జమునా హేచరీస్ పై సక్రమ పద్ధతిలో విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. విచారణ రాచమార్గంలో జరపాలని, బ్యాక్ డోర్ నుంచి కాదని అభిప్రాయపడింది. ముందుగా నోటీసులిచ్చి తగిన సమయం ఇచ్చి విచారణ చేయాలని సూచించింది. మే 1, 2 తేదిల్లో జరిపిన విచారణను పరిగణన లోకి తీసుకోవద్దని, ప్రభుత్వం చట్ట ప్రకారం వ్యవహరించాలని వ్యాఖ్యానించింది.
ప్రతివాదులకు నోటిసులు జారీ చేసిన హై కోర్ట్ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూలై 6వ తేదీకి వాయిదా వేసింది.
కలెక్టర్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా వుందని, తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా తమ కంపెనీలోకి వెళ్లి విచారణ చేపట్టారని జమునా హెచరీస్ నేడు హైకోర్ట్ ను ఆశ్రయించింది. తమను అరెస్ట్ చెయ్యకుండా, ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్ట్ ని కోరింది.