పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించినా ఆ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నందిగ్రామ్ లో ఓటమి పాలయ్యారు. రౌండ్ రౌండుకి ఫలితం మమత బెనర్జీ – బిజెపి అభ్యర్ధి సువేందు అధికారి మధ్య దోబూచులాడింది. చివరకు 17వ రౌండ్ పూర్తయ్యే నాటికి మమత 1200 ఓట్ల మెజార్టీ సాధించినట్లు వార్తలొచ్చాయి. కాని సువేందు అధికారి 1622 ఓట్ల మెజార్టితో విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఈ విషయమై మమత స్పందించారు. ఎన్నికల సంఘం బిజెపి ప్రతినిధిగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. నిజానికి తాను 221 ఓట్లతో గెలిచానని కానీ ఫలితాన్ని వక్రీకరించారని విమర్శించారు. నందిగ్రామ్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని, త్వరలోనే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు.