నిజమే.. వేలకు వేలు పెట్టి డజన్ల కొద్దీ వేసుకున్న రెమ్ డెసివిర్ లు ఇప్పుడు మందే కాకుండా పోయాయి.
ప్రాణాధారం అనుకున్న ప్లాస్మా ఇప్పుడు పనికిరానిదయింది.
కరోనా పేరు చెప్పి ఫార్మా కంపెనీలు కుబేరులైన మాటా నిజమే..
కరోనాకి ఇప్పటికీ సైంటిఫిక్ గా ఇదీ చికిత్స అనేది లేదన్నదీ నిజమే..
ఏ మందులూ వాడకపోయినా కొందరికి తగ్గడం నిజమే..
అన్ని మందులూ వాడినా ప్రాణాలు పోతున్నదీ నిజమే..
ఇంకొన్ని నిజాలున్నాయి.
నెల్లూరు ఆనందయ్య మందు ఉచితంగా ఇవ్వడం నిజమే.
ఆయన మందులో వాడే పదార్ధాల విషయంలో పారదర్శకంగా వుండడం నిజమే..
మందువల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ లేవన్నవీ నిజమే.
కొంతమంది కరోనా నయమవుతుందని చెప్తున్నదీ నిజమే..
మనకి తెలిసిన నిజాల బట్టే నిర్ణయం తీసేసుకుంటే-
ఇప్పుడు ఇంగ్లీష్ మందుల కంటే, ఆనందయ్యే బెటరనిపిస్తుంది.
సైన్స్ కంటే నమ్మకమే మంచిదనిపిస్తుంది.
కానీ..
కారణాల మీద పనిచేసేది సైన్స్..
ఫలితాల మీద ఆధారపడేది నమ్మకం..
కరోనా రావడానికి కారణమైన వైరస్ ఖచ్చితమైన ఆనుపానులు ఇంకా సైన్స్ కి చిక్కలేదు..
వ్యాధికారణాన్ని ఎటాక్ చేయడం ద్వారా జబ్బు తగ్గించడం ఇంగ్లీష్ వైద్యం లక్షణం.
కానీ, కరోనా విషయంలో మాత్రం ఇప్పటికీ లక్షణాలను నయం చేయడమే లక్ష్యంగా వుంటోంది.
ఈ విషయం డాక్టర్లే స్వయంగా చెప్తున్నారు.
చేపమందు ఉబ్బసం తగ్గిస్తుందని దశాబ్దాలుగా నమ్మారు.
నోట్లో నూనె వేసుకుని పుక్కిలించి ఉమ్మేస్తే సర్వరోగ నివారణి అని చాలా కాలం చలామణి అయింది.
ఇవన్నీ మనం కళ్ల ముందు కరిగిపోయిన నమ్మకాలే..
ఇక కరోనా వచ్చినప్పటి నుంచి కంటికి కనపడిన కషాయాలన్నీ తాగుతూనే వున్నారు.
అందులో ఆనందయ్య రసాయనం ఇంకొకటి కావచ్చు.
కానీ ఇదే మందు అనుకోవడమే సమస్య.
ఇది సైన్స్ కి మించిన సైన్స్ అనుకోవడం సమస్య.
సైన్స్ లో లోపాలు లేవా అంటే, ఆ లోపాలను సైన్స్ అంగీకరిస్తుంది.
రెమెడసివిర్ మొదట సూచించిన మెడికిల్ సైంటిస్టులే ఇప్పుడు వద్దంటున్నారు.
ప్లాస్మా పని చేసే అవకాశముందన్న వాళ్ళే మరింత రీసెర్చి తర్వాత లేదని చెప్తున్నారు.
అంటే, సైన్స్ తనని తాను పరీక్షించుకుంటుంది. లోపాలను ఒప్పుకుంటుంది. సరి చేసుకుంటుంది.. మరింత కచ్చితమైన సైన్స్ గా మారుతుంది.
నమ్మకం ఆ పని చేయదు. ఒకసారి నమ్మితే దానికి తిరుగుండదు. ఎదురు దాడే తప్ప.
ఇప్పుడు ఆనందయ్య మందు విషయంలో కూడా నమ్మకమే తప్ప శాస్త్రీయమైన పరీక్షలు లేవు.
ప్రాధమిక స్థాయిలో చేసిన పరీక్షల్లో కూడా ఈ రసాయనం ఇప్పటివరకు వున్న ఆయుర్వేద ప్రమాణాల్లో కూడా లేదని తేలింది.
పైగా కంట్లో పోసుకోవడం వల్ల ఇతరత్రా సమస్యలొస్తాయని కూడా తేలింది.
కొంతమందిలో గుణం కనిపించొచ్చు..కానీ దానికి ఏయే కారణాలు పనిచేశాయో ఇంకా పరిశోధించాలి.
మందు ఇచ్చే వ్యక్తి నిజాయితీ పరుడు, లాభాపేక్ష లేని వాడు కాబట్టీ ఆ మందు శాస్త్రీయతే పరీక్షించకూడదు అని చెప్పడం మొండి వాదనే అవుతుంది.
రకరకాల మ్యుటేషన్లతో, వేరియెంట్లతో సైన్స్ కి సవాలు విసురుతున్నకరోనా ని తేనె, ముళ్ళవంకాయ గుజ్జు.. తోకమిరియాలతో జయించేయాలనుకునే ఆశ మంచిదే కానీ, అది ఎంతమంది ప్రాణాలతో చెలగాటమో కూడా గుర్తించాలి..
కరోనా మీద ఏదో నాటికి సైన్స్ గెలస్తుంది. అప్పటి వరకు నమ్మకాలదే రాజ్యం..
-కె. శివప్రసాద్