Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంసిరా అయిపోని పెన్ను

సిరా అయిపోని పెన్ను

Long lasting Pen: నోటి మాట గాల్లో కలిసిపోతుంది. చేతి రాత కలకాలం మిగిలి ఉంటుంది. అందుకే…మాటలు చెప్పడం కాదు...కావాలంటే రాసిస్తా…అంటుంటాం. అక్షరాలా రాసిన అక్షరానికే…చేసిన చేవ్రాలు…సంతకానికే విలువ.

మాట్లాడిన వ్యక్తి మాటలో అక్షరాలు, అతడు/ఆమె రాసిన అక్షరాలు భాషాపరంగా అక్షరాలా ఒకటే. కానీ మాటకు విలువ ఉండదు. అదే మాట లిపి రూపమయిన రాసిన అక్షరానికి మాత్రం అంతులేని విలువ ఉంటుంది. మాటను గౌరవించని మనుషులు…రాతను మాత్రం గౌరవిస్తారు. అంటే రాసుకున్న మాటలకే న్యాయబద్దమయిన విలువను అంగీకరించి…మాట్లాడుకున్న మాటలకు విలువ లేదని మనకు మనమే ఒప్పేసుకున్నాం. లేదా మాట మీద నిలబడలేక మనకు మనమే మన మాటల విలువను పోగొట్టుకున్నాం.

పద్నాలుగేళ్ల అరణ్యవాసం అని దశరథుడి ముందు కైకేయి చెబితే…ఏదీ రాజముద్ర వేసి, రాజు సంతకం చేసిన ఆర్డర్ కాపీ చేతికివ్వు…అని రాముడు రాతకోతల గురించి అడగనే లేదు. 12 ఏళ్లు అరణ్యవాసం, ఒక్క ఏడు అజ్ఞాతవాసం అని దుర్యోధనుడు వికటాట్టహాసం చేయగానే… తారీఖులు దస్తావేజులు రాసి చేతికివ్వు…అప్పుడు చూస్తాం…అని పాండవులు అనలేదు. ఆరోజుల్లో మాటంటే మాటే. ఇప్పుడు రాసుకున్నదొక్కటే న్యాయస్థానాల్లో నిలబడే మాట. మిగతాదంతా సొల్లు మాట!

అందుకే పెళ్లికయినా రాతకోతలే ముఖ్యం. లగ్న పత్రిక రాసుకుని దాన్నొక లీగల్ డాక్యుమెంట్ గా అనుకోకపోతే మనకు ఆ తంతు ముగిసినట్లు కాదు. విద్యార్థి క్లాసులో ఎంత గొప్పగా మాట్లాడినా… అంతే గొప్పగా పరీక్షలో రాస్తేనే గొప్ప.

చివరికి- చిత్తు కాగితం మీద అయినా రాసుకుని ఉంటేనే ఒక లెక్క. లేకపోతే ఒట్టి మాటలు లెక్కలోకే రావు. ఓం నమః శివాయ అని పలక మీద బలపంతో అక్షరాభ్యాసం చేయించడంలో ఉద్దేశం కూడా వాక్కుకు లేదా అక్షరాలకు మూలమయిన శివుడు మన చేత బాగా రాయించాలని. మన రాతను బాగుచేయాలని. మన అక్షరాలు క్షయం కాకుండా ఉండాలని. పలకకు బలపం రాత; కాగితానికి పెన్సిల్, పెన్నురాత.

బాల్యంలో పెన్సిల్ దాటి పెన్ను పట్టుకుంటుంటే…సమస్త భూమండలాన్ని జయించిన సర్వంసహా చక్రవర్తి విజయగర్వంతో తొలి సంతకం చేయడానికి పెన్ను క్యాప్ తీస్తున్న అనుభూతి కలిగేది. ఇదివరకు పెన్నులో ఇంకు పోసుకోవడం రాకెట్ సైన్సు కంటే పెద్ద విజ్ఞానం. ఆ ఇంకు పెన్నులో కంటే స్కూల్ యూనిఫామ్ చొక్కాలమీదే ఎక్కువగా ఒలికేది. ఇంకు చుక్కలతో ఆ చొక్కాలకు కొత్త శోభ వచ్చేది. చేతి వేళ్ల నిండా ఇంకు మరకలే. నెమ్మదిగా ఇంకు పెన్నుల వైభోగం ఇంకిపోయింది. బాల్ పాయింట్ పెన్నులు దూసుకు వచ్చాయి. బంగారు వన్నెల పాళీతో ఇంకు పెన్ను లిఖించిన బంగారు అక్షరాల అందం, రంగు, పొంగు, ఒయ్యారం అక్షరాలకందనిది. బాల్ పెన్ను గీతలు సైజ్ జీరో మోజులో కరువుకు బ్రాండ్ అంబాసడర్ అయిన రాతలు. ఇప్పుడు ఇంకు పెన్ను వాడేవారిని పాతరాతి యుగం మనుషులుగా చూస్తారు.

తాజాగా హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్లో 70 ఏళ్ల పాటు రాసుకోదగ్గ పెన్ను అమ్మకానికి పెట్టారు. ఇందులో గడ్డ కట్టిన ఇంకును నింపి ఉంచుతారు. అలాగని ఇది పెన్సిల్ సీసం కాదు. ఎంత వేడిలో అయినా, చలిలో అయినా…చివరికి అంతరిక్షంలో అయినా రాయవచ్చు. సిరా నింపుకోవాల్సిన అవసరం లేకుండా హీనపక్షం డెబ్బయ్ ఏళ్ల పాటు రాస్తూనే ఉండవచ్చు.

జుట్టుకు రంగులు రాసుకోవడానికి మనకు టైమ్ సరిపోవడం లేదు. ఇలాంటి పెన్నులు కొని ఏమి రాస్తాం? అయినా ఫోన్లో టైపింగ్, లిపిలేని ఇమోజి భాషలు వచ్చాక ఒత్తడమే కానీ…రాయడం మరచిపోయాము కదా?

ఏ అన్నమయ్యకో, పోతనకో, రామదాసుకో ఇలాంటి పెన్ను ఒక్కటి దొరికి ఉంటే...మరో పది వేల సంవత్సరాలకు సరిపడా అక్షయమయిన సాహితీ అక్షరాలను మనకు ఇచ్చి ఉండేవారు.

దేనికయినా రాసి పెట్టి ఉండాలి!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

అక్షర తూణీరం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్