. ఈ రెండూ ఒకదానితో ఒకటి ముడిపడిపోతాయి .. మురిసిపోతాయి. ఒంటరిగా ఉన్నప్పుడు పాట తోడవుతుంది .. ఓడిపోయినప్పుడు ఓదార్పు అవుతుంది. మనసు ఆవేదనతో నిండిపోయినప్పుడు అక్కున చేర్చుకుంటుంది .. అనుభవాలతో పండిపోయినప్పుడు జీవనసారాన్ని తేలిక పదాలతో తెలియజెబుతుంది.

అనేక భావాలను పాట చాలా తక్కువ సమయంలో పలికించగలదు .. అంతర్లీనంగా దాగిన అర్థాలను ఒలికించగలదు. ఉత్సాహం .. ఉల్లాసం .. ఉద్వేగం .. విరహం .. వియోగం .. ఇలా మనసు లోతులలో దాగిన భావాల మూటను పాట మాత్రమే విప్పగలదు .. పాట మాత్రమే చెప్పగలదు. అలాంటి పాటలు రాయాలంటే మాటలు కాదు. పాటలు రాయడం అంటే పదాలు పేర్చడం కాదు. మనసు మైదానంలో భావాలు .. అనుభవాలు కలిసి అక్షరాలనే ఆయుధాలతో పోరాటం చేస్తేనే గాని ఒక పాట పుట్టదు. ఆ పాటలో జీవం ఉంటేనేగాని అది శ్రోతల మనసుకు పట్టదు.

అలాంటి పాటలను తమదైన బాటలో పరుగులు తీయించిన రచయితలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి పాటల రచయితలలో ‘ చేంబోలు సీతారామశాస్త్రి’ ఒకరు. 1955 .. మే 20వ తేదీన ఆయన విశాఖ జిల్లాలోని ‘అనకాపల్లి’లో జన్మించారు. మొదటి నుంచి కూడా సీతారామశాస్త్రి సాహిత్యం పట్ల మక్కువ చూపుతూ వచ్చారు. ‘సిరివెన్నెల’ సినిమాతో ఆయన గీత రచయితగా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఆ సినిమా పేరే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది.

తొలి సినిమాలోనే ‘ఆది భిక్షవు వాడినేమి కోరేది’ .. ‘విధాత తలపున ప్రభవించినది’ అంటూ తన కలాన్ని ఎక్కు పెట్టారు. తన పాటల్లో తత్త్వాలు దాగి ఉంటాయనీ .. అవి అర్థాలనే కాదు .. పరమార్థాలను కూడా ఆవిష్కరిస్తాయని ఆయన నిరూపించారు. ‘రుద్రవీణ’లో ‘నమ్మకు నమ్మకు ఈ రేయినీ ..’ తరలిరాదా తనే వసంతం .. తన దరికి రాని వనాల కోసం’ పాటలు ఒక పాఠంలా ఆలోచింపజేస్తాయి. ఆ పాటల్లో ఒక గ్రంధానికి సరిపడ భావసంపద కనిపిస్తుంది.

‘స్వర్ణ కమలం’లో కొత్తగా రెక్క లొచ్చెనా .. మెత్తగా రేకు విచ్చేనా’ అనే పాట, అప్పుడే పుట్టిన అనుభూతి పరిమళాన్ని అందంగా ఆవిష్కరిస్తుంది. సాహితీ సౌరభాలు వెదజల్లే పాటలనే కాదు .. తేలికైన పదాలతో గమ్మత్తులు చేయడం కూడా శాస్త్రిగారి కలానికి బాగా తెలుసు. ఒక పాటలో .. ‘పూల రెక్కలు .. కొన్నీ తేనె చుక్కలు .. రంగరిస్తివో .. ఇలా బొమ్మ చేస్తోవో‘ అంటారు. మరో పాటలో ‘కాసు ఉంటే గాలి కూడా కండిషన్ లో’ ఉంటుంది అని రాయడం ఆయనకే చెల్లింది. మరో పాటలో ‘పట్టపగలెవరైనా రాతిరిని చూస్తారా .. తన కురులు చూపిస్తా ఔననక చస్తారా’ వంటి ఛమక్కులు ఆయన పాటల్లో మెరుస్తాయి.

‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్నీ .. అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని‘ .. ‘కొంతమంది ఇంటిపేరు కాదురా గాంధీ’ వంటి పాటలు సిరివెన్నెల భావాలు ఉద్ధృతికి అద్దం పడతాయి. పదునైన ఆయన పదాల ప్రవాహానికి నిదర్శనంగా నిలుస్తాయి. ఇలా సిరివెన్నెల పాటలలో ఆత్రేయ వైఖరి .. శ్రీశ్రీ అభ్యుదయపు ఆనవాళ్లు .. సినారె పద సౌందర్యం .. కృష్ణశాస్త్రి భావకవిత్వపు జాడలు .. వేటూరి అల్లికలోని సొగసులు కనిపిస్తాయి. ఆయన పాటలను గురించి ఒక్కొక్కటిగా చెప్పుకోవడం అంటే వాన చినుకులను ఒకేసారి ఒడిసి పట్టుకోవడానికి చేసిన ప్రయత్నం అవుతుంది. ఇంద్ర ధనుస్సుకు అల్లెత్రాడు బిగించే సాహసం చేయడమే అవుతుంది. ఆయన ఒక అక్షరాల ప్రపంచం .. భావాల ప్ర్రవాహం అంతే.

జగమంత కుటుంబం నాది’ అంటూ ఆందరినీ తన అభిమానులుగా చేసుకున్న సీతారామశాస్త్రి కలానికి, విన్యాసమే తప్ప విశ్రాంతి తెలియదు .. ఆనంద తాండవమే తప్ప అలసట తెలియదు. అది అక్షర వర్షం కురిపిస్తూ .. పదాల వసంతాలు సృష్టిస్తూ .. పండుగలు తెస్తూనే ఉంటుంది. అక్షరానికో అనుభూతి యాత్ర చేయిస్తూనే ఉంటుంది. తెలుగు పాటపై తేనె జల్లు కురిపించిన ఆ అక్షర శిల్పి జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆ సాహిత్య సార్వభౌముడికి శుభాకాంక్షలు తెలియస్తూ .. మనసు పాత్రలపై ఆయన పాటలు మరిన్ని వాలిపోవాలనీ … అమృత ప్రవాహమై చేరిపోవాలని కోరుకుందాం!

– పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్