Saturday, July 27, 2024
Homeసినిమాకమర్షియలిజానికి కొత్తనడకలు నేర్పిన నిత్యస్వాప్నికుడు

కమర్షియలిజానికి కొత్తనడకలు నేర్పిన నిత్యస్వాప్నికుడు

వారసత్వంగా స్వీకరించిన విద్యకు కాస్త ఒరవడిని మార్చి.. ట్రెండును ఆకళింపు చేసుకుని.. పాతతరాన్ని ఉర్రూతలూగించడం.. కొత్తతరంతో ఈలలేయించడం.. ఇలా ఎన్నో విద్యలను నేర్చిన ఘనాపాటి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు 1942 మే 23న జన్మించారు. బాబు సినిమాతో దర్శకుడైన ఈ ట్రెండ్ సెట్టర్.. తండ్రి కె.ఎస్.ప్రకాశరావు తీరుకు భిన్నంగా తనదైన బాణీలో ఇండస్ట్రీలో కాలుమోపారు. భారీ సెట్టింగులు.. కళ్లు చెదిరే క్లైమాక్స్ లకు పెట్టింది పేరుగా మారారు. 1977లో అడవిరాముడు సినిమా ద్వారా దర్శకత్వ ప్రతిభను అందరికీ తెలిసేలా.. అందరూ హర్షించేలా చేశారు. తన కెరీర్ ప్రారంభించిన ఇరవై ఏనిమిదేళ్లకే రాఘవేంద్రరావు ఖాతాలో నూరు సినిమాలు చేరడం విశేషం.

మూడు తరాలు ముచ్చటించుకునే స్థాయిలో ఆ సినిమాలు తెరకెక్కించడంతో అతని గొప్పతనాన్ని చాటాయి. కథానాయికలను రసరమ్యంగా చూపించి సరసానికి, శృంగారానికి మన్మథ గుబాళింపులను ఆపాదించే ఈ దర్శకేంద్రుడు అన్నమయ్య, మంజునాథ, శ్రీరామదాసు, శిరిడి సాయి..తదితర భక్తిరస చిత్రాలను తెరకెక్కించి కొత్తతరం వారిని కూడా సంకీర్తనా సంరంభాల జడివానలో పరవశ పిపాసలుగా చేసిన ఘనత సముపార్జించుకున్నారు. సినిమా రంగాన్ని ఫక్తు కమర్షియల్గా చేసి, ప్రేక్షకులకు వినోదాన్ని పంచి, యూనిట్ మొత్తాన్ని ఆర్థిక, పరిపుష్టిలో తులతూగేలా చేయడమే కాదు, నాయకా నాయకలను తెలుగు వారి మనసుల్లో పది కాలాల పాటు నిలిచిపోయేలా చేయగలిగారు.

ప్రతి చిత్రానికి తనకో ఫార్ములా ఉందంటూ ఆడియో నుంచి వెండితెర వరకు ప్రేక్షకులను ఆసక్తిగా ఎదురు చూసేలా చేసిన రాఘవేంద్రరావు దర్శకత్వంలో సెంచరీ చేసి నౌటౌట్ గా ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పెళ్లిసందడి సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయన దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు. త్వరలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. కమర్షియలిజానికి కొత్త నడకలు నేర్పిన నిత్యస్వాప్నికుడు, దర్శకేంద్రుడు పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలి.. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని ఆశిస్తూ.. జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్